logo

భద్రత ఏదీ?

దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది, రోగులకు, వస్తువులకు భద్రత కరవైంది. ఆసుపత్రి ప్రధాన రహదారిపై ఉండడం, గేట్లు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా లోనికి వచ్చేవారు ఎక్కువయ్యారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రికి నిత్యం

Published : 26 Jun 2022 02:33 IST

దేవరకొండ ప్రభుత్వాసుపత్రి వాహనాలు లోనికి వెళ్లకుండా అడ్డుగా ప్రైవేట్‌ అంబులెన్స్‌

దేవరకొండ, న్యూస్‌టుడే: దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది, రోగులకు, వస్తువులకు భద్రత కరవైంది. ఆసుపత్రి ప్రధాన రహదారిపై ఉండడం, గేట్లు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా లోనికి వచ్చేవారు ఎక్కువయ్యారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రికి నిత్యం 600 నుంచి 800 వరకు ఔట్‌పేషంట్లు, 150 వరకు ఇన్‌పేషంట్లు వస్తుంటారు. దేవరకొండ డివిజన్‌తో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొన్ని గ్రామాల రోగులకు, హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ హైవేపై రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు చికిత్స నిర్వహిస్తారు. కానీ కొన్ని పరిస్థితులలో సిబ్బందికి భద్రత కరవైందని వారు వాపోతున్నారు.

వివిధ ప్రమాదాలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్స నిర్వహించే సమయంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈక్రమంలో బాధిత బంధువులు ఆగ్రహంతో సిబ్బందిపై దాడులు చేయడం, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్తున్నాయి. వీటికి తోడు ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్‌పేషంట్‌ రోగులు నిద్రించే సమయంలో గేట్లు, వాచ్‌మెన్‌ లేకపోవడంతో అటుగా వెళ్లేవారు మద్యం తాగి వచ్చి నానా రభస సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న పైపులు ఎత్తుకెళ్లడం, మహిళ మెడ నుంచి నగలు దొంగిలించడం పరిపాటిగా మారింది. 2015లో ఇద్దరు హోంగార్డులను పోలీసులు ఏర్పాటు చేసి కొద్ది రోజులకే సిబ్బంది కొరతతో తొలగించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో విధులు నిర్వహించాలంటే భయమేస్తుందంటూ వైద్య సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీస్‌ ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తే ఇటు ఆస్పత్రి, మరోవైపు ప్రధాన రహదారిపై భద్రత ఏర్పాట్లు చేపట్టవచ్చని వైద్యసిబ్బంది కోరుతున్నారు.


ఔట్‌పోస్టు తప్పనిసరి

- డాక్టర్‌ రాములునాయక్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, దేవరకొండ

దేవరకొండ ఏరియా ఆస్పత్రిలో గతంలో ఇద్దరిని పోలీసులను ఏర్పాటు చేశారు. రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో తప్పనిసరిగా ఔట్‌పోస్టు, పోలీసును ఏర్పాటు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని