logo

ప్లాస్టిక్‌ను వీడు...పర్యావరణాన్ని కాపాడు..

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మార్కెట్‌కు వెళ్లి.. ఇంటికి వచ్చేటప్పటికీ ఒక్కొక్కరి చేతుల్లో రెండుకు పైగా ప్లాస్టిక్‌ కవర్లు తీసుకుని వస్తుంటారు. ఇంతలా మనలో భాగమైన ప్లాస్టిక్‌ కవర్లు అటు పర్యావరణానికి, ఇటు ఆరోగ్యానికి ఎంతో హాని

Published : 25 Jun 2022 05:28 IST

 120 మైక్రాన్లలోపు కవర్లను నిషేధించిన ప్రభుత్వం

జులై 1 నుంచి అమల్లోకి

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మార్కెట్‌కు వెళ్లి.. ఇంటికి వచ్చేటప్పటికీ ఒక్కొక్కరి చేతుల్లో రెండుకు పైగా ప్లాస్టిక్‌ కవర్లు తీసుకుని వస్తుంటారు. ఇంతలా మనలో భాగమైన ప్లాస్టిక్‌ కవర్లు అటు పర్యావరణానికి, ఇటు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయినా ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అధికారుల అలసత్వం వెరసి నిషేధిత ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పురపాలికలు, గ్రామాల్లో ప్లాస్టిక్‌ నిషేధంపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రస్తుతం జులై 1 నుంచి 120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ కవర్లను రాష్ట్ర  ప్రభుత్వం నిషేధించింది.

గతంలో 50 మైక్రాన్లలోపు ఉండే కవర్లను ప్రభుత్వం నిషేధించింది. అయితే ఒకసారి వాడి పడేయకుండా కవర్లను మళ్లీ వాడాలనే ఉద్దేశంతో దశల వారీగా పలుచటి కవర్లపై ఎక్కు పెడుతున్న ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి దీన్ని 75 మైక్రాన్ల లోపు కవర్లను నిషేధించగా.. ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి 120 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులపై సైతం ఈ జులై నుంచి నిషేధం అమల్లోకి వస్తున్నట్లు గతంలోనే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇయర్‌ బడ్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు, ప్లాస్లిక్‌ చెంచాలు, ముళ్ల చెంచాలు, ప్లేట్లు, కత్తులు, థర్మాకోల్‌తో చేసిన అలంకరణ వస్తువులు, వ్రాపింగ్‌ స్టిక్కర్లు, స్ట్రాలు, స్వీట్‌ బాక్సులు, ఆహ్వాన పత్రాలు, వంద మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన పీవీసీ బ్యానర్లు, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్‌ స్టిక్స్‌ వంటి వాటిని పూర్తిగా నిషేధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

విపరీతంగా పెరిగిన వాడకం..
దేశంలోని ప్రతి మనిషి సగటున ఏడాదికి 11కిలోలకు పైగా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను వాడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చిచెప్పింది. 2022 నాటికి ఈ వాడకం 20 కిలోలకు పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. కూరగాయలు, పండ్లు, టిఫిన్లు, పూలు వంటివి తీసుకెళ్లేటప్పుడు నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు అధికంగా వాడుతున్నారు. ఇది పర్యావరణానికి పెనుభూతంగా మారుతోంది. చదువుకున్న యువత నుంచి కూలీల వరకు ప్రతి ఒక్కరు చేతిలో రెండు, మూడు కవర్లలో వస్తువులు తీసుకెళ్లడం సర్వసాధారణమైంది. పల్లెల నుంచి పట్టణాలకు వచ్చే వారు సంచులు తీసుకోకుండా వస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ వంటి ప్రధాన పట్టణాల్లో ఏటా మూడున్నర టన్నులకు పైగా పురపాలిక సిబ్బంది ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తున్నారంటే పరిస్థితి ఎంత  తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.

చైతన్య పరుస్తున్నా... - కోడిరెక్క జయంతి, మిర్యాలగూడ.
నేను బయటికి వెళ్లిన ప్రతిసారి జనపనార సంచిని తీసుకెళ్తాను. ఏ వస్తువు కొన్నా అందులోనే వేసుకుని తీసుకొస్తా. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా అవగాహన పెంచుకుని ఐదేళ్లుగా కవర్లకు దూరంగా ఉంటున్నా. ప్లాస్టిక్‌ నిషేధానికి నా వంతుగా పలువురిని చైతన్య పరుస్తున్నా. మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్‌ వారు ప్లాస్టిక్‌పై చేసే పోరాటంలో నేను సైతం భాగస్వామినవుతున్నా. సంస్థ ఆధ్వర్యంలో అనేక మందికి ఉచితంగా జనపనార సంచులు పంపిణీ చేశాం. ప్లాస్టిక్‌ వ్యతిరేక ప్రచారం చేసే దుకాణదారులకు ప్రోత్సాహం అందిస్తుంటాం.


ప్లేటు, గ్లాసు వెంట తీసుకెళ్తా.. - మిట్టపల్లి సురేష్‌ గుప్తా, నల్గొండ
నేను గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. నేను ఎక్కడికి వెళ్లినా స్టీలు, ప్లేటు, గ్లాసు తీసుకెళ్తా. శుభకార్యాల్లో భోజన సమయంలో వారు ఇచ్చే ప్లాస్టిక్‌ వస్తువులకు బదులుగా నేను తీసుకెళ్లిన ప్లేటులోనే ఆహారం తీసుకుంటా. నిత్యం భుజానికి వస్త్రంతో చేసిన సంచిని ధరిస్తా. వస్తువులు కొనుగోలు చేస్తే ఆ సంచిలోనే వేసుకుని వస్తాను. ఎక్కడికి వెళ్లినా ప్లాస్టిక్‌ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంటా. ప్రభుత్వం సైతం పాఠశాలలో విద్యార్థులకు చిన్నతనం నుంచే ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి. నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని