logo

ధాన్యాన్ని పరీక్షించిన సీఎఫ్‌టీఆర్‌ఐ బృందం

చిట్యాలలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర రైస్‌ ఇండస్ట్రీలో ధాన్యాన్ని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ) బృందం సోమవారం పరిశీలించింది.

Published : 28 Jun 2022 04:55 IST


మర ఆడించగా వచ్చిన బియ్యాన్ని రైసు మిల్లర్లతో కలిసి పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులు

చిట్యాల, న్యూస్‌టుడే: చిట్యాలలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర రైస్‌ ఇండస్ట్రీలో ధాన్యాన్ని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ) బృందం సోమవారం పరిశీలించింది. యాసంగి సీజన్‌లో తెలంగాణలో వచ్చే ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసినపుడు వచ్చిన బియ్యంలో నిర్ణీత మోతాదుకు మించి నూక శాతం పెరుగుతుందని ఇది తమకు నష్టదాయకమని రైస్‌ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. దీనిపై క్షేత్రస్థాయిలో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసినపుడు బియ్యం, నూక, పొట్టు, తవుడు, రాళ్లు ఎంతశాతం వస్తాయనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి సీఎఫ్‌టీఆర్‌ఐ సీనియర్‌ శాస్త్రవేత్త శ్రుతిపాండే ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం చిట్యాలకు వచ్చింది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర రైస్‌ ఇండస్ట్రీలో ఎంటీయూ 1010 రకం(దొడ్డు రకం), చింట్లు(సన్నరకం) ధాన్యాన్ని 4 టన్నుల చొప్పున మర ఆడించి, తద్వారా వచ్చే బియ్యం, నూక, పొట్టు, తవుడు, రాళ్ల నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. సోమవారం ఎంటీయూ 1010 రకం మర ఆడించారు. మంగళవారం మిగిలిన రకాన్ని మర ఆడించనున్నారు. తాము క్షేత్రస్థాయిలో సేకరించిన నమూనాలను తమ ప్రయోగశాలలో పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నామని సీఎఫ్‌టీఆర్‌ఐ బృందం పేర్కొంది. కార్యక్రమంలో సీఎఫ్‌టీఆర్‌ఐ బృందం సభ్యులు షకీబ్‌, డాక్టర్‌ ప్రభాకర్‌, డాక్టర్‌ శ్రీధర్‌, యాదయ్య, పౌరసరఫరాల శాఖ నాణ్యత నియంత్రణ అధికారులు జి.సైదులు, జీసీ మల్లారెడ్డి, జి.రామచంద్రం, జిల్లా డీసీఎస్‌వో వి.వెంకటేశ్వర్లు, ఎసీఎస్‌వో నిత్యానందం, పౌర సరఫరాల శాఖ డీఎం డి.నాగేశ్వరరావు, జిల్లా రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, చిట్యాల మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తేరటుపల్లి హనుమంతు, జిల్లాకు చెందిన పలువురు రైసుమిల్లర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని