logo

నల్గొండ, యాదాద్రిలో ప్రయోగాత్మక మిల్లింగ్‌

యాసంగి ధాన్యాన్ని సాదారణ బియ్యంగా మార్చే ప్రక్రియపై తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ సీజన్‌ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా సాదారణ బియ్యంగా మిల్లింగ్‌ చేస్తే అధిక శాతం నూకలుగా మారి నష్టం

Published : 27 May 2022 03:06 IST

హుజూర్‌నగర్‌: ఆరబెట్టిన యాసంగి ధాన్యం

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: యాసంగి ధాన్యాన్ని సాదారణ బియ్యంగా మార్చే ప్రక్రియపై తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ సీజన్‌ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా సాదారణ బియ్యంగా మిల్లింగ్‌ చేస్తే అధిక శాతం నూకలుగా మారి నష్టం వస్తుందని మిల్లర్లు స్పష్టం చేశారు. ఆ నష్టాన్ని భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సాదారణ బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌సీఐ తేల్చిచెప్పటంతో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే వచ్చే నూకశాతాన్ని తేల్చేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.  దీని కోసం ప్రతి జిల్లాలో రెండు, మూడు మిల్లుల్లో ప్రయోగాత్మక (టెస్టింగ్‌) మిల్లింగ్‌ చేపడుతున్నారు. ఈ పనిని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలోని మైసూర్‌లో ఉన్న సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ)కి అప్పగించింది. ఈ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులతో కూడిన బృందాలు జిల్లాల్లో ప్రక్రియ చేపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని 40 మిల్లుల్లో ప్రయోగాత్మక మిల్లింగ్‌ చేపట్టారు. రెండో విడత ఈనెల 27 తేదీ నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ గురువారం ప్రకటించింది. అందులో భాగంగా నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో మిల్లింగ్‌ ఈనెల 28, 29 తేదీల్లో చేయనున్నారు. సీఎఫ్‌టీఆర్‌ఐకి చెందిన ప్రధాన శాస్త్రవేత్త సత్యేంద్రరావు నేతృత్వంలో అదే సంస్థకు చెందిన మరోక అధికారి, ఇద్దరు పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వారు ఆయా తేదీల్లో రెండు జిల్లాల్లో పర్యటించి రెండు, మూడు మిల్లుల్లో ప్రయోగాత్మక మిల్లింగ్‌ చేపట్టనున్నారు. ఎక్కువ వరి రకాలు ఎక్కడ పండుతాయో ఆ జిల్లాల్లో ప్రక్రియ చేపడుతున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో అధిక శాతం సన్న రకాలుంటాయని కాబట్టి మిగిలిన జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రంలో నూకల శాతం పెరిగిందని మిల్లర్లకు చేకూరిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మిల్లర్లు వత్తిడి తెస్తున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి రావటానికి సమయం పడుతుందని సీఎఫ్‌టీఆర్‌ఐ సంస్థ చెబుతోంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని