logo

బలవర్థక ఆహారం.. విద్యార్థులకు ప్రయోజనం

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సకల్పించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గత పది రోజులుగా ప్రభుత్వం పీఎం పోషణ్‌ పథకాన్ని అమలు పరుస్తుంది. విద్యార్థుల్లోని రక్త హీనత, పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు మధ్యాహ్న భోజన పథకంలో

Updated : 25 Jun 2022 06:09 IST

భువనగిరి పట్టణం, ఆలేరు-న్యూస్‌టుడే

మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సకల్పించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గత పది రోజులుగా ప్రభుత్వం పీఎం పోషణ్‌ పథకాన్ని అమలు పరుస్తుంది. విద్యార్థుల్లోని రక్త హీనత, పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం స్థానంలో విటమిన్లు పోర్టిపికేషన్‌ చేసిన బియ్యాన్ని ప్రభుత్వం పాఠశాలలకు సరఫరా చేస్తుంది. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, బీ1, బీ2, బీ3, బీ6, బీ12, జింక్‌ను మిళితం చేసి తయారు చేసిన బియ్యం షెల్స్‌ను సన్న బియ్యంలో కలపడం ద్వారా బియ్యం పోషక విలువలను పెంచారు. క్వింటా సాధారణ బియ్యంకు ఒక కిలో బియ్యం గింజలను పోలిన విటమిన్‌ షెల్స్‌ను మిళితం చేసి సర్కార్‌ బడులకు పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం ద్వారా తయారు చేసిన భోజనం రుచితో పాటు బలవర్ధకంగా ఉంటుందని పోషకాహార నిపుణులు భావిస్తున్నారు.
కోడిగుడ్డు ధర పెంపు
మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో వారంలో మూడు రోజులు గుడ్డు వడ్డిస్తున్నారు. ధరల పెరుగుదల కారణంగా చాలా పాఠశాలల్లో వంట ఏజెన్సీల వారు మాత్రం ఒకటి, లేదా రెండు రోజులు మాత్రమే గుడ్డు వడ్డిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం గుడ్డుకు ఇచ్చే మొత్తాన్ని రూ.4 నుంచి రూ.5కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక, ప్రాథకమికోన్నత, ఉన్నత పాఠశాల్లోని విద్యార్థులకు ఇక నుంచి మధ్యాహ్న భోజనంలో ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో  కచ్చితంగా గుడ్డును వడ్డించాల్సి ఉంటుంది.


అన్ని పాఠశాలల్లో అమలు
-  కానుగుల నర్సింహా, డీఈవో, యాదాద్రి భువనగిరి

విటమిన్లు మిళితం చేసిన బియ్యంను మదాహ్న భోజన పథకం అమలులో ఉన్న పాఠశాలలకు పంపిణీ చేశాం. మెనూ పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. గుడ్డు ధరను రూ.1 పెంచాం. వారంలో మూడు రోజులు గుడ్డుతో పాటు మెనూ అమలయ్యేలా చర్యలు చేపడతాం.  

పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోని మెనూ..
ప్రభుత్వం రూపొందించిన మధ్యాహ్న భోజనం మెనూ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. కోడిగుడ్డు వడ్డించినందుకు గతంలో ప్రభుత్వం ఒక గుడ్డుకు రూ.4 చెల్లించేది. ఈనెల 13 నుంచి కోడిగుడ్డుకు రూ.5 చెల్లిస్తున్నప్పటికి నిర్వాహకులు విద్యార్థులకు వడ్డించడం లేదు. భువనగిరి పట్టణంలోని బాగాయత్‌ హైస్కూల్‌లో శుక్రవారం 120 మంది విద్యార్థులకు గుడ్డు వడ్డించకపోవడం గమనార్హం. పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. వెజ్‌బిర్యానీతో పాటు కూరగాయల కూర వడ్డింపులో నిర్లక్ష్యం కొనసాగుతుండటం గమనార్హం.  


వారం మెనూ
సోమవారం - అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు
మంగళవారం - అన్నం, కూరగాయల కూర, రసం
బుధవారం - అన్నం, ఆకుకూర, పప్పు, కోడిగుడ్డు
గురువారం - అన్నం, పప్పుచారు
శుక్రవారం - అన్నం, కూరగాయల కూర, రసం, గుడ్డు
శనివారం - వెజ్‌బిర్యానీ, ఆలు కుర్మ, రసం


జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వివరాలు 
నల్గొండ -  1,454   -   1,31,543
యాదాద్రి  - 712   -   64,181
సూర్యాపేట - 950 - 77,277

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని