logo
Published : 06 Aug 2022 05:11 IST

ముఖ్యమంత్రీ.. మూసీ పరివాహక ప్రాంతంపై దయలేదేమీ?

కేసీఆర్‌కు సంజయ్‌ బహిరంగ లేఖ


భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో మూసీనదిని పరిశీలిస్తున్న బండి సంజయ్‌

భువనగిరి, భూదాన్‌ పోచంపల్లి, న్యూస్‌టుడే: మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బీబీనగర్‌, పోచంపల్లి మండలాల్లో పాదయాత్ర చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూసీ నది ప్రవాహాన్ని పరిశీలించారు. మూసీ దుస్థితిని, ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ముక్తాపూర్‌ సమీపంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎంకు రాసిన లేఖను విడుదల చేశారు.

జోరువానలో పాదయాత్ర

భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం బీబీనగర్‌ మండలం భట్టుగూడెం నుంచి పెద్దరావులపల్లి గ్రామంలోకి ప్రవేశించింది. ఆయా గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పెద్దరావులపల్లి గ్రామంలోని మూసీ నదిని పరిశీలించి మూసీనీటిని సీసాలో సేకరించారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు మూసీ నది ప్రక్షాళనకు నమో మూసీ పేరుతో పాదయాత్ర చేశారని, జిట్టా బాలకృష్ణారెడ్డి నియోజకవర్గంలో నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై పట్టింపులేదని విమర్శించారు. గ్రామంలో ఇల్లులేక డబ్బాలో నివాసం ఉంటున్న దివ్యాంగ దంపతులైన గుండె శ్రీనివాస్‌, రేణుక దంపతులతో మాట్లాడారు. వారి సమస్యకు చలించి సొంతఖర్చుతో ఒక గది నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. గౌస్‌కొండ శివారులో భోజన అనంతరం వర్షంలోనే ముక్తాపూర్‌ వరకు పాదయాత్ర సాగించారు. యాత్రలో నాయకులు గొంగిడి మనోహర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కాసం వెంకటేశం, సినీనటి కవిత, నందకుమార్‌, కర్నాటి ధనంజయ్య, దాసరి మల్లేశం, సుర్కంటి రంగారెడ్డి, చింతల రామకృష్ణ, ఎన్నం శివకుమార్‌, చొక్కారెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు గురువారం రాత్రి బస చేసిన బీబీనగర్‌ మండలం భట్టుగూడెంలో శుక్రవారం ఆయన విలేకరులతో ఇష్టగోష్ఠిలో మాట్లాడారు. ఎవరెన్ని వ్యూహాలు రచించినా మునుగోడ ఉపఎన్నికలో గెలిచేది భాజపానేనని ధీమా వ్యక్తం చేశారు.


ముక్తాపూర్‌లో వర్షంలో కొనసాగుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర

లేఖలోని ముఖ్యాంశాలు..
* నాలుగోరోజు పాదయాత్రలో భాగంగా శుక్రవారం మూసీ పరివాహక ప్రాంతమైన పెద్దరావులపల్లి నుంచి వెళ్తుండగా మూసీ దుస్థితిని చూశాను.. ప్రజలు పడుతున్న ఇబ్బందులు నన్ను కన్నీరు పెట్టించాయి.
* మహిళలకు గర్భస్రావాలు జరుగుతున్నాయి. శారీరక, మానసిక వైకల్యంతో పిల్లలు పుడుతున్నారు.
* మూసీ నీటితో సాగు చేసిన ఆకుకూరల్లో రసాయన అవశేషాలు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు వ్యవసాయశాఖ ఓ పరిశోధనలో తేలింది.
* మూసీ నుంచి 5 కి.మీ వరకు ప్రభావం ఉంది.. 3 కి.మీ పరిధిలో తీవ్రత ఎక్కువగా ఉంది.
* వికారాబాద్‌ నుంచి వాడపల్లి వరకు 23 కత్వాల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. ఈ కత్వాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెరాస ప్రభుత్వ ఈ కత్వాలను పునరుద్దరించే చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం.
* గుజరాత్‌లోని సబర్మతి మాదిరిగా మూసీని సుందరీకిస్తామన్నారు. ఆ దిశగా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు.
* పారిశ్రామిక వ్యర్థాలను మూసీలో కలుపుతున్నా చర్యలు శూన్యం.
* పరివాహక ప్రాంత ప్రజలు బతకలేని దుస్థితిలో ఉన్నారు. వాళ్లు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో తెలిసేందుకే మూసీ నీళ్లను కొరియర్‌ చేస్తున్నా. ఆ నీళ్లను తాగుతావో.. స్నానం చేస్తావో.. ఇంకేం చేస్తావో మీ ఇష్టం.
* ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మూసీ ప్రక్షాళన చేపట్టాలి. ఇందు కోసం రూ. 4 వేల కోట్లు విడుదల చేయాలి. ఎలా  స్పందిస్తారో మీ ఇష్టం.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts