logo

పటిష్ఠం చేస్తేనే.. ప్రాణాలు నిలుస్తాయి..

వాహనాల రద్దీ ఉన్న హైదరాబాద్‌- విజయవాడ 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై నిత్యం 32 వేల వరకు వాహనాలు ఉమ్మడి జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.

Published : 06 Aug 2022 05:02 IST

క్షతగాత్రులకుఆరగంటలోనేమెరుగైనచికిత్స
నకిరేకల్‌, న్యూస్‌టుడే


65వ నెంబర్‌ జాతీయ రహదారిపై నిత్యం ఇలా.. ప్రమాదాలు (దాచిన చిత్రం)

వాహనాల రద్దీ ఉన్న హైదరాబాద్‌- విజయవాడ 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై నిత్యం 32 వేల వరకు వాహనాలు ఉమ్మడి జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఆదివారాలు, పండగలు, సెలవు రోజుల్లో వాహనాల సంఖ్య 40 వేలకు చేరుతుంది. ఇంత రద్దీ ఉన్నా ఇప్పట్లో దీనిని ఆరు వరుసలుగా విస్తరిస్తారన్న ఆశలు సన్నగిల్లాయి. ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 170 కి.మీ. మేర విస్తరించిన ఈ రహదారిపై ఏటా 150కిపైగా ప్రమాదాలు నమోదవుతున్నాయి. 200 మందికిపైగా గాయపడుతున్నారు. 80 నుంచి 100 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ఈ హైవేపై ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠం చేసి క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తే గాయపడిన వారిని 90 శాతం వరకు ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు వీలుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రజానీకం కోరుతోంది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న తపనతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారు. ఈ దశలో హైవే పీహెచ్‌సీలను పటిష్ఠం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రతిపాదనలు పంపి కృషి చేయాలన్న విజ్ఞప్తులు ఉన్నాయి.


వెలిమినేడు పీహెచ్‌సీ (హైవేపై ఇలాంటివి ఉమ్మడి జిల్లాలో ఆరు ఉన్నాయి) 

ప్రస్తుతం వైద్యసేవలు ఇలా..
170 కిలోమీటర్ల హైవేపై ఉమ్మడి జిల్లాలో చౌటుప్పల్‌, నకిరేకల్‌, సూర్యాపేట, కోదాడల్లో మాత్రమే రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య అందించే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. చౌటుప్పల్‌, నకిరేకల్‌, కోదాడల్లో 30 పడకల ఆసుపత్రులు (సీహెచ్‌సీలు), సూర్యాపేటలో జనరల్‌ ఆసుపత్రి అందుబాటులో ఉన్నాయి. క్షతగాత్రులను ఈ వైద్యశాలలకు చేర్చేందుకు 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. తీవ్రంగా గాయపడిన బాధితులకు మొదటి గంటలోపుగానే వైద్యం అందిస్తే ప్రాణాలు దక్కే వీలుంది. క్షతగాత్రులకు మొదటి గంటను ‘గోల్డెన్‌ అవర్‌గా’ పరిగణించి చికిత్స అందిస్తేనే వారికి ప్రాణాపాయం తప్పుతుంది.మొదటి గంటలో దాదాపు 40 నిమిషాల వరకు విలువైన సమయం వైద్యశాలలకు చేరుకోవడానికే సరిపోతోంది.

24 గంటల సేవలు అవసరం
హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వెలిమినేడు(చిట్యాల మండలం), చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు, కేతేపల్లి, మునగాల పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిని గతంలో ప్రసూతి సేవల కోసం 24 గంటల పీహెచ్‌సీలుగా గుర్తించి రాత్రివేళల్లో కూడా స్టాప్‌నర్సు సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆ సేవలు నామమాత్రంగా మారాయి. రహదారి ప్రమాద బాధితులతోపాటు గ్రామాల్లోని పాము, తేలుకాటు, క్రిమిసంహార మందు తాగి ప్రమాద స్థితికి చేరిన వారికి, కలుషితాహార బాధితులకు అత్యవసర సేవలు ఈ పీహెచ్‌సీల్లో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. 24 గంటలు వైద్యులు, నర్సులు, మందులు, యంత్ర పరికరాలు వీటిలో అందుబాటులో పెడితే అత్యవసర సేవల కోసం హైవేపై ప్రతి 10 నుంచి 15 కి.మీ.కు ఒక వైద్యశాల అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు కనీస మెరుగైన ప్రథమ చికిత్స అయినా వీటిల్లో అందించే వీలుంటుంది. వీటి ద్వారా బాధితులకు అరగంటలోపుగానే ప్రాథమిక వైద్యం అంది ప్రాణాపాయం నుంచి బయటపడతారు.

ప్రథమ చికిత్సలకు ఏర్పాట్లు : - అన్నెమళ్ల కొండల్‌రావు, డీఎంహెచ్‌వో, నల్గొండ
హైవేపై ఉన్న సీహెచ్‌సీలతో పాటు పీహెచ్‌సీల్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సలు అందించేలా వైద్యులను అప్రమత్తం చేశాం. పీహెచ్‌సీల పనివేళలు ముగిసిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌కాల్‌పై వైద్యుడు వచ్చి సేవలందించాలని ఆదేశించాం. మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బాధితులకు అత్యవసర సేవలు అందని పరిస్థితుల్లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని