logo

బతుకు బండి.. బహుకష్టమండి

భారీగా పెరిగిన ధరలు ఇబ్బందుల్లో మధ్య తరగతి ప్రజలుసూర్యాపేటలో నివాసముంటున్న వీరస్వామి దంపతులు ప్రైవేటు ఉద్యోగులు. ఎనిమిదో తరగతి చదివే కూతురు పాఠశాల ఫీజు గతేడాది రూ.41 వేలు. ఈ సారి రూ. 52 వేలకు పెరిగింది. యానిఫాం,

Published : 26 Jun 2022 02:33 IST

భానుపురి, నందికొండ- న్యూస్‌టుడే

భారీగా పెరిగిన ధరలు ఇబ్బందుల్లో మధ్య తరగతి ప్రజలుసూర్యాపేటలో నివాసముంటున్న వీరస్వామి దంపతులు ప్రైవేటు ఉద్యోగులు. ఎనిమిదో తరగతి చదివే కూతురు పాఠశాల ఫీజు గతేడాది రూ.41 వేలు. ఈ సారి రూ. 52 వేలకు పెరిగింది. యానిఫాం, పుస్తకాలు, బూట్లు, బ్యాగుల ధర అదనం. వీరస్వామి ఆఫీసుకు ద్విచక్రవాహనంపై వెళ్తారు. పెట్రోల్‌ ధరలు కూడా పెరిగాయి. కొన్నాళ్లుగా విపరీతంగా పెరిగిన నిత్యావసరాల భారం మరింత అదనం. ఏడాది వ్యవధిలో ఇంటి ఖర్చు రూ. 3 వేలపైనే పెరిగింది. అన్ని ధరలు పెరిగినా ఇద్దరి జీతాల్లో మార్పు లేదని ఆయన వాపోయారు. ఈ నెలలో ఎదురైన ఖర్చుతో మూడు నెలల వరకూ కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

జూన్‌ నెల మధ్య తరగతి కుటుంబాలను బెంబేలెత్తిస్తోంది. రెండేళ్లలో అన్ని రకాల వస్తువులు, వంట సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నియంత్రణ లేకుండా పెరిగిన స్కూల్‌ ఫీజులతో సతమతమవుతున్న వేతన జీవులకు కొండెక్కి కూర్చున్న నిత్యావసరాల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఆదాయంలో పెరుగుదల లేకపోవడంతో మొత్తం కుటుంబ బడ్జెట్‌ తలకిందులవుతోంది. ఇంట్లో చదివే పిల్లలు ఇద్దరు ఉంటే తల్లిదండ్రుల పరిస్థితి వర్ణణాతీతం. జూన్‌ వచ్చేసరికి పెరిగిన ఖర్చులతో ఆర్థిక పరిస్థితి చేయి దాటి పోవడం తట్టుకోలేక కొందరు తల్లిదండ్రులు ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబాన్ని నడిపేందుకు అప్పులు చేస్తున్నారు. కొందరు వ్యక్తిగత అవసరాలు, వినోద ఖర్చుల్లో కోత విధిస్తున్నారు.

ఒక్కో కుటుంబంపై అదనపు భారం రూ. 5 వేలు

కరోనాతో వ్యాపారం దెబ్బతిని ఈ రెండేళ్ల వ్యవధిలో ప్రజల ఆదాయాల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు రూ.80 నుంచి రూ.100కు చేరాయి. ఈ ప్రభావంతో నిత్యావసరాల ధరలు అదుపు తప్పాయి. వంటగ్యాస్‌, పప్పు, ఉప్పు, నూనె పాలు సహా అనేక వస్తువుల ధరలు సగటున 10 నుంచి 80 శాతంపైనే పెరిగాయి. ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీలు పెంచింది. ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే ఏటా 5 నుంచి 10 శాతం పెంపు వీటికి అదనం. ఇవన్నీ మధ్య తరగతి కుటుంబాలపై తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇంటి ఖర్చులు, నిత్యావసరాల ధరలు పెరగడంతో ఒక్కో కుటుంబంపై నెలకు సుమారు రూ.5వేల భారం అదనంగా పడుతోంది. బడులు ప్రారంభమయ్యే నాటికి ఎదురవుతున్న ఖర్చులతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.


పెరుగుతున్న ఖర్చులు: శ్రీనివాస్‌, సూర్యాపేట

ఖర్చులన్నీ అదుపు తప్పుతున్నాయి. రూ.200కు వారం సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు వారానికే రూ500 అవుతోంది. నూనె, పాల ధర పెరిగింది. ఆఫీసుకు వెళ్లొచ్చేందుకు ఏడాదిన్నర కిందట పెట్రోలుకు నెలలో రూ.2 వేల ఖర్చయ్యేది. ఇప్పుడు రూ. 3 వేలవుతోంది. ఇలా అన్నీ ధరలు పెరగడంతో, ఒక్కోసారి ఇంటిని ఎలా నెట్టుకురావాలో.. ఏం ఖర్చులు తగ్గించుకోవాలో అర్థమవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని