logo

అడ్డుగా ఉన్నాడనే అంతమొందించారు

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. శాలిగౌరారం మండలం చిత్తలూరు....

Published : 28 Jun 2022 04:55 IST

నకిరేకల్‌, న్యూస్‌టుడే: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో ఈనెల 20న జరిగిన మాచర్ల కిరణ్‌(29) హత్యకేసులో నిందితులైన అతని భార్య సారిక, ఆమె ప్రియుడు రొద్ద మల్లేశ్‌ను సోమవారం అరెస్టుచేసి కోర్టులో హజరుపర్చామని నల్గొండ డీఎస్పీ వి.నర్సింహరెడ్డి తెలిపారు. నకిరేకల్‌ స్టేషన్‌ ఆవరణలోని శాలిగౌరారం సర్కిల్‌ కార్యాలయంలో మీడియాకు డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం..చిత్తలూరుకు చెందిన సారిక వివాహం 11 ఏళ్ల కిత్రం నకిరేకల్‌ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్‌తో జరిగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. ఆరేళ్ల నుంచి ఈ కుటుంబం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ నగర్‌లో నివాసం ఉంటుంది. కిరణ్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా సారిక ఆసుపత్రిలో శస్త్రచికిత్సల టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. వైద్యశాలలో హౌజ్‌కీపింగ్‌ పనులు చేసే గుత్తేదారు, యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దెవికి చెందిన రొద్ద మల్లేశ్‌తో కిరణ్‌కు పరిచయం ఏర్పడింది. తరచూ కిరణ్‌ ఇంటికి వచ్చిపోయే మల్లేశ్‌కు సారికతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సారిక టెక్నీషియన్‌ ఉద్యోగం మానేసి మల్లేశ్‌ వద్దనే హౌజ్‌కీపింగ్‌ సూపర్‌వైజరుగా చేరింది. ఈ ఇద్దరి సంబంధాన్ని కిరణ్‌ గుర్తించడంతో గొడవలు జరిగి ఆరునెలల క్రితం సారిక తన పిల్లలను తీసుకుని పుట్టిల్లు చిత్తలూరుకు వచ్చేసింది. రొద్ద మల్లేశ్‌ భార్య నెలరోజుల నుంచి కన్పించకుండా పోవడంతో కిరణ్‌పై అనుమానం, పగను పెంచుకున్నాడు. భర్త వేధింపులు అధికమయ్యాయని సారిక కూడా మల్లేశ్‌కు చరవాణిలో చెప్పడంతో కిరణ్‌ను అడ్డుతొలగించుకునేందుకు పథకం వేశారు. పిల్లలను పాఠశాలలో చేర్పించాలంటూ ఈనెల 20న కిరణ్‌ను హైదరాబాద్‌ నుంచి చిత్తలూరుకు సారిక రప్పించింది. కిరణ్‌కు మద్యం తాగించి స్పృహలేకుండా చేసి నిద్రిస్తున్న సమయంలో బండరాయితో అతని తలపై మోది హత్యచేసి ఈ విషయాన్ని మల్లేశ్‌కు చరవాణి ద్వారా చేరవేసిందని డీఎస్పీ వెల్లడించారు. సారిక, మల్లేశ్‌ల వద్ద నుంచి మూడు చరవాణిలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మీడియా సమావేశంలో శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్సై సతీష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని