logo

పచ్చని ఒడ్డు.. ప్రగతికి మెట్టు

రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోంది. రోడ్ల వెంట, ప్రభుత్వ భూములు, కార్యాలయాలు.. ఇలా ఎక్కడ

Published : 26 May 2022 02:23 IST

ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏపూర్‌లో పాలేరు ఒడ్డున హరితహారం నర్సరీ

నూతనకల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోంది. రోడ్ల వెంట, ప్రభుత్వ భూములు, కార్యాలయాలు.. ఇలా ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా మొక్కలు నాటి సంరక్షించాలని నిర్ణయించింది. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడి మానవాళికి మేలు జరుగుతుందని భావిస్తోంది. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చిస్తోంది. అధికారులు చొరవ చూపితే ఏటి ఒడ్డును కూడా ఆహ్లాదానికి, పచ్చదనానికి నెలవుగా మార్చవచ్చునని ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏపూర్‌ ఉదంతం చాటిచెబుతోంది. ఇదే మాదిరిగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని పాలేరు ఒడ్డును మార్చాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

ఏపూర్‌లో పచ్చదనం

ఏపూర్‌లో శ్మశానవాటిక, నర్సరీ, పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్‌ షెడ్‌ నిర్మాణానికి అనువైన స్థలం లేకపోవడంతో గ్రామంలోని పాలేరు ఒడ్డును వినియోగించుకోవాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేసింది. పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక, హరితహారం నర్సరీ, సెగ్రిగేషన్‌ షెడ్డు నిర్మాణానికి పూనుకుంది. పదేళ్లలో ఏటి ఒడ్డు పచ్చదనానికి అడ్డాగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ కార్యాలయానికి కాకుండా ఏటి ఒడ్డున ఉన్న పల్లె ప్రకృతివనానికి ఎక్కువగా వెళ్తుండటం గమనార్హం.

సూర్యాపేట జిల్లాలో..

పాలేరు ఒడ్డులు కంపచెట్లతో నిండి నిరుపయోగంగా మారాయి. నూతనకల్‌ మండలం తాళ్లసింగారం, యడవెల్లి, వెంకేపల్లి, గుండ్లసింగారం, లింగంపల్లి, మాచినపల్లి, బిక్కుమళ్ల, మద్దిరాల మండలం ముకుందాపురం, జి.కొత్తపల్లి, మామిండ్లమడవ, ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో పాతర్లపహాడ్‌, ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, ఏపూర్‌, మిడతనపల్లి, కొత్తగూడెంలో ఏటివెంట భూములు దర్శనమిస్తున్నాయి. ఆయా స్థలాల్లో ఏటికి రెండువైపులా ఒడ్డున మొక్కలు నాటి ఏపుగా పెంచగలిగితే.. గలగలపారే గోదావరి జలాల వెంట ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.

శ్రమిస్తే సత్ఫలితం..!

పాలేరు ఏటి ఒడ్డు వెంట రైతుల భూముల సరిహద్దులు గుర్తించటానికి రెవెన్యూ అధికారులు కాస్త శ్రమించాలి. ఒడ్డున నాటిన మొక్కలు పెంచడానికి రైతులనే సంరక్షకులుగా నియమించి వారికి రెండేళ్లు ఉపాధి హామీ పథకం కింద వేతనాలు అందించాలి. నాటిన మొక్కలు ఏపుగా పెరిగేలా శ్రమిస్తే చెట్టుమీది ఫలం రైతులదేనని భరోసా కల్పిస్తే ఏటి వెంట పచ్చని వనాలు కళకళలాడతాయి.

జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం

-ఇందిర, ఎంపీడీవో, నూతనకల్‌

పాలేరు ఒడ్డున ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతేడాది రెవెన్యూ అధికారులను సంప్రదించాం. రైతుల ఆధీనంలో ఉన్నాయని బదులిచ్చారు. ఈ భూములను ఉపాధి హామీ పథకం కింద చదును చేసి మొక్కలు నాటిస్తే కూలీలకు పనులు కల్పించడంతోపాటు ఏటి వెంట పచ్చదనం వృద్ధి చెందుతుంది. ఇదే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని