logo

మాజీ సర్పంచికి ఆసరా కరవు

ఒక్కసారి సర్పంచి పదవి చేపట్టినా అనేకమంది ఆర్థికంగా స్థిరపడుతున్నారు. కానీ అన్నారం గ్రామానికి 2001 నుంచి 2006 వరకు సర్పంచిగా సేవలందించిన మిట్టగుడ్పుల నర్సయ్య పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉంది. సర్పంచిగా పనిచేస్తున్నప్పుడు నిజాయతీగా వ్యవహరించారు.

Published : 25 Jun 2022 05:49 IST

కూలిపోడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో మాజీ సర్పంచి మిట్టగడ్పుల నర్సయ్య దంపతులు

తుంగతుర్తి, న్యూస్‌టుడే: ఒక్కసారి సర్పంచి పదవి చేపట్టినా అనేకమంది ఆర్థికంగా స్థిరపడుతున్నారు. కానీ అన్నారం గ్రామానికి 2001 నుంచి 2006 వరకు సర్పంచిగా సేవలందించిన మిట్టగుడ్పుల నర్సయ్య పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉంది. సర్పంచిగా పనిచేస్తున్నప్పుడు నిజాయతీగా వ్యవహరించారు. గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ఊరంతా మురుగుకాల్వలు నిర్మించారు. మంచినీటి పైప్‌లైన్లు ఏర్పాటుచేశారు. క్రీడాకారులకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేయించారు.
శాంతియుత వాతావరణం నెలకొల్పి..
రాజకీయ గొడవల కారణంగా కొన్నేళ్ల పాటు గ్రామంలో దసరా ఉత్సవాలు ఆగిపోయాయి. సర్పంచిగా నర్సయ్య బాధ్యతలు చేపట్టాక గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి తిరిగి ప్రజలు దసరా పండగ నిర్వహించుకునేలా చొరవ చూపారు. క్రీడాకారులకు మూడు జిల్లాల స్థాయిలో పోటీలు నిర్వహింపజేశారు.
రెండు నెలలుగా అందని పింఛను
వృద్ధాప్యం వచ్చాక సాదేవారు ఎవరూ లేకపోవటంతో పరిస్థితి దీనంగా మారింది. ఉన్న ఒక్క కూతురు మృతి చెందటంతో వీరి బాగోగులు చూసేవారు కరవయ్యారు. కనీసం ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు. రెండు నెలలుగా పింఛను కూడా అందకపోవటంతో పూట గడవడానికి కష్టంగా మారింది.
పూట గడవక ఇక్కట్లు
చౌకధరల దుకాణం ద్వారా ప్రతినెలా వచ్చే రేషన్‌ బియ్యం కూడా నర్సయ్య కుటుంబానికి అందటం లేదు. రేషన్‌కార్డు ఉన్నా వేలిముద్రలు అంతర్జాలంలో నమోదు కాకపోవటంతో రేషన్‌ బియ్యం అందటం లేదు. వీరు స్వయంగా మీసేవ కేంద్రానికి వెళ్లే పరిస్థితి లేకపోవటంతో బియ్యానికి కూడా తిప్పలు తప్పటం లేదు. ప్రతినెలా చుట్టుపక్కల వారిని తలా కొంత బియ్యం అడుక్కొని కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు, దాతలు తమను ఆదుకోవాలని నర్సయ్య దంపతులు వేడుకుంటున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని