logo
Published : 06 Aug 2022 05:11 IST

కాంగ్రెస్‌లో నూతనోత్తేజం


సభలో కార్యకర్తలకు అండగా ఉన్నామంటూ చెబుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,
మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డి, చిత్రంలో పాల్వాయి స్రవంతి, డీసీసీ అధ్యక్షుడు
శంకర్‌ నాయక్‌, చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి, కార్యకర్తలు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, చండూరు, మునుగోడు: పీసీసీ పిలుపు మేరకు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం చండూరులో ఏర్పాటు చేసి, ఆసాంతం అట్టహాసంగా జరపడంతో కాంగ్రెస్‌ క్యాడర్‌లో నూతనోత్తేజం నింపింది. 48 గంటల వ్యవధిలో నియోజకవర్గం నుంచే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పార్టీ కార్యకర్తల్లో స్థైర్యం పెరిగిందని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే మండలాల వారీగా సమీక్ష నిర్వహించి ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలు, నాయకులను కలుస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించడంతో ఇన్నాళ్లు కొంత అధైర్యంగా ఉన్న క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు అండ దొరికిందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ప్రత్యేక సందర్భంలో జరిగే ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్‌ పార్టీకే ఓటేయాలని పలువురు వక్తలు కార్యకర్తలను కోరారు. గతంలో వరుసగా ఐదు సార్లు పార్టీ తరఫున గెలిచిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కాలం నుంచి మునుగోడు కాంగ్రెస్‌ అడ్డా అని మాజీ మంత్రులు, నాయకులు పునరుద్ఘాటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెంట ఉన్నందుకు మర్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ను జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ రెండు రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్‌ చేయగా... తిరిగి ఆయన శుక్రవారం పార్టీలో చేరారు.


కార్యకర్తలకు అభివాదం చేస్తున్న రేవంత్‌రెడ్డి

దారెటో తేల్చుకోమన్న నేతలు
తన పార్లమెంటు పరిధిలో ఎన్నికల సభ జరుగుతుంటే పార్టీ అధ్యక్షురాలిని వేధిస్తున్న అమిత్‌షాతో భేటీ అయిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దారెటో తేల్చుకోవాలని సమావేశానికి హాజరైన నేతలు డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు అద్దంకి దయాకర్‌, సీతక్క తదితరులు విమర్శలు గుప్పించారు. ఈ దఫా ఎన్నికల్లో పార్టీ నాయకత్వం ఎవరికీ టిక్కెట్‌ ఇవ్వదని, కార్యకర్తలకే ఆ బాధ్యతలను అప్పగిస్తామని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అన్నారు. పీసీసీ తరఫున ఆయన్ను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా రేవంత్‌రెడ్డి నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


చండూరులో వర్షంలోనూ నాయకుల ప్రసంగం వింటున్న కార్యకర్తలు

జోరు వర్షంలోనూ...
సభ ప్రారంభానికి ముందు నుంచే చిన్నగా ప్రారంభమైన వర్షం రేవంత్‌రెడ్డి ప్రసంగం సమయంలో ఎక్కువైంది. అయినా కార్యకర్తలు, నాయకులు అక్కడి నుంచి ఎవరూ వెళ్లకుండా రేవంత్‌ ప్రసంగాన్ని విన్నారు. ఆయన సైతం వ్యూహాత్మకంగా ఎక్కడా దూకుడుగా కాకుండా ముఖ్యంగా నియోజకవర్గ కార్యకర్తలకు అర్థమయ్యేలా కోమటిరెడ్డి సోదరులను టార్గెట్‌ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాడర్‌ను ఉత్సాహపరిచేలా మాట్లాడుతూ... ప్రస్తుతం పార్టీ ఎంత కష్టకాలంలో ఉందో చెబుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీకి అండగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పడంతో సభకు హాజరైన కార్యకర్తలు, నాయకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎందరో కార్యకర్తల త్యాగం వల్లే రాజగోపాల్‌రెడ్డికి టిక్కెట్‌ వచ్చిందని, గతంలో పాల్వాయి స్రవంతికి టిక్కెట్‌ ఇవ్వకున్నా రాజగోపాల్‌రెడ్డి విజయానికి ఆమె కృషిచేశారని చెబుతూ గోవర్దన్‌రెడ్డి వారసత్వాన్ని తరచూ ప్రస్తావించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. నల్గొండ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌, భువనగిరి, యాదాద్రి డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, చెవిటి వెంకన్న, స్థానిక నేతలు హాజరయ్యారు.


కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తేవాలి

- జానారెడ్డి, మాజీ మంత్రి

కార్యకర్తలు మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించటం ద్వారా రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తేవాలి. కాంగ్రెస్‌కు ఎంతో చర్రిత ఉండాలి. కాంగ్రెస్‌ను కాదని వెళ్లినవారికి గుణపాఠం చెప్పాలి.


ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉంటా

- రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ మంత్రి

ఉప ఎన్నికల్లో మును గోడు గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేసే వరకు తాను ఇక్కడే ఉండి కార్యకర్తలకు అండగా ఉంటాను. పార్టీ ఒక్కటే బ్రాండ్‌గా ఉంటుంది తప్ప వ్యక్తులకు బ్రాండ్‌ ఉండదు.


భాజపా, తెరాస రెండు దగా పార్టీలే

- అంజన్‌కుమార్‌యాదవ్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

భాజపా, తెరాస రెండు దగా పార్టీలే. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీకి ఎప్పుడు రుణపడి ఉండాలి. దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్న భాజపాను తరిమి కొట్టాలి.


ఇది కాంగ్రెస్‌ అడ్డా

- షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి...

మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌ అడ్డా.. ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం ఉండదు. నల్గొండ జిల్లాతో నాకు  గతంలో చాలా అనుబంధం ఉంది. రానున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుపు తథ్యం.


మునుగోడు ఉప ఎన్నికలో భాజపాను దెబ్బ కొడితే అది దిల్లీదాక విన్పించాలి. నీను మీతోపాటే ఉంటాను. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి గుణపాఠం చెప్పాలి.

 

- చెరుకు సుధాకర్‌


హామీలు విస్మరించిన సీఎం కేసీఆర్‌కు తగిన బుద్ధిచెప్పాలి. నా తండ్రి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీని మునుగోడు నియోజకవర్గంలో పటిష్ఠం చేశారు. మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ అడ్డా అని నిరూపించాలి.

 

- పాల్వాయి స్రవంతిరెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు


కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్‌ పార్టీని భాజపాకు కుదవపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ ఓ దళారి. వచ్చే ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించకుంటే మీసం తీసుకుంటాను.

 

- పున్న కైలాష్‌నేత, టీపీసీ అధికార ప్రతినిధి

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts