logo

యాదాద్రిలో శివకేశవులకు ఆరాధనలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం హరి, హరులను ఆరాధిస్తూ ఆలయాల్లో పూజలు కొనసాగాయి. వేకువ జామున మూలవర్యులకు హారతి నివేదించి సుప్రభాత సేవ చేపట్టారు.

Published : 24 May 2022 04:10 IST


శివుడిని ఆరాధిస్తున్న పూజారులు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం హరి, హరులను ఆరాధిస్తూ ఆలయాల్లో పూజలు కొనసాగాయి. వేకువ జామున మూలవర్యులకు హారతి నివేదించి సుప్రభాత సేవ చేపట్టారు. అనుబంధ శివాలయంలో శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరుడిని మేల్కొలుపుతూ నిత్యారాధనలు నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయంగా ప్రధానాలయంలో, శైవాగమ పద్ధతిలో శివాలయంలో పూజలు జరిగాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తూ అభిషేకం, అర్చన నిర్వహించిన పూజారులు దర్శనమూర్తులకు స్వర్ణపుష్పార్చన జరిపారు. అష్టభుజి మండపంలో నిత్యకల్యాణోత్సవాన్ని కనుల పండువగా జరిపారు. శాస్త్రోక్త పర్వాలలో భాగంగా కల్యాణ మూర్తులను గజవాహనంపై అధిష్టింపచేసి సేవోత్సవాన్ని చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అష్టోత్తరంలో పలువురు భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. సోమవారం ప్రత్యేకతన శివుడిని ఆరాధిస్తూ మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని పూజారులు విశేషంగా చేపట్టారు. బిళ్వపత్రాలతో స్వామిని అర్చించారు. పార్వతిని దేవిని కుంకుమతో అర్చిస్తూ కొలిచారు. శాస్త్రోక్త పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి భక్తుల తాకిడి కొనసాగింది. కల్యాణకట్ట, లక్ష్మి పుష్కరిణి కోలాహలంగా మారింది. కొండ కింద పాత గోశాలలో వ్రత పూజలు చేపట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానానికి వివిధ విభాగాల నుంచి రూ.21,40,028లు నిత్యాదాయంగా వచ్చాయని ఈవో గీత తెలిపారు.


పుష్కరిణి వద్ద భక్తుల పుణ్యస్నానాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని