logo

సమీపిస్తున్న గడువు.. నత్తనడకన పనులు

సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన బడి పథకం అమలు క్షేత్రస్థాయిలో అంతులేని జాప్యం జరుగుతోంది. పాఠశాలల పునః ప్రారంభానికి మరో పక్షం రోజుల గడువు ఉంది. కానీ నేటికీ చాలాచోట్ల పనులు ప్రారంభం కాలేదు. ఉమ్మడి జిల్లాలోని పరిస్థితిపై కథనం.

Published : 27 May 2022 03:06 IST

సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన బడి పథకం అమలు క్షేత్రస్థాయిలో అంతులేని జాప్యం జరుగుతోంది. పాఠశాలల పునః ప్రారంభానికి మరో పక్షం రోజుల గడువు ఉంది. కానీ నేటికీ చాలాచోట్ల పనులు ప్రారంభం కాలేదు. ఉమ్మడి జిల్లాలోని పరిస్థితిపై కథనం.

మన ఊరు- మన బడి పథకంలో ప్రతి జిల్లాలో మొత్తం పాఠశాలల్లో ఏటా 33 శాతం బడులు వీటి కింద ఎంపిక చేస్తారు. మూడేళ్లలో రాష్ట్రంలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక బడులన్నింటిలో వసతులు కల్పించేలా రూ.7 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఈ పథకంలో తొలి దశలో నల్గొండ జిల్లాలో 517, సూర్యాపేటలో 329, యాదాద్రి జిల్లాలో 251 బడులు ఎంపిక చేశారు. మూడు జిల్లాల్లోని బడుల మరమ్మతులకు సుమారు రూ. 330 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. తొలి దశలో ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు ప్రభుత్వం ఇటీవలే ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. అయితే పనులు ప్రారంభంలో జాప్యం నెలకొంటోంది. జూన్‌ 13 నుంచి వచ్చే ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పనులన్నీ ఆ లోపే పూర్తి చేయాల్సి ఉంది. అయితే చాలా ప్రాంతాల్లో ఇంకా పనులు టెండర్ల దశలోనే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఎంపిక చేసిన పాఠశాలల్లో పనుల పూర్తికి ఇంకా నాలుగు నెలల వరకు సమయం పట్టొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జిల్లాకు వచ్చిన రూ.2 కోట్లను ఎంపిక చేసిన పాఠశాలల్లో అవసరాలను బట్టి కేటాయిస్తున్నారు. రూ.20 లక్షల్లోపు కేటాయింపు అధికారం కలెక్టరు చేతుల్లో ఉండగా... అంచనా వ్యయం రూ.30 లక్షలు దాటితే రాష్ట్ర స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. నల్గొండ జిల్లాలో నల్గొండ, దేవరకొండ, మిర్యాగూడ డివిజన్లోని దాదాపు 24 పాఠశాలల్లో పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. సూర్యాపేట జిల్లాలో 18, యాదాద్రి జిల్లాలో 10 బడుల్లో పనులు మరో వారం పది రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం.

రూ.2 లక్షలిస్తే బడికి దాత పేరు

బడుల బలోపేతానికి దాతలు ముందుకురావాలని ప్రభుత్వం, అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇటీవలే మంత్రి కేటీఆర్‌ తన నాయనమ్మ పేరుతో కామారెడ్డి జిల్లాలో రూ.2 కోట్ల వ్యక్తిగత నిధులతో బడిని కార్పొరేట్‌ స్థాయిలో నిర్మించడానికి శంకుస్థాపన చేశా రు. ఈ స్ఫూర్తి జిల్లా ప్రజాప్రతినిధుల్లో కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.2 లక్షలకు పైన బడి బాగుకు విరాళం ఇచ్చే దాత పేరుతో తరగతి నిర్మాణం, ఆ పైన ఇచ్చే వారికి విరాళం ఆధారంగా ప్రభుత్వం వారికి గుర్తుగా పేర్లను పెట్టనుంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులూ ఈ కార్యక్రమంలో అమల్లో చురుగ్గా ఉంటేనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. ఈ పథకం కింద విడుదల చేసిన నిధులతో పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం, శౌచాలయాలు బాగు చేయడం, ప్రహరీల మరమ్మతు, తరగతి గదుల నిర్మాణం, ఫర్నిచర్‌ సౌకర్యం కల్పించడం, బడికి విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు, భోజనశాలలో సౌకర్యాలు, వంట గదుల నిర్మాణం తదితర వాటిని చేపట్టనున్న సంగతి తెలిసిందే.

ప్రారంభం నాటికి పూర్తి చేయాలని ఆదేశించాం

బడుల బాగుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. వీటిని ఎక్కడ అవసరం ఉందో, ఆయా పాఠశాలలకు కేటాయించాం. పనుల్లో వేగం పెంచి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పనులను పూర్తి చేస్తాం.

- భిక్షపతి, డీఈవో, నల్గొండ జిల్లా


జిల్లాల వారీగా పాఠశాల వివరాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని