logo

భగీరథ.. తప్పని వ్యధ

మారుమూల పల్లెలకు మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం వచ్చినా నిర్వహణ లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల పైపులైన్‌ కలెక్షన్‌లు వేయలేదు. మరికొన్ని చోట్ల సరఫరా సరిగా చేయడం లేదు. ఎటొచ్చి ప్రజలకు వేసవిలో తాగునీటి కోసం తండ్లాట తప్పడం లేదు.

Updated : 29 May 2022 06:28 IST

మారుమూల పల్లెలకు మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం వచ్చినా నిర్వహణ లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల పైపులైన్‌ కలెక్షన్‌లు వేయలేదు. మరికొన్ని చోట్ల సరఫరా సరిగా చేయడం లేదు. ఎటొచ్చి ప్రజలకు వేసవిలో తాగునీటి కోసం తండ్లాట తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో సమస్యలను ‘న్యూస్‌టుడే’ బృందం  పరిశీలించింది. ప్రజల దాహం గోడును వినిపిస్తోంది.


నీలగిరి శివారు కాలనీల్లో కటకట

ట్యాంకరు వద్ద నీటి కోసం బారులు తీరిన ప్రజలు

నల్గొండ పురపాలిక: నల్గొండ నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ, పట్టణంలో అమృత్‌ పథకం-1 ద్వారా సురక్షితమైన తాగునీరు రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్య లేదు. నల్గొండలో కొత్తగా పుట్టుకొస్తున్న కాలనీలకు తాగునీటి సరఫరా లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులైన్లులేని ప్రాంతాలకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్లు ఏర్పాటుచేసి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అమృత్‌ పథకం-2 ద్వారా పట్టణంలో పైపులైన్లు లేని కాలనీలను గుర్తించి 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో మున్సిపాలిటీ అధికారులు సర్వే ప్రారంభించారు. నందీశ్వరకాలనీ, శ్రీరాంనగర్‌, ఎస్‌ఎల్‌బీసీ, పద్మానగర్‌, ముత్యాలమ్మకాలనీ, గోకుల్‌నగర్‌, ప్రాంతాల్లో సుమారు 50కి.మీ మేర కొత్తలైన్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.


పదేళ్ల క్రితం కాలనీ నిర్మాణం... తాగునీటికి ఇబ్బంది

అన్నిరకాల అనుమతులతో నిర్మాణమైన అగ్రిగోల్డ్‌ కాలనీ  

మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో పదేళ్లక్రితం అన్నిరకాల అనుమతులతో నిర్మించిన అగ్రిగోల్డ్‌కాలనీలో కనీసం తాగునీటి సౌకర్య కరవైంది. అద్దంకి రహదారి వరకు మిషన్‌ భగీరథ పైపులైన్లు వేసినా ఇప్పటి వరకు కాలనీ వరకు ప్రధాన పైపులైను నిర్మించలేదు. 150కి పైగా ఇళ్లు 500 మందికి పైగా జనాభా ఉంటున్న కాలనీలో తాగునీటి సమస్య వేధిస్తోంది. పట్టణంలోని ఇందిరమ్మకాలనీకి మిషన్‌ భగీరథ కనక్షన్‌లు ఇచ్చిన అధికారులు అగ్రిగోల్డ్‌కాలనీకి ఇవ్వక పోవటంతో కాలనీ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ సిబ్బందితో చర్చించి అగ్రిగోల్డ్‌కాలనీకి మిషన్‌ భగీరథ పైపులైను ఏర్పాటు చేసేలా చూస్తామని కమిషనర్‌ రవీందర్‌ సాగర్‌ తెలిపారు.


తప్పని పాట్లు


ఇటుకులపహాడ్‌లో మంచినీటి కోసం తిప్పలు

శాలిగౌరారం, న్యూస్‌టుడే: వేసవి కాలం ప్రారంభంలోనే రైతులకు, ప్రజలు నీటి సమస్యలు ఎదురయ్యాయి ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా మారింది. వారం రోజులుగా గ్రామాల్లోకి వచ్చే కృష్ణా తాగునీరందక ప్రజలు గ్రామాల్లో నీటి ట్యాప్‌ల వద్ద గంటల తరబడి ఎండలో నిరీక్షించి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ట్యాంకులకు నీరందించక పోవడం వల్లే మంచినీటి సమస్య తలెత్తిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కాగా తక్కెళ్లపహాడ్‌, ఆకారం, వల్లాల గ్రామాల్లో మాత్రం భూగర్భజలాలు అడుగుంటి పోవడంతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. కొంత మంది దాహం కోసమైతే.. మరికొంత మంది జీవనాధారం కోసం నీటికోసం పాట్లుపడుతున్నారు.


రెండు రోజులోస్తే వారం బంద్‌


గుర్రంపోడు: నడికుడలో మిషన్‌భగీరథ ట్యాంకు

గుర్రంపోడు: గుర్రంపోడు మండలం చేపూరు, మొసంగి, నడికుడ, కొత్తలాపురం, తెరాటిగూడెం, కాచారం గ్రామాల్లో ఏడాదికాలంగా మిషన్‌ భగీరథ నీరు సరఫరా సక్రమంగా రావటం లేదని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే మరమ్మతులు చేస్తామని మండల సభల్లో హామీలు ఇస్తున్న అధికారులు తర్వాత ఆ విషయంపై శ్రద్ధ చూపటం లేదు. ఒకట్రెండు రోజులు నీళ్లు వస్తే మరుసటిరోజు నుంచి నీళ్లు బంద్‌. స్థానిక తాగునీటి విభాగం అధికారులు మాత్రం మిషన్‌ భగీరథ పథకం నిర్వహణ తమది కాదని తప్పించుకుంటున్నారు. సదరు మిషన్‌ భగీరథ నీటి పథకం అధికారులు మాత్రం కనీసం మండలస్థాయిలో కూడా కానరారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పైపులైన్లు సక్రమంగా లేవా..?.. గుర్రంపోడు మండలంలోని చాలా గ్రామాలకు మిషన్‌ భగీరథ నీళ్లు నిత్యం వస్తున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో మాత్రమే ఎందుకు రావటం లేదన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పైపులైన్ల ఏర్పాటులో అవకతవకలు, నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, అందుకే తరచూ పగిలిపోతున్నట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని