logo

నిమ్మకు నీరసం

అధిక ధరకు మార్కెట్‌లో నిమ్మకాయలు కొనుగోలు చేసినా.. రసం లేక వినియోగదారులకు నీరసం వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితిని ప్రస్తుతం నిమ్మ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు.

Published : 26 May 2022 02:23 IST

నకిరేకల్‌, న్యూస్‌టుడే

అధిక ధరకు మార్కెట్‌లో నిమ్మకాయలు కొనుగోలు చేసినా.. రసం లేక వినియోగదారులకు నీరసం వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితిని ప్రస్తుతం నిమ్మ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు.

గత అక్టోబరు నుంచి జనవరి వరకు అధిక వర్షాలు, మంచు తేమ కారణంగా నిమ్మ పూత, పిందె దెబ్బతింది. తెగుళ్లు సోకడంతో దిగుబడిపై ప్రభావం పడింది. రాష్ట్రంలో 90 శాతం నిమ్మ ఉమ్మ నల్గొండ జిల్లాలోనే సాగవుతోంది. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. నకిరేకల్‌లో మార్కెటింగ్‌ శాఖ నిర్వహణలో ఉన్న రాష్ట్రంలోనే ఏకైక నిమ్మ మార్కెట్‌కు గతేడాది ఏప్రిల్‌, మే నెలల్లో రోజుకు పదివేల బస్తాల(ఒక్కో బస్తా 25 కిలోలు) వరకు వచ్చాయి. ఈ ఏడాది మూడు వేలకు మించకపోవడంతో ఏ మేరలో ప్రభావం పడిందో స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ సాగు చేస్తున్నారు. గతంలో ఇక్కడి పంటలో 80 శాతం వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యేది. ప్రస్తుతం 40 నుంచి 50 శాతం పంట ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. మిగతాది స్థానిక మార్కెట్లకు రిటేల్‌ అమ్మకాల కోసం వెళుతోంది. దిగుబడులు తగ్గడంతో నిమ్మకు ధర పెరిగింది. వర్షాలు పడినా, ఎండలు తగ్గినా నిమ్మ వినియోగంపై ప్రభావం పడుతుంది. ధర ఉన్నపుడే పంటను అమ్ముకోవాలని రైతులు భావిస్తున్నారు. ఫలితంగా పారుగాయలు(ఇంకా పక్వానికి రాని) తెంపి మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. కాస్త సైజు ఉన్న కాయలకు ఈ సీజన్‌లో టిక్కి(25 కిలోలు)కి రూ.2500 నుంచి రూ.3 వేల వరకు ధర పలికింది. పారుగాయలు రూ.700 నుంచి 1200 వరకు పలికింది. దీంతో రైతులు పెద్ద కాయలతోపాటు పారుగాయలను అధికంగా విక్రయానికి తీసుకొస్తున్నారు. చిన్న వ్యాపారులకు ఒక్కో పారుగాయ ఒకటి నుంచి రెండు రూపాయలకు లభిస్తే వారు మార్కెట్‌లో వినియోగదారులకు రూ.5 నుంచి 10 పైగా విక్రయించడం గమనార్హం.

నకిరేకల్‌ మార్కెట్‌కు వస్తున్న అధికంగా చిన్నసైజు నిమ్మకాయలు ఉన్న బస్తాలు


అధిక ధరతో కొనుగోలు చేసినా..

- గునగంటి రాజు, హోటల్‌ యజమాని, నకిరేకల్‌

మా హోటల్‌లో రోజు 300 నిమ్మకాయల వరకు అవసరం ఉంటుంది. అధిక ధర పెట్టి కొనుగోలు చేసినా కాయల్లో రసం ఉండటం లేదు.రెండు కాయలు పిండినా చెంచాడు రసం రావడంలేదు. ఇలాంటి నిమ్మకాయలు ఎందుకు తెస్తున్నారని వినయోగదారులు వాపోతున్నారు.


ఫొన్లు చేసి అడుగుతున్నారు

- యానాల కృష్ణారెడ్డి, నిమ్మ రైతు సంఘం ప్రతినిధి

ఇటీవల హైదరాబాద్‌ కూకట్‌పల్లి నుంచి ఒక వినియోగదారుడు ఫొన్‌ చేశారు. మార్కెట్‌కు అన్ని రసం లేని నిమ్మకాయలే వస్తున్నాయి. రసం ఉన్న కాయలు మీ వద్ద లేవా అని అడిగారు. మూడేళ్ల నుంచి నిమ్మకు ధర లేక తీవ్రంగా నష్టపోయాం. ప్రస్తుతం ధర ఉండటంతో అర, ముప్పావు సైజు ఉన్న కాయలు తెంపుతున్నార. ధర ఎపుడు తగ్గుతుందోననే ఆందోళన చిన్నసైజు రసం లేని కాయలు మార్కెట్‌కు రావడానికి కారణం. వాటికీ వ్యాపారులు ధర ఇస్తున్నారు.


పక్వానికి వచ్చిన కాయల్లోనే పోషక విలువలు - రావుల విద్యాసాగర్‌, ఉద్యాన క్లస్టర్‌ అధికారి

పక్వానికి వచ్చిన కాయల రసంలోనే పోషక విలువలు ఉంటాయి. రైతులు వీటినే మార్కెట్లకు పంపడం మంచిది. మన జిల్లా నిమ్మకు జాతీయ, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఇంత పేరున్న ఈ ప్రాంతం నుంచి రసం లేని నిమ్మకాయలు ఎగుమతి అయితే అది మన భవిష్యత్తుకు అంత మంచిది కాదు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని