logo

మధ్యాహ్నం 12 గంటలకే ఓపీ బంద్‌

చేతిలో రక్త పరీక్షల నివేదికతో నిరీక్షిస్తున్న మహిళ పేరు సూరమ్మ. భువనగిరి పట్టణంలో నివసిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం శనివారం ఉదయం 9.30 గంటల వరకు జిల్లాకేంద్రాసుపత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు రక్త పరీక్ష

Published : 29 May 2022 06:03 IST

జిల్లా కేంద్రాసుపత్రిలో సమయపాలన పాటించని వైద్యులు

చేతిలో రక్త పరీక్షల నివేదికతో నిరీక్షిస్తున్న మహిళ పేరు సూరమ్మ. భువనగిరి పట్టణంలో నివసిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం శనివారం ఉదయం 9.30 గంటల వరకు జిల్లాకేంద్రాసుపత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు రక్త పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేశారు. దీంతో రక్త పరీక్ష చేయించుకొని నివేదికతో వచ్చేసరికి మధ్యాహ్నం 12.30 గంటలైంది. అప్పటికే వైద్యులు వెళ్లిపోవడం, ఓపీ గది మూసిఉండటంతో చూసీచూసీ ఆమె ఇంటికి వెళ్లారు.


భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్రాసుపత్రిలో ఓపీ(ఔట్‌ పేషెంట్స్‌) విభాగంలో వైద్యులు సమయ పాలన పాటించకపోవడంతో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని చీటీ నమోదు కౌంటర్‌ వద్ద బోర్డు ఏర్పాటుచేశారు. కానీ, ఉదయం పది గంటలకు వస్తున్న వైద్యులు మధ్యాహ్నం 12 గంటలకే ఇంటికి వెళ్తున్నారు. 12 గంటలయితే చాలు ఓపీలో కొన్ని విభాగాల గదులు మూసి ఉంటున్నాయి. మరికొన్ని వార్డులో తెరిచి ఉంచినా వైద్యులు, వైద్యసిబ్బంది కానరారు. శనివారం జిల్లాకేంద్రాసుపత్రిలో మధ్నాహ్నం 12.15 గంటల తర్వాత ఓపీలో వైద్యులు లేకపోవడంతో అక్కడికి వచ్చిన రోగులు తిరిగి వెళ్లారు. కొంతమంది రోగులు ఉదయం ఓపీలో వైద్యుడికి చూపించుకొన్నారు. రక్త పరీక్షలకు సిఫార్సు చేయడంతో ఆ పరీక్షలు చేయించుకొని నివేదికతో వస్తే అప్పటికే వైద్యులు వెళ్లిపోవడంతో ఎవరికి చూపించాలో తెలియక, దిక్కుతోచక నిరీక్షించారు. మధ్యాహ్నం పన్నెండు తర్వాత వచ్చిన రోగులు ఓపీ విభాగంలో ఎవరూ లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు. అత్యవసర విభాగంలోని క్యాజువాలిటీ వద్దకు వెళ్లాలని సిబ్బంది వారికి సూచించారు. అప్పటికే క్యాజువాలిటీ వద్ద పది మందికి పైగా రోగులు వరుసలో నిల్చున్నారు. అప్పటికే అత్యవసర చికిత్స కోసం, ఇతర వైద్యసేవలకు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.

మంత్రి హెచ్చరించినా.. మారని తీరు

ఇటీవల జిల్లాకేంద్రాసుపత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, వైద్యావిధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సందర్శించి విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయపాలన పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేయవద్దని సమీక్ష సమావేశాల్లో, సందర్శన సమయంలో వైద్యులకు సూచించారు. అయినా వైద్యులు సమయపాలన పాటించకుండా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

వైద్యులు వార్డుల్లో ఉంటున్నారు:  చిన్ననాయక్‌, డీసీహెచ్‌

ఓపీ విభాగంలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వైద్యసేవలు అందిస్తున్నాం. ఆ తర్వాత వైద్యులు వార్డుల్లో రౌండ్స్‌, ఇతర సేవలు అందించేందుకు విధులు కొనసాగిస్తున్నారు. 12 తర్వాత వచ్చే రోగులకు క్యాజువాలిటీ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు