logo

అధికారుల దోపిడీ..!

రూ.లక్షల్లో జీతాలు.. బాధ్యతాయుతమైన ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. ఇవన్నీ ఉన్నప్పటికీ కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె కార్ల దందాను....

Published : 28 Jun 2022 04:55 IST

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే


సూర్యాపేట: తెలుపురంగు ప్లేటుతో ప్రభుత్వ వాహనం

రూ.లక్షల్లో జీతాలు.. బాధ్యతాయుతమైన ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. ఇవన్నీ ఉన్నప్పటికీ కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె కార్ల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తూ నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ట్యాక్సీ పేరిట ప్రతినెలా బిల్లులు కాజేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ప్రభుత్వ అధికారులు పర్యటించేందుకు సొంత వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో అవసరమైన వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటును ఆయా శాఖల కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అందుకోసం ఒక్కో వాహనానికి ప్రతినెలా రూ. 33 వేలు అద్దె చెల్లిస్తామని స్పష్టం చేసింది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

ఇంజినీరింగ్‌, అటవీ, వ్యవసాయ, విద్యుత్తు, ఐసీడీఎస్‌, మైనింగ్‌, జిల్లా పరిషత్తు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర జిల్లా, మండల అధికారులకు ట్యాక్సీ సౌకర్యం వర్తిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 156 మంది అధికారులు అద్దె కార్లను వినియోగిస్తున్నారు. వీరిలో చాలామంది సొంత కార్లను వినియోగిస్తూ అద్దె కార్ల పేరిట రూ.లక్షల్లో బిల్లులు కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత వాహనాల ద్వారా బిల్లులు పెట్టుకోవడం సాధ్యం కాకపోవడంతో కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌తో కమీషన్‌ మాట్లాడుకుంటున్నారు. ట్యాక్సీప్లేట్‌ వాహనాల పేరిట దొంగ బిల్లులను జతపరిచి ప్రతినెలా దోపిడీకి పాల్పడుతున్నారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు సైతం ఇదే వైఖరి అవలంబిస్తుండటం గమనార్హం.

నిరుద్యోగులకు దక్కని ఉపాధి!

అద్దె కార్లు వాడాల్సిన అధికారులు తప్పనిసరిగా ట్యాక్సీ ప్లేట్‌ నంబర్‌ కలిగిన వాహనం మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు రుణాలు, రాయితీ, కార్పొరేషన్లతోపాటు ఓనర్‌ కం డ్రైవర్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం భావించింది. అద్దెకు తీసుకోవాలనుకున్నప్పుడు వాహనం కండిషన్‌గా ఉండటంతో పాటు డ్రైవర్‌కు బ్యాడ్జీ నంబర్‌తో కూడిన లైసెన్స్‌ తప్పనిసరి. నిబంధనల ప్రకారం నెలకు కనీసం 2,300కి.మీ. వాహనం తిరగాలి. గతంలో వాహనం అద్దె, పెట్రోల్‌ లేదా డీజిల్‌ కలిపి నెలకు రూ.24 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.33 వేలకు ప్రభుత్వం పెంచింది. ఇదే అదనుగా కొందరు అధికారులు సొంత వాహనాలను బినామీ పేరిట నమోదు చేయించి అద్దె ప్రాతిపదికన వాటిని వినియోగిస్తున్నారు. బినామీ పేర్లతో ప్రతినెలా బిల్లులు కాజేస్తూ నిరుద్యోగుల పొట్ట కొట్టడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

తెలుపురంగు ప్లేటుతో దర్శనం!

అధికారులకు సంబంధించిన వాహనాలపై ‘ఆన్‌ గౌట్‌ డ్యూటీ’ పేరిట వైట్‌ నంబర్‌ ప్లేట్లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వాహనాలు ప్రభుత్వ పనుల కోసం బహిరంగంగానే రోడ్లపై తిరుగుతున్నా రవాణా శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. కొన్ని శాఖల్లో అయితే ఉద్యోగులే రెండు, మూడు పాత కార్లు కొని అద్దె పేరిట బిల్లులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వానికి నివేదిస్తాం: మోహన్‌రావు, అదనపు కలెక్టర్‌

అద్దె కార్ల వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని