logo

రహదారి ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన మునగాలలో జాతీయ రహదారి పైవంతనపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణం శ్రీనివాసనగర్‌కు

Published : 27 May 2022 03:06 IST

విధులు ముగించుకొని వస్తుండగా..

మునగాల, న్యూస్‌టుడే: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన మునగాలలో జాతీయ రహదారి పైవంతనపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణం శ్రీనివాసనగర్‌కు చెందిన చందా వెంకట అప్పారావు (45), లక్ష్మణాచారి ఇద్దరు ఉపాధ్యాయులు. మునగాల జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షల ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. గురువారం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై మునగాల నుంచి కోదాడకు బయల్దేరారు.పైవంతెన వద్దకు రాగానే రాంగ్‌ రూట్‌లో వచ్చిన మరో ద్విచక్రవాహన చోదకుడు వేగంగా వీరిని ఢీకొట్టి పారిపోయాడు. ప్రమాదంలో వెంకట అప్పారావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు ఖమ్మంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. లక్ష్మణాచారి స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు ధర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బాలునాయక్‌ తెలిపారు.


కారు ఢీకొన్న ఘటనలో..

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని రాక్‌హిల్స్‌ కాలనీలో కారు ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి చెందినట్లు టూటౌన్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అక్కచల్మ ప్రాంతానికి చెందిన సాంఘిక  సంక్షేమ గురుకులంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సురిగి ఆండాళు (42), ఆమె భర్త మున్సిపల్‌ బిల్‌కలెక్టర్‌ సురిగి శంకర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి సమీపంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసముంటున్న సురిగి వెంకన్న ఇంటికి వెళ్లారు. రాత్రి 11 గంటల తరువాత ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో రాక్‌హిల్స్‌ కాలనీ వద్ద శంకర్‌ మూత్ర విసర్జనకు ద్విచక్రవాహనం ఆపి రోడ్డుపక్కకు వెళ్లారు. మునుగోడు రోడ్డు వైపు నుంచి నల్గొండకు వస్తున్న కారు డ్రైవర్‌ రోడ్డు పక్కన నిలబడిన ఆండాళుతో పాటు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. కారు ఆమెపై నుంచి వెళ్లడంతో బలమైన గాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో జనరల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


ప్రాణం తీసిన వేగం..

మద్దిరాల, మద్దిరాల గ్రామీణం, న్యూస్‌టుడే: లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత పడిన ఘటన గోరెంట్ల శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలుమళ్లకు చెందిన శేరి శ్రీనివాస్‌రెడ్డి(50) కుమార్తెకు ఆరు నెలల క్రితం వివాహమైంది. కూతురు పేరిట కల్యాణలక్ష్మి పథకానికి మద్దిరాల మండల కేంద్రంలో గురువారం దరఖాస్తు చేసి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై తిరుగుపయనమయ్యారు. గోరెంట్ల శివారులో జాతీయ రహదారి-365పై వెళుతున్న లారీకి డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయటంతో వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.


గేదెను ఢీకొని ఆటో బోల్తా..

కనగల్‌: మండలంలోని పర్వతగిరి గ్రామ శివారులో బుధవారం రాత్రి ఆటో గేదెను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై యు.నగేష్‌ తెలిపారు. గుర్రంపోడు మండలం చేపూరుకు చెందిన మెట్ల వెంకటయ్య (45) బుధవారం రాత్రి స్వగ్రామం నుంచి ఆటోలో వస్తుండగా పర్వతగిరి గ్రామ శివారులో గేదె అడ్డు వచ్చింది. దాన్ని ఢీకొన్న ఆటో బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న వెంకటయ్యకు తీవ్రగాయాలయ్యాయి. నల్గొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని