logo

కలవరం.. ఆపై సంతోషం

ఉమ్మడి జిల్లాలోని దేవరకొండతో పాటు కృష్ణపట్టి మండలాలైన చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, పీఏపల్లి, పెద్దవూర, పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచేర్వు, చింతలపాలెం, దామరచర్ల, అడవిదేవులపల్లి లాంటి మారుమూల మండలాల్లో పలువురు ఉపాధ్యాయులు అసలు విధులు వదిలి స్థిరాస్తి, చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారని గతంలో శాఖ నిర్వహించిన అంతర్గత సర్వేలోనే వెల్లడైందని ఓ కీలక అధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు. దేవరకొండ, చందంపేట, నేరేడు

Published : 26 Jun 2022 02:33 IST

గుంటిపల్లి పాఠశాల

ఈనాడు, నల్గొండ, న్యూస్‌టుడే, దేవరకొండ: ఉమ్మడి జిల్లాలోని దేవరకొండతో పాటు కృష్ణపట్టి మండలాలైన చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, పీఏపల్లి, పెద్దవూర, పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచేర్వు, చింతలపాలెం, దామరచర్ల, అడవిదేవులపల్లి లాంటి మారుమూల మండలాల్లో పలువురు ఉపాధ్యాయులు అసలు విధులు వదిలి స్థిరాస్తి, చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారని గతంలో శాఖ నిర్వహించిన అంతర్గత సర్వేలోనే వెల్లడైందని ఓ కీలక అధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు. దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము, డిండి మండలాల్లోని ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టి మారుమూల ప్రాంతాల్లోని తండాల్లో ఓ మోస్తారుగా చదువుకున్న వారిని విద్యావలంటీర్లుగా నిబంధనలకు విరుద్ధంగా నియమించుకొని వారికి నామమాత్రంగా డబ్బులు ఇస్తూ అధికారులను ‘మేనేజ్‌’ చేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. అయినా ఉన్నతాధికారులకు నెలనెలా మాముళ్లు అందుతుండటంతో ఈ విషయంపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం ఇటీవలే మొదలైన దేవరకొండ డివిజన్‌లో పనిచేసే కొంత మంది ఉపాధ్యాయులు అప్పుడే డిప్యూటేషన్‌ వచ్చిందని చెబుతూ విధులకు హాజరుకావడం లేదు. ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం బాధ్యులపై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న వాదనలున్నాయి.

కీలకంగా ‘ఆ ఒక్కడు’

దేవరకొండ, డిండి, నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లో పనిచేసే దాదాపు 50 మంది వరకు ఉపాధ్యాయులు చింతపల్లి, దేవరకొండ, మల్లేపల్లి ప్రాంతాల్లో స్థిరాస్థి వ్యాపారం చేస్తున్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. వీరంతా గత అయిదేళ్లుగా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ప్రస్తుతం డిండి, చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఓ అధికారి సాయంతో బడులకు పోకుండా మేనేజ్‌ చేస్తున్నారని తెలిసింది. సదరు అధికారి అయిదారేళ్లుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నతాధికారులకు, స్థిరాస్తి, చిట్టీల వ్యాపారం చేస్తూ కాలం గడుపుతున్న కొంత మంది ఉపాధ్యాయులకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. జిల్లా ఉన్నతాధికారి ఎవరైనా ఈయనే నమ్మినబంటుగా వ్యవహరించి ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయులపై ఈగ వాలకుండా చూసుకుంటారనే పేరుంది. గతంలో జిల్లా స్థాయి జడ్పీ అధికారి ఈ ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వ బడులను ఇక్కడి ఉపాధ్యాయులు నిర్వీర్యం చేస్తున్నారని వెల్లడించినా ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి మారుమూల ప్రాంతంలో పనిచేసే గురువులపై సరైన నిఘా పెట్టాల్సిన అవసరముంది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ప్రభుత్వం నుంచి తనకింకా పూర్తి వివరాలు రాలేదని, వచ్చిన తర్వాత స్పందిస్తానని ‘ఈనాడు’కు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో బడుల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కారణం ఏంటంటే?

ఉమ్మడి జిల్లాలోని దేవరకొండ డివిజన్‌ చందంపేట మండలంలోని గుంటిపల్లిలో పనిచేస్తున్న జావేద్‌ అలీ అనే ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా స్థిరాస్తి వ్యాపారాలు, ఇతర రాజకీయ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. సదరు బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారుకు నివేదిక అందజేసింది. అయినా సంబంధిత అధికారులు మాత్రం సదరు ఉపాధ్యాయుడికి సంబంధించి కేవలం రెండు ఇంక్రిమెంట్లు కోత విధించి తిరిగి అదే ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వడం గమనార్హం.


దేవరకొండ డివిజన్‌లోని ఉపాధ్యాయుడి అక్రమాల ఆధారంగానే వివాదాస్పద జీవో ప్రకటన

‘‘ విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు వెల్లడించాలి. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి’’

- ఉపాధ్యాయుల ఆస్తులపై ప్రభుత్వం చేసిన ప్రకటన.. (ఆపై సర్కారు ఈ జీవోను నిలిపివేసింది)


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని