logo

పాలిసెట్‌లో ప్రతిభతోనే ఆర్జీయూకేటీ ప్రవేశాలు

పాలిసెట్‌ రాసే విద్యార్థులకు ఈ ఏడాది రెండు ర్యాంకులు కేటాయించనున్నారు. ఎస్‌బీటీఈటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఒక ర్యాంకును, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశం కోసం విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఏదో ఒక కోర్సు కోసం మరో ర్యాంకును ఇస్తారు.

Published : 24 May 2022 03:51 IST

 

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: పాలిసెట్‌ రాసే విద్యార్థులకు ఈ ఏడాది రెండు ర్యాంకులు కేటాయించనున్నారు. ఎస్‌బీటీఈటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఒక ర్యాంకును, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశం కోసం విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఏదో ఒక కోర్సు కోసం మరో ర్యాంకును ఇస్తారు. రెండేళ్ల ఇంటర్మీడియట్‌తోపాటు నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కలిపి సమీకృత బీటెక్‌ కోర్సు అందించనున్నారు. పాలిసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలు కల్పించనున్నారు. దీంతో పాలిసెట్‌కు పోటీ పెరుగుతోంది.

దరఖాస్తు ఇలా..

పదో తరగతి మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి 18 ఏళ్లలోపు ఎసీ్సీ, ఎసీ్టీలకు 21 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 12 రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తారు. విద్యార్థులు పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్లు ప్రాతిపదికన ఒక్కో విద్యార్థికి రెండు ర్యాంకులు కేటాయించి వారికి ఆసక్తి ఉన్న కోర్సులో చేరేందుకు అవకాశం కల్పిస్తారు.

జూన్‌ 4 వరకు అవకాశం

పాలిసెట్‌ కోసం దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభమైంది. జూన్‌ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు అందులో ట్రిపుల్‌ ఐటీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ)లో సీటు దక్కించుకోవడానికి పదో తరగతి విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌కు ముందు 2019 వరకు పదో తరగతిలో వందల సంఖ్యలోనే విద్యార్థులు మాత్రమే పది గ్రేడ్‌ పాయింట్లు సాధించగా గతేడాది వేల మంది పది గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. దీంతో పదో తరగతిలో గ్రేడ్‌ పాయింట్లు కాకుండా పాలిసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా బాసర ఆర్జీయూకేటీలో సీీట్లు కేటాయించనున్నారు.

ప్రతిభ ఆధారంగా..

పాలిసెట్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా పాలిటెక్నిక్‌, ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా, పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో డిప్లొమా కోర్సులు, బాసర ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశం పొందొచ్ఛు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఈ అవకాశం కల్పించింది. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పాలిసెట్‌లో మంచి మార్కులు సాధిస్తే ట్రిపుల్‌ ఐటీలో చేరడం సులువు అవుతోంది.

జిల్లాల వారీగా పదో తరగతి విద్యార్థుల వివరాలు

సూర్యాపేట : 12,563

నల్గొండ : 19,907

యాదాద్రి : 9,488

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: పెరుమాళ్ల యాదయ్య, ప్రిన్సిపల్‌, సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. పాలిసెట్‌లో ఉత్తీర్ణత మార్కులు సాధించేలా చదువుకోవాలి. ఇంటర్‌మీడియట్‌ చదువుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తుండటంతో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సమయం తక్కువగా ఉండటంతో ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని