logo

లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు

మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రక్షణ చర్యలు, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి

Published : 25 May 2022 02:49 IST

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి

భువనగిరి: సమీక్ష సమావేశంలో జ్యోతి వెలిగిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్‌

ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి, చిత్రంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, తదితరులు

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రక్షణ చర్యలు, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, కమిషన్‌ సభ్యులతో కలిసి మంగళవారం అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని, ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్‌ సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న మహిళలను గుర్తించి వారి జీవనోపాధికి యూనిట్లు మంజూరు చేయాలన్నారు. గర్భిణులకు ఆడ, మగ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి స్కానింగ్‌ సెంటర్లను మూసి వేయించాలని ఆదేశించారు. వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్లకు వచ్చే మహిళలపై గౌరవం చూపాలని, అవసరమైతే సఖి, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రాలకు పంపించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌ల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో షీటీంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై వైద్య శాఖ ప్రత్యేక శ్రద్ద కనబరచాలని, గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో తప్పనిసరిగా మెనూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులు షహీన్‌ అఫ్రోజ్‌, కుమ్మ ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుద్దం లక్ష్మి, కటారి రేవతి, డీసీపీ నారాయణరెడ్డి, డీఆర్డీవో మందడి ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మహిళా సంఘాలు, ఆశా, ఏఎన్‌ఎంలు కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులతో మహిళా హక్కులు-సాధికారితపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. మహిళలకు కల్పించే రక్షణ చట్టాలు, హక్కులపై గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కమిషన్‌ నిర్వహించే బాధ్యతలను రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యదర్శి కృష్ణవేణి వివరించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, గృహహింసకు సంబంధించిన రక్షణ చట్టాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా హైకోర్టు న్యాయవాది మంజూష అవగాహన కల్పించారు. సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ బండారు జయశ్రీ, సఖి కేంద్రం కోఆర్డినేటర్‌ ప్రమీల, డిప్యూటీ డీఎం హెచ్‌వో యశోద మాట్లాడారు.

భువనగిరి గ్రామీణం: జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారిణి కేవీ కృష్ణవేణితో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించారు. నిర్వాహకురాలు ప్రమీల, లావణ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని