logo

ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం

దేశీయంగా డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారతదేశం దిగుమతులు చేసుకుంటున్న ఆహార పదార్థాలలో ఆయిలపామ్‌ వాటా

Published : 26 May 2022 02:23 IST

మోత్కూరు మండలం పాలడుగు నర్సరీలో పెంచుతున్న ఆయిల్‌పామ్‌ మొక్కలు

ఆలేరు, న్యూస్‌టుడే: దేశీయంగా డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారతదేశం దిగుమతులు చేసుకుంటున్న ఆహార పదార్థాలలో ఆయిలపామ్‌ వాటా అధికంగా ఉంది. దేశీయంగా సాగయ్యే నూనెగింజల పంటలు, ఆయిల్‌పామ్‌తో కేవలం 30శాతం అవసరాలు మాత్రమే తీరుతున్నాయి. మిగతా 70 శాతం అవసరాలకు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అంతర్జాతీయ విపణిలో తరచూ ఏర్పడుతున్న సంక్షిష్ట పరిస్థితుల నేపథ్యంలో నూనె దిగుమతులను తగ్గించుకునేందుకు అయిల్‌పామ్‌ సేద్యం పెంచాలని, ఇందుకు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఆరు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ప్రోత్సాహకాలు ఇలా...

ఎకరం విస్తీర్ణంలో నాటేందుకు 57 ఆయిల్‌పామ్‌ మొక్కలు అవసరం అవుతాయి. ఒక మొక్క ధర రూ.196. రాయితీ పోను కేవలం రూ.33లకే ప్రభుత్వం అందిస్తోంది. భవిష్యత్తులో మొక్కలను కూడా పూర్తి ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీ రైతులకు నూరుశాతం, బీసీలకు 90 శాతం, ఓసీలకు 80 శాతం రాయితీతో బిందుసేద్యం పరికరాలు అందిస్తోంది. ఒక కుటుంబం 12.5 ఎకరాల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. పంట ఎదుగుదల సమయంలోనూ కొంత నగదును ప్రోత్సాహకంగా అందించే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.

లాభాలు..

ఎకరాకు ఏటా రూ.2 లక్షల ఆదాయం వస్తుందని, నికర ఆదాయం రూ. లక్ష మిగులుతుందని అధికారులు చెబుతున్నారు. మొదటి ఏడాది కొంత పెట్టుబడి అవసరం కాగా తర్వాతి ఏడాది నుంచి కాత వచ్చే వరకు పెట్టుబడి అవసరం అంతగా ఉండదు. మొదటి మూడేళ్లు మొక్కల మధ్య అంతర పంటలుగా మిర్చి, పెసలు, మొక్కజొన్న, మినుములు, కూరగాయలు, అరటి, జామ, బొప్పాయి పంటలు సాగు చేయవచ్ఛు ఆరో ఏడాది తర్వాత అంతర పంటగా కోకో పండివచ్ఛు అకాల వర్షం, ఈదురు గాలులు, వడగండ్ల వర్షం నుంచి ఆయిల్‌పామ్‌ మొక్కలు తట్టుకుంటాయి.

సాగు.. కొనుగోలు

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఈసారి ఆరువేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు ఆలేరు, చౌెటుప్పల్‌, మోత్కూరు, వలిగొండ, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం) క్లస్టర్లను ఏర్పాటు చేసి అధికారులను నియమించింది. ఒక్కొక్క క్లస్టర్‌ పరిధిలో కనీసం వెయ్యి ఎకరాల్లో పండించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మోత్కూరు మండలం పాలడుగులో నర్సరీలో నాలుగు లక్షల మొక్కలు పెంచుతున్నారు. దిగుబడులను ఆయిల్‌ ఫెడ్‌ సంస్థనే కొనుగోలు చేస్తుంది.

సద్వినియోగం చేసుకోవాలి

-కె.రామకృష్ణారెడ్డి, ఛైర్మన్‌, ఆయిల్‌ఫెడ్‌ సంస్థ

ఆయిల్‌పామ్‌ సాగును విరివిగా ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడి నేలలు, వాతావరణం ఆయిల్‌పామ్‌ సాగుకు చాలా అనుకూలం. సంప్రదాయ నూనె గింజల పంటల కన్నా 4-5 రెట్లు అధికంగా దిగుబడి వస్తుంది. మొక్కలు నాటడం నుంచి సస్యరక్షణ చర్యలు, మార్కెటింగ్‌ వరకు ఆయిల్‌ఫెడ్‌ సంస్థ అండగా ఉంటుంది. రైతులు సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి ఆదాయం, లాభం చేకూరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని