logo

రైతును ఏమార్చి.. ఖాతా నుంచి సొమ్ము చోరీ

నగదు నిల్వ వివరాలు తెలుసుకునేందుకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన రైతును ఏమార్చి.. అతని ఏటీఎం కార్డును మార్చి ఖాతా నుంచి డబ్బులు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కేతేపల్లి మండలం కాసనగోడుకు చెందిన రైతు బి.భిక్షమయ్య ఈ నెల 18న నకిరేకల్‌ పోలీసు స్టేషన్‌ ఎదురు వీధిలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రానికి వచ్చారు. ఇటీవల ధాన్యం విక్రయించిన డబ్బులు ఖాతాలో జమ అయింది లేని

Published : 26 Jun 2022 02:33 IST

నకిరేకల్‌, న్యూస్‌టుడే: నగదు నిల్వ వివరాలు తెలుసుకునేందుకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన రైతును ఏమార్చి.. అతని ఏటీఎం కార్డును మార్చి ఖాతా నుంచి డబ్బులు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కేతేపల్లి మండలం కాసనగోడుకు చెందిన రైతు బి.భిక్షమయ్య ఈ నెల 18న నకిరేకల్‌ పోలీసు స్టేషన్‌ ఎదురు వీధిలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రానికి వచ్చారు. ఇటీవల ధాన్యం విక్రయించిన డబ్బులు ఖాతాలో జమ అయింది లేనిది తెలుసుకునేందుకు నిల్వ వివరాల కోసం అక్కడే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి సాయం కోరారు. అతనికి కార్డు ఇచ్చి పిన్‌ నంబరు చెప్పారు. ఆ వ్యక్తి నగదు నిల్వను పరిశీలించి ఖాతాలో డబ్బులు ఉన్నా లేవని రైతుకు అబద్దం చెప్పి, అదే సమయంలో భిక్షమయ్య ఏటీఎం కార్డుకు బదులు మరో ఏటీఎం కార్డును రైతు చేతిలో పెట్టి అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత మూడు నాలుగు రోజుల్లో నల్గొండ, హైదరాబాద్‌లోని ఏటీఎం ద్వారా రైతు ఖాతా నుంచి రూ.1,17,800 గుర్తు తెలియని వ్యక్తి 11 దఫాలుగా డ్రా చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం నగదు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన రైతుకు ఖాతాలో డబ్బులు పూర్తిగా లేవని తెలియడంతో అనుమానం వచ్చి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించారు. అది తనది కాదని, టి.శ్రీనివాస్‌ అనే వ్యక్తి పేరుతో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించానని బాధిత రైతు భిక్షమయ్య శనివారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీఐ ఏ.వెంకటయ్య నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె.రంగారెడ్డి శనివారం తెలిపారు.


పూడ్చిన శవానికి పోస్టుమర్టం

తిప్పర్తి,న్యూస్‌టుడే: పూడ్చిన శవాన్ని వెలికితీసి శవపంచనామా చేసిన ఘటన తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన జంతిక సుధాకర్‌ సమీప గ్రామమైన గోదోరిగూడేనికి చెందిన శ్రావ్యను ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రసవం కోసం ఈ నెల 14న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మగ బిడ్డకు జన్మనిచ్చిన శ్రావ్య అస్వస్థతకు గురై అదేరోజు మృతిచెందారు. బలహీనంగా ఉండటంతో మరణించినట్లు వైద్యులు తెలిపారని పోస్టుమర్టం చేయకుండానే అంత్యక్రియలు పూర్తిచేశారు. కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని.. అల్లుడే కారణమని శ్రావ్య తల్లి యాకాలపు ముత్యాలమ్మ తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమర్టం చేయాలని నిర్ణయించారు. మామిడాలలో శ్రావ్యను పూడ్చిన చోటకు వెళ్లి తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎస్సై సత్యనారాయణల సమక్షంలో శనివారం ఫోరెన్సిక్‌ వైద్యబృందం పోస్టుమర్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని