logo

ఎవరైతే సానుకూలం?

రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామనే వరంగల్‌ డిక్లరేషన్‌ను ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మరోవైపు గతంలో

Published : 25 May 2022 02:49 IST

గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన వారిని తిరిగి చేర్పించే పనిలో నాయకులు

ఈనాడు, నల్గొండ: రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామనే వరంగల్‌ డిక్లరేషన్‌ను ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మరోవైపు గతంలో కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేసి ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను తిరిగి పార్టీలో చేరే విధంగా ఎజెండా రూపొందిస్తున్నారు. దేవరకొండ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, సాగర్‌ నియోజకవర్గాల్లో ప్రస్తుతం రచ్చబండ కార్యక్రమం క్షేత్రస్థాయిలో కొనసాగుతోంది. ఇందులో రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పాల్గొంటుండటంతో క్షేత్రస్థాయిలో అప్పుడే రాజకీయ కోలాహలం నెలకొంది. పార్టీ పరంగా ఇంకా ఇన్‌ఛార్జిలు లేని ఆలేరు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లా నేతలు ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జిలను నియమించనున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు. తుంగతుర్తి పార్టీ ఇన్‌ఛార్జిని సైతం త్వరలోనే మార్చే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చేరికల కమిటీకి సీనియర్‌ నేత జానారెడ్డి ఛైర్మన్‌గా ఉండటంతో ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరిని పార్టీలో చేర్చుకుంటే సానుకూలంగా ఉంటుందో అనే దానిపై పార్టీ నాయకులు వివరాలు సేకరిస్తున్నారు.

వీడని వర్గ విభేదాలు

ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యక్రమాలు జోరందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెల్లడించారు. ఇక్కడి నుంచి టిక్కెట్‌ ఆశిస్తూ గత కొన్నాళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దుబ్బాక నర్సింహరెడ్డి భవిష్యత్తు కార్యచరణపై దృష్టి పెట్టారు. ఉమ్మడి జిల్లా సీనియర్‌ నాయకులే పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల చౌటుప్పల్‌లో జరిగిన అసమ్మతి కార్యక్రమానికి ఈయన నాయకత్వం వహించారు. మరోవైపు తుంగతుర్తి వ్యవహారం పార్టీలో చినికి చినికి గాలివానగా మారుతోంది. మాజీ మంత్రులు దామోదర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఉమ్మడి జిల్లాలో పార్టీ వ్యతిరేకులకు మద్దతిస్తున్నారని ఆరోపిస్తూ ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అద్దంకి దయాకర్‌ గతంలో పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఆయనపై కొంత మంది పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఇక్కడ పార్టీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. దీంతో అద్దంకి దయాకర్‌ ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ ముఖ్యులు, దిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. భవిష్యత్తు కార్యాచరణపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో తిరిగి హుజూర్‌నగర్‌ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో... గత కొంత కాలంగా కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో తరచూ సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పార్టీ టిక్కెట్‌ ఆశిస్తున్న పురపాలిక పార్టీ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్‌) దూకుడుగా వెళుతున్నారు. ఇక్కడ పార్టీకి క్యాడర్‌ ఉన్నా గత కొంత కాలం నుంచి నాయకత్వ సమస్యతో ఉండటంతో దాన్ని భర్తీ చేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతున్నా పార్టీ శ్రేణులు బీఎల్‌ఆర్‌ వెంట ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆలేరు, నకిరేకల్‌లోనూ పార్టీ క్యాడర్‌ ఉన్నా పార్టీకి నాయకత్వ సమస్య వేధిస్తుండటంతో ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మునుగోడు, నల్గొండలో పార్టీ పరిస్థితి విచిత్రంగా మారింది. ఇక్కడ ఇప్పటి వరకు పీసీసీ అధికారిక కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో ఈ విభేదాలు పూర్తిగా పరిష్కరించడంతో పాటు పార్టీ పరిస్థితిపై సమగ్రంగా సమీక్ష చేయడానికి పీసీసీ నాయకత్వం దిల్లీ పెద్దలతో త్వరలోనే నల్గొండ జిల్లా కేంద్రంగా భారీ సభ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని