logo

ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ కాల్వల వెంట ప్రకృతి వనాలు: కలెక్టర్‌

ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ కాల్వలకు రెండువైపులా ఉన్న ప్రభుత్వ భూముల్లో గుర్తించిన ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలు, మెగా ప్రకృతి వనాల ఏర్పాటుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

Published : 27 May 2022 03:06 IST

సూర్యాపేటలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, చిత్రంలో అదనపు
కలెక్టర్లు మోహన్‌రావు, పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఆర్డీవో రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ కాల్వలకు రెండువైపులా ఉన్న ప్రభుత్వ భూముల్లో గుర్తించిన ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలు, మెగా ప్రకృతి వనాల ఏర్పాటుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. హరితహారం కార్యక్రమంపై కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని జలవనరుల శాఖ భూముల్లో పచ్చదనం పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతులు పొందాలన్నారు. ఎన్నెస్పీ కాల్వ వెంట 50 మీటర్లలో మెగా పల్లె ప్రకృతి వనాలు, ఎస్సారెస్పీ కాల్వ వెంట 20 మీటర్లలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎనిమిదో విడత హరితహారంలో 85 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం విధించుకున్నామని చెప్పారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ప్రాధాన్యం
సూర్యాపేట పట్టణం: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 21 క్రీడా ప్రాంగణాలను గుర్తించామని, 29 ప్రాంతాల్లో అంచనాలు తయారుచేశామన్నారు. 13 చోట్ల పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. జూన్‌ 2 నాటికి ప్రారంభించేందుకు క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, డీఎఫ్‌వో ముకుందరెడ్డి, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, కిశోర్‌కుమార్‌, వెంకారెడ్డి, డీఆర్డీవో కిరణ్‌కుమార్‌, ఏపీడీ పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.
రుణాలు సకాలంలో అందించాలి
సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: సకాలంలో రుణాలు అందేలా బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. 2021-22 నాలుగో త్రైమాసిక రుణ ప్రణాళికపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో బ్యాంకర్లతో మాట్లాడారు. రైతులకు వ్యవసాయ రుణ లక్ష్యం రూ.1,935.57 కోట్లు కాగా రూ.1,862.62 కోట్లు (96.23 శాతం) అందజేశామన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీపై, ముద్రా రుణాలను అలసత్వం చేయకుండా త్వరితగతిన  మంజూరు చేయాలన్నారు. అనంతరం 2022-23 వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని