logo

ఆదాయం పెంపుపై నజర్‌

ఆదాయం పెంపుపై పురపాలకులు దృష్టి సారించారు. ఇప్పటికే వ్యాపార లైసెన్స్‌ల పేరిట గణనీయమైన ఆదాయం పొందిన పురపాలకులు, నీటి బకాయిలు, బిల్లుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా బకాయపడిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు

Updated : 02 Jul 2022 07:22 IST

నేడు దరఖాస్తుకు చివరి తేదీ

4న బహిరంగ వేలం

భువనగిరిలోని పాత బస్టాండ్‌లో మార్కెట్‌ సముదాయం

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: ఆదాయం పెంపుపై పురపాలకులు దృష్టి సారించారు. ఇప్పటికే వ్యాపార లైసెన్స్‌ల పేరిట గణనీయమైన ఆదాయం పొందిన పురపాలకులు, నీటి బకాయిలు, బిల్లుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా బకాయపడిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. క్తొత నిర్మాణాల నుంచి ఆస్తి పన్ను వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా పట్టణంలో నిరుపయోగంగా మిగిలిన మడిగెలు, ఇతర ఆస్తులను అద్దెకిచ్చేందుకు ప్రకటన జారీ చేశారు. జులై 4న బహిరంగ వేలం ద్వారా 84 మడిగెలను అద్దెకు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు పట్టణంలోని 212 మడిగెల నుంచి ఏటా రూ. 48.41 లక్షల ఆదాయం లభిస్తుండగా కొత్తగా నిర్వహించే అద్దె వేలంతో రూ. కోట్ల  ఆదాయం లభించే అవకాశం ఉంది. 

వేలం ప్రక్రియ ఇలా... మడిగెలు, ఇతర ఆస్తులను అద్దెకు ఇవ్వడంలో శాస్త్రీయ పద్ధతులను పాటించకపోవడంతో భారీ ఆదాయాన్ని కోల్పోతున్నట్లు గతంలో ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం 84 మడిగెలను నిబంధనల మేరకు అద్దె వేలం నిర్వహించనున్నారు. గతంలో కొందరు కౌన్సిలర్లు ఈ వ్యవహారంలో తలదూర్చి విలువైన ప్రాంతాల్లో మడిగెలను తమ అనుచరుల పేరిట బినామీగా అద్దెకు తక్కువ ధరకు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిసరాల్లో ఉన్న మార్కెట్‌ ప్రకారం అద్దె సర్కారు పాటను నిర్ణయించారు. వేలం వేసే మడిగెల్లో 12 ఎస్టీలకు, నాలుగు ఎస్సీలకు, రెండు వికలాంగులకు, రెండు నాయీబ్రాహ్మణులకు, రెండు రజకులకు రిజర్వేషన్ల మేరకు కేటాయించారు. 62 మడిగెలు అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీకి కేటాయించారు. బహిరంగ వేలంలో ఎక్కువగా పాటపాడిన వారికి మడిగెలను అద్దెకు కేటాయించనున్నారు. ప్రస్తుతం అద్దె మడిగెల కేటాయింపు పారదర్శకంగా జరగుతుండటంతో పురపాలికకు భారీ ఆదాయం లభించే అవకాశం ఉంది.

పాదర్శకంగా ప్రక్రియ... నాగిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, భువనగిరి... అద్దె మడిగెల కేటాయింపు ప్రక్రియను పారదర్శంగా చేపడుతున్నాం. బహిరంగ వేలం ద్వారా అత్యధిక పాట పాడిన వ్యక్తికి కేటాయిస్తాం. ప్రస్తుత ప్రక్రియ ద్వారా ఆదాయం గణనీయంగా లభించే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన లీజును రద్దు చేశాం. అన్ని మడిగెలకు వేలం నిర్వహించి వేలం పాట గెలిచిన వారికి కేటాయిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని