logo

ఆన్‌లైన్‌ మూల్యాంకనం వైపు అడుగులు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అటానమస్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఇటీవల అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌

Published : 27 May 2022 03:06 IST

 నల్గొండ ఎన్జీ కళాశాలలో త్వరలో ప్రారంభం
నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే

నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అటానమస్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఇటీవల అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ప్రతి కళాశాలలో ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు సమాచారం. అందులో భాగంగా నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌)లో ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ మూల్యాంకనం వల్ల వర్సిటీల్లో కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.
పలు వర్సిటీల్లో ఈ విధానం
ఆన్‌లైన్‌ మూల్యాంకనం విధానం ప్రస్తుతం రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, ఎంజీయూ తదితర వర్సిటీలో అమలులో ఉంది. ఈ వర్సిటీలు పరీక్షలు నిర్వహించిన కొన్ని రోజులకే పారదర్శకంగా ఫలితాలు విడుదల చేసి విద్యార్థుల ఉన్నతికి తోడ్పడుతున్నాయి. ఇదే విధానం ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీ కళాశాలలో ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ భావించి, అందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది. మొత్తంగా త్వరలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలో ఆన్‌లైన్‌ మూల్యాంకనం విధానం అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి.
ప్రయోజనాలు
* ఆన్‌లైన్‌ మూల్యాంకనం తప్పులు జరిగే అవకాశాలు తక్కువ.
* జవాబు పత్రాలు భద్రపర్చేందుకు ఇబ్బందులు ఉండవు.
* మూల్యాంకనానికి ఎగ్జామినర్లు రానవసరం లేదు.
* పరీక్ష ఫలితాలు త్వరగా వెల్లడించే అవకాశం ఉంటుంది.
* విద్యార్థులు తాను రాసిన జవాబు పత్రంలో సందేహాలు ఉంటే సంబంధిత కళాశాలకు ఫీజు చెల్లించి ఆ జవాబుపత్రం త్వరగా పొందే అవకాశం ఉంటుంది.
* జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు టీఏ, డీఏలు చెల్లించనక్కరలేదు.
మా కళాశాలలో ప్రారంభిస్తాం
- చంద్రశేఖర్‌, ప్రిన్సిపల్‌, ఎన్జీ కళాశాల

ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌ మూల్యాంకనం మా కళాశాలలో త్వరలో ప్రారంభిస్తాం. ఈ విధానం ద్వారా పరీక్షల ఫలితాలు త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. జవాబు పత్రాలు భద్రపర్చేందుకు రిస్క్‌ తక్కువగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో కరోనా వ్యాధి విస్తరణ ఉన్నా ఆన్‌లైన్‌లో పేపర్‌ వాల్యూయేషన్‌కు వెసులుబాటు ఉంటుంది. ఆన్‌లైన్‌ మూల్యాంకనంతో పారదర్శకత పెరుగుతుంది.
ఫలితాలు త్వరగా ఇవ్వొచ్చు
- నాగరాజు, సీవోఈ, ఎన్జీ కళాశాల

ఆన్‌లైన్‌ మూల్యాంకనం పద్ధతి ద్వారా పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వొచ్చు. ప్రస్తుతం మా కళాశాలలో వివిధ కోర్సుల్లో 3500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రతి సెమిస్టర్‌లో పరీక్షలు పెట్టి ఎగ్జామినర్లతో వాల్యూయేషన్‌ చేయించి ఫలితాలు ఇవ్వాలంటే ఆలస్యమవుతుంటుంది. వీటన్నింటికి ఆన్‌లైన్‌ మూల్యాంకనం పరిష్కార మార్గం. విద్యార్థులకు పలు విధాలా మేలు జరుగుతుంది.  


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని