logo

సర్కార్‌ దవాఖానాల్లో సేవలు మెరుగు

భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యసేవలను మెరుగుపర్చామని డీసీహెచ్‌ డాక్టర్‌ చిన్ననాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన నవజాత శిశువుల(ఎస్‌ఎన్‌సీయూ), చిన్నపిల్లల( డెడికేటెడ్‌ పీడీయాట్రిక్‌) ప్రత్యేక

Published : 26 Jun 2022 02:33 IST

‘న్యూస్‌టుడే’తో డీసీహెచ్‌ డాక్టర్‌ చిన్ననాయక్‌

భువనగిరి నేరవిభాగం, భువనగిరి, న్యూస్‌టుడే: భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యసేవలను మెరుగుపర్చామని డీసీహెచ్‌ డాక్టర్‌ చిన్ననాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన నవజాత శిశువుల(ఎస్‌ఎన్‌సీయూ), చిన్నపిల్లల( డెడికేటెడ్‌ పీడీయాట్రిక్‌) ప్రత్యేక వార్డులలో కార్పొరేట్‌ తరహాలో వైద్యసేవలు, చికిత్సలు చేస్తున్నామన్నారు. గత మూడు నెలల నుంచి సాధారణ ప్రసవాల సంఖ్య పెంచామని చెప్పారు. ఇక్కడ కాన్పు క్లిష్టమైన ప్రభుత్వ అంబులెన్స్‌లో ఉచితంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నామన్నారు. ఆర్థోపెడిక్‌ సేవలను విస్తరించామని, రెండు నెలల నుంచి సర్జరీలు నిర్వహిస్తున్నమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారిని పరీక్షల పేరిట, చికిత్స కోసం ప్రైవేట్‌కు తరలింపు విషయంలో కట్టడి చేశామన్నారు.  జిల్లా కేంద్రాసుపత్రితోపాటు, అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో మందులు ఉన్నాయన్నారు.

కార్పొరేట్‌ తరహా వార్డులు

ఆసుపత్రిలో నవజాత శిశువుల కోసం ఎన్‌సీయూవార్డు లెవల్‌-2, చిన్నపిల్లల(పీడీయాట్రిక్‌) కార్పొరేట్‌ తరహాలో వార్డులను తీర్చిదిద్దాం. ఎన్‌సీయూలో అప్పుడే పుట్టిన శిశువుల్లో రెండు కిలలోపై ఉన్నవారికి శ్వాస సమస్యలు, పుట్టుక వచ్చే కామెర్లు కోసం ఫొటో థెరఫి చికిత్స అందిస్తున్నాం. 24 గంటలు 20 పడలకు అక్సిజన్‌ సరఫరా ఏర్పాటు చేశాం. 30 పడకలతో డెడికేటెడ్‌ పీడీయాట్రిక్‌ 14 ఏళ్ల లోపు పిల్లలకోసం ఏర్పాటు చేసిన వార్డులో వైద్యసేవలు అందిస్తున్న నలుగురు చిన్నపిల్లల వైద్యులతో ఆ రెండు వార్డులో నిరంతరం సేవలు కొనసాగిస్తున్నాం.

మూడు నెలల్లో 143 సాధారణ ప్రసవాలు  

జిల్లా కేంద్రాసుపత్రిలో మూడు నెలల నుంచి సాధారణ ప్రసవాలు పెంచాం. ఏప్రిల్‌ నుంచి ఈ నెల 23 వరకు 143 సహజ కాన్పులు అయ్యాయి. సహజ కాన్పులు పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి సహజ కాన్పులు పెరుగుతూ వస్తున్నాయి. కాన్పులు వార్డులో కిందిస్థాయి సిబ్బంది వసూళ్లు చేయకుండా హెచ్చరించాం.  

ఖాళీల భర్తీకి చర్యలు  

వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. పోస్టుల భర్తీ కోసం ఇటీవల ప్రకటన విడుదల చేశాం. ఉన్న వైద్యుల సర్దుబాటుతో వైద్యసేవలను కొనసాగిస్తాం. నల్గొండ ఆసుపత్రి నుంచి మానసిక వైద్యనిపుణున్ని పిలిపించి సదరం శిబరంలో ఆయా దివ్యాంగులకు పరీక్షలు చేయించాం.

ప్రైవేట్‌పై నిఘా...

ఆసుపత్రికి వచ్చేరోగులను, గర్భిణులను ప్రైవేట్‌ కేంద్రాలకు తరలించే విషయంలో సహకరించే వైద్యులు, కిందిస్థాయి సిబ్బందికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడంతోపాటు, ప్రైవేట్‌ వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయించడంతోపాటు సంబంధిత కేంద్రంపై సీజ్‌ చేయించి కట్టడి చేశాం. నోటీసులు అందుకున్న వైద్యులు, సిబ్బంది వివరణ ఇచ్చారు. మరోసారి పునరావృతమైతే ఉపేక్షించేంది లేదు. ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలతో నిఘా పెంచాం. ప్రైవేటుకు తీసుకెళ్తున్నట్లు తెలిస్తే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.

ఆర్థోపెడిక్‌ సేవలు విస్తరించాం..

ఆరోగ్యశ్రీ ద్వారా ఆర్థోపెడిక్‌ సేవలు విస్తరించాం. కీళ్లు, ఎముకల సమస్యలు ఉన్నవారి సర్జర్జీలు నిర్వహిస్తున్నాం. రెండు నెలల నుంచి ఎనిమిది పెద్ద సర్జరీలు, ఎనిమిది చిన్న సర్జరీలు చేశాం. ఈ సేవలను మరింతంగా పెంచేందుకు కృషి చేస్తున్నాం.

అవసరమైన మందులు సిద్ధం

సీజనల్‌ వ్యాధులు ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు సిద్ధంగా ఉన్నాయి. ఓపీలో ముగ్గురు జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు విధుల్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం. టైఫాయిడ్‌ పరీక్ష కోసం వైడల్‌, ఎక్స్‌రే, ఇతర రక్తపరీక్షలు, డెంగీ, చికున్‌ గున్యా నిర్ధారణ పరీక్షల కిట్లు అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని