logo

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు..

ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు దాటి గంజాయి రవాణా చేస్తున్న వాహనం తెలంగాణ పోలీసులకు చిక్కింది. మరో అరగంటలో గంజాయితో రాజధాని హైదరాబాద్‌కు చేరుతామనకున్న ఇద్దరు

Published : 01 Jul 2022 05:37 IST

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల రిమాండ్‌
28 కిలోల సరకు స్వాధీనం

భువనగిరిలో కేసు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి, చిత్రంలో ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సైదులు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు దాటి గంజాయి రవాణా చేస్తున్న వాహనం తెలంగాణ పోలీసులకు చిక్కింది. మరో అరగంటలో గంజాయితో రాజధాని హైదరాబాద్‌కు చేరుతామనకున్న ఇద్దరు నిందితులు ధూనం అరవింద్‌, పప్పుల తిరుపతిలను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని రెడ్డిబావి క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.2.80 లక్షల విలువైన 28 కిలోల గంజాయి, రెండు చరవాణులు, రూ.13,800 నగదు, కారును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. భువనగిరి పట్టణంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చౌటుప్పల్‌ ఏసీపీ ఉదయ్‌రెడ్డితో కలిసి కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లాకేంద్రానికి చెందిన 22 ఏళ్ల ధూనం అరవింద్‌ డెలివరి బాయ్‌గా పనిచేస్తాడు.

అక్రమ సంపాదన కోసం గంజాయి సరఫరా చేయాలని పథకం రచించాడు. ఒడిశా రాష్ట్రం మాలకాంగిరి జిల్లా పప్పులూరు మండలం నాగుళూరుకు చెందిన 19 ఏళ్ల తిరుపతిని కలిశాడు. అక్కడి అప్పారావు అనే వ్యక్తి దగ్గర నుంచి 28 కిలోల గంజాయి కొనుగోలు చేసి వారు కారులో హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట మీదుగా కారులో వస్తుండగా సమాచారం మేరకు చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజాకు చేరుకోకముందే రెడ్డిబావి క్రాస్‌రోడ్డు వద్ద గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సోమవారం సాయంత్రం పోలీసులు ఆపారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి దొరకడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ చెప్పారు. ఆ గంజాయిని హైదరాబాద్‌లోని కాలే సాహెబ్‌కు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించారని తెలిపారు. నిందితులకు సరకు సరఫరా చేసిన అప్పారావుతోపాటు హైదరాబాద్‌ వాసి కాలే సాహేబ్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. సమావేశంలో చౌటుప్పల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై సైదులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని