logo

ఆరోగ్య బాంధవులు

కనిపించని ఆ దేవుడు మనకు ప్రాణం పోస్తే.. కనిపించే వైద్యుడు మాత్రం పునర్జన్మనిస్తాడు. అందుకే వైద్యుడికి దేవుడి స్థానం ఇచ్చి గౌరవించుకుంటున్నాం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి.. భార్యా, పిల్లలు, కుటుంబ సభ్యులకు దూరంగా గడుపుతూ లక్షల మందికి వైద్య సాయం అందిస్తున్నారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పలువురు వైద్యులపై స్ఫూర్తిదాయక కథనం.

Published : 01 Jul 2022 05:37 IST

మిర్యాలగూడ పట్టణం, చౌటుప్పల్‌, న్యూస్‌టుడే

కనిపించని ఆ దేవుడు మనకు ప్రాణం పోస్తే.. కనిపించే వైద్యుడు మాత్రం పునర్జన్మనిస్తాడు. అందుకే వైద్యుడికి దేవుడి స్థానం ఇచ్చి గౌరవించుకుంటున్నాం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి.. భార్యా, పిల్లలు, కుటుంబ సభ్యులకు దూరంగా గడుపుతూ లక్షల మందికి వైద్య సాయం అందిస్తున్నారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పలువురు వైద్యులపై స్ఫూర్తిదాయక కథనం.

కరోనాలో సేవలు అందించి.. డబ్ల్యూహెచ్‌ఓ బృందం మన్ననలు పొంది

మోత్కూరు, న్యూస్‌టుడే: మోత్కూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఆకవరం చైతన్యకుమార్‌ ఇక్కడికి 2020లో బదిలీపై వచ్చారు. ఆయన కొవిడ్‌ సమయంలో ధైర్యంగా పాజిటివ్‌ బాధితుల ఇళ్లలోకి వెళ్లి వైద్య సేవలందించారు. పీహెచ్‌సీలో రోజూ వందల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో సుమారు నాలుగు వేల మందికి కరోనా పరీక్షలు చేశారు. కరోనా ఉద్ధృతి తగ్గాక డబ్ల్యూహెచ్‌ఓ బృందం పీహెచ్‌సీ పరిధిలో నిర్వహించిన పరిశీలనలో డాక్టర్‌ చైతన్యకుమార్‌ అందించిన సేవలతో తాము గండం నుంచి గట్టెక్కామని బాధితులు చెప్పడంతో ఆ బృందం చైతన్యకుమార్‌ను అభినందించింది. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ ద్వారా అవార్డును అందజేసింది. ప్రైవేట్‌గా రాష్ట్రస్థాయిలో నటరాజ్‌ అకాడమీ, తెలుగు వెలుగు సంస్థలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్తమ సేవారత్న పురస్కారాన్ని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.చిరంజీవులు చేతులమీదుగా అందజేశాయి. జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ కూడా ఆయన సేవలను గుర్తించి సన్మానించింది. ఏడాది కాలంగా నలుగురు డాక్టర్లు ఉండాల్సిన మోత్కూరు పీహెచ్‌సీలో చైతన్యకుమార్‌ ఒక్కరే రోగులకు వైద్యసేవలు అందిస్తుండటం గమనార్హం.


వైద్య సేవలో నాలుగు తరాలు

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌కు చెందిన ‘సికిలంమెట్ల’ వంశీయులు నాలుగు తరాలుగా ప్రజలకు వైద్య సేవలందిస్తూ ఈ ప్రాంతంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందారు. సికిలంమెట్ల గోపాలం, శివయ్య సోదరులు వందేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఆయుర్వేదంలో పేరుమోసిన వైద్యులు. చాలా గ్రామాల నుంచి వీరి వద్దకు వైద్యం కోసం వచ్చేవారు. వారి ఇంటి ఆవరణలోనే రోగులు వంట చేసుకుని తిని, అక్కడే సేదతీరేవారు. రోగులకు ఉచితంగా ఆయుర్వేద వైద్య సేవలందించి స్వస్థత చేకూర్చేవారు. నలభై ఏళ్లపాటు ఆ ఊళ్లోనే వారి సేవలందించారు. గోపాలానికి ముగ్గురు కుమారులు దానయ్య, అంజయ్య, రాములు. వారు తండ్రి వద్ద సహాయకులుగా పని చేస్తూ వైద్యులుగా మారారు. గోపాలం తదనంతరం దానయ్య, అంజయ్యలు తండ్రి వారసత్వంగా ఆయుర్వేద వైద్యం చేశారు. పెద్ద కుమారుడు దానయ్య ఇరవయ్యేళ్ల వయసులో వైద్య సేవ ప్రారంభించి 84 ఏళ్ల వయసులో మరణించేంత వరకు కొనసాగించారు. తన వారసుడు వైద్య సేవలోనే ఉండాలనే కోరికతో కుమారుడు రాంప్రసాద్‌ను వైద్య విద్య చదివించాడు. ఆయన ఎంబీబీఎస్‌ పట్టా అందుకుని 36 ఏళ్ల క్రితం చౌటుప్పల్‌లో వైద్య సేవ ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేలందించి సూర్యాపేట జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖాధికారిగా ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా ‘డాక్టర్‌ రాంప్రసాద్‌’ పేరుతోనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని అతని ఇద్దరు పిల్లలను వైద్య విద్య చదివించారు. కుమారుడు జయంత్‌ ఎంబీబీఎస్‌, కుమార్తె స్నేహ ఎండీ-గైనకాలజిస్టుగా పట్టాలు పొందారు.  


సామాజిక సేవ.. ఈయన తోవ

హైదరాబాద్‌లోని మానస వృద్ధాశ్రమంలో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్న డాక్టర్‌ ఆనంద్‌ (పాత చిత్రం)

మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్‌ ఆనంద్‌ దిల్లీలో ఆయుష్‌ విభాగంలో రెసిడెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. వైద్యురాలే అయిన తన భార్య పూర్ణిమతో కలిసి బంజారా మహిళ ఎన్జీవోను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాను చదువుకున్న మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, క్రీడా సామగ్రి అందిస్తున్నారు. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక వృద్ధ, అనాథాశ్రమాలతో పాటు, సినీ కార్మికులు, పేదలకు నిత్యావసర సరకులు అందించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తన మిత్రుల సహకారంతో దేశ వ్యాప్తంగా తుఫాను, కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితులతో అల్లాడుతున్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఎన్నో సేవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఆనంద్‌..ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు అందుకోవడంతో పాటు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ చేతుల మీదుగా ఉత్తమ సీఎస్‌ఆర్‌ అవార్డు, తెలంగాణ అచీవర్స్‌ అవార్డు దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని