logo

ఉత్తర్వులకు నిరీక్షణే..

జాతీయ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు ప్రభుత్వ ఆదేశాల కోసం రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేపట్టినందుకు

Published : 26 May 2022 02:23 IST

భూమి చదును చేస్తున్న ఉపాధిహామీ కూలీలు

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జాతీయ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు ప్రభుత్వ ఆదేశాల కోసం రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020 జూలైలో క్షేత్ర సహాయకులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద చేపట్టే పనుల పర్యవేక్షణ బాధ్యతలు పూర్తిగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. పని భారం కారణంగా బాధ్యతలకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నామని కార్యదర్శులు పలు మార్లు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్ర సహాయకులు ఉపాధి హామీ పథకంలో ఏడేళ్లుగా పని చేస్తున్న తమకు వేతనాలు పెంచాలని కోరితే తొలగించడం న్యాయంకాదని తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నిరవధిక ఆందోళనలు నిర్వహించారు. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని కేసీఆర్‌ ప్రకటించారు. క్షేత్ర సహాయకుల్లో ఆశలు మొదలయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 1740 పంచాయతీలుండగా 1029 మంది క్షేత్ర సహాయకులు ఉండేవారు. వీరందరూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హాయంలో నియమించినవారు. అప్పట్లో ఆ పార్టీకి అనుకూలంగా పని చేసే వారిని ఎంపిక చేశారనే ఆరోపణలుండేవి. తాజాగా వచ్చిన మార్పులతో మేట్‌లకు అవకాశం కల్పించారు. వంద రోజుల పనుల్లో పాల్గొన్న వారికి మేట్‌లుగా అవకాశం దక్కింది. అధికారం మారిన క్రమంలో కొన్ని పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను డమ్మీ చేసి మేట్‌ల ద్వారా వ్యవస్థను నడిపించారు. స్థానిక నేతలు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పాత వారికే అవకాశం కల్పిస్తారా లేక నిబంధనల్లో మార్పు చేసి కొత్తగా విద్యార్హత ఉన్నవారికి అవకాశం కల్పిస్తారా అన్నదానిపై స్పష్టత రావల్సి ఉంది.

గతంలో క్షేత్ర సహాయకులు

తొలగించిన క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలో ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక్కో గ్రామంలో యాబై నుంచి మూడు వందల మంది వరకు కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల పనులు కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా ఉదయం, సాయంత్రం పనులు చేస్తున్నారు. పనుల వివరాలు, కూలీల హాజరు పరిశీలన భారంగా ఉందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. జూన్‌ 8 నాటికి రుతుపవనాలు వస్తే కూలీలు పనులు మాని సొంత వ్యవసాయ పనులకు వెళ్తారు. అంతలోపే క్షేత్ర సహాయకులను తీసుకుంటే వారికి పని ఉంటుంది. లేకుంటే తర్వాత తీసుకున్నా హరితహారం తప్ప ఉపాధి పనులు జరిగే పరిస్థితి గ్రామాల్లో ఉండదు.

వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

- అవిరెందల రవీందర్‌, క్షేత్ర సహాయకుడు, చిరుమర్తి, మాడ్గులపల్లి మండలం

క్షేత్ర సహాయకులను వెంటనే విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. ప్రస్తుతం ఉపాధి హమీ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకుంటే పనులు మరింత వేగవంతమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాం.

ఆదేశాలు రాగానే

- ఉపేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో, యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభుత్వం నుంచి ఉపాధిహామీ క్షేత్రసహాయకులను విధుల్లోకి చేర్చుకునే విషయమై శాఖాపరంగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. సర్కారు ఆదేశాలు అందగానే సంబంధిత మండల ఏపీవోలకు సమాచారం అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని