logo

అస్తవ్యస్తం.. గందరగోళం

నల్గొండ పురపాలిక నుంచి నీలగిరి అభివృద్ధి ప్రాధికార సంస్థ (నుడా)గా మారినప్పటి నుంచి పట్టణంలో రహదారుల విస్తరణ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ పనులు అస్తవ్యస్తంగా.. గందరగోళంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం జిల్లా పాలనాధికారితో పాటు

Published : 28 May 2022 06:39 IST

నీలగిరి అభివృద్ధి పనుల్లో నాణ్యతాలోపం!

 


హైదరాబాద్‌ రహదారిలో ఓ సూపర్‌మార్కెట్‌ ముందు రహదారి నిర్మాణంలో వాడిన ఎర్రమట్టి

ఈనాడు, నల్గొండ: నల్గొండ పురపాలిక నుంచి నీలగిరి అభివృద్ధి ప్రాధికార సంస్థ (నుడా)గా మారినప్పటి నుంచి పట్టణంలో రహదారుల విస్తరణ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ పనులు అస్తవ్యస్తంగా.. గందరగోళంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం జిల్లా పాలనాధికారితో పాటు పుర కమిషనర్‌ పనులు పర్యవేక్షిస్తున్నా గుత్తేదారులు ఇవేవి పట్టించుకోకుండా పనులు చేస్తున్నారని సంబంధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ రహదారిలో రహదారి నిర్మాణం సాగుతుండగా... కంకర వేయాల్సిన చోట ఎర్రమట్టితో రహదారులు నిర్మిస్తున్నారు. అన్ని వరుసల్లో నిర్ణయించిన విధంగా కంకర మిశ్రమాన్ని వాడాల్సి ఉండగా...కింద ఎర్రమట్టి వేసి పైన కంకర వేస్తూ ఎర్రమట్టిని కప్పేస్తున్నారు. దీనిపై కమిషనర్‌ రమణాచారిని ‘ఈనాడు’ వివరణ కోరగా... క్వాలిటీ ఇంజినీర్లతో పాటూ హైదరాబాద్‌ స్థాయి అధికారులందరూ ఈ పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని, పనుల్లో నాణ్యత లోపించడమనేది ఉండదని స్పష్టం చేశారు.
మరోవైపు నల్గొండ పట్టణంలోని దేవరకొండ రహదారిలో జరుగుతున్న నకిరేకల్‌ - నల్గొండ - నాగార్జునసాగర్‌ జాతీయ రహదారి నిర్మాణ పనులు సైతం ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. రహదారి విస్తరణలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెలు మురుగు కాల్వ అవతల ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ట్రాన్స్‌కో సిబ్బంది నేరుగా మురుగు కాల్వలోనే ఏర్పాటు చేశారు. దీంతో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పనుల్లోనూ నాణ్యత లోపిస్తుందని ఏకంగా సంబంధిత ఇంజినీర్లే పెదవి విరుస్తున్నారు. కట్టిన రెండు మూడు నెలలకే బ్రిడ్జిలు, డ్రైనేజీలకు అప్పుడే పగుళ్లు రావడం గమనార్హం. ఇప్పటికైనా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పనుల నాణ్యత విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

 


దేవరకొండ రహదారిలో ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు కాల్వకు పగుళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని