logo

‘భయపడకండి.. వచ్చేది భాజపా ప్రభుత్వమే’

: తెరాస ప్రభుత్వంలో కేసీఆర్‌ కుటుంబానికి కమీషన్లు ఇస్తేనే పనులు జరుగుతాయి.. వీఆర్‌ఏలతో వెట్టిచాకిరి చేయించుకొని వారి సమస్యలపై స్పందించకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Published : 12 Aug 2022 06:23 IST

మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

రామన్నపేట, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వంలో కేసీఆర్‌ కుటుంబానికి కమీషన్లు ఇస్తేనే పనులు జరుగుతాయి.. వీఆర్‌ఏలతో వెట్టిచాకిరి చేయించుకొని వారి సమస్యలపై స్పందించకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం శివారు నుంచి భాజపా ప్రజా సంగ్రామ యాత్ర గురువారం రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో కొనసాగింది. రామన్నపేట తహసీల్దారు కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల సమ్మె శిబిరం వద్దకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. భయపడకండి, వచ్చేది భాజపా ప్రభుత్వమే.. మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో పెట్రో ధరలు తగ్గించాలని స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రామన్నపేటలో కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి నివాళి అర్పించి పాదయాత్ర కొనసాగించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా ప్రభంజనం వీస్తుందని తెలిపారు. మునుగోడులోనూ భాజపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రామన్నపేట ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది లేరని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టంలో పెట్రోలు ధరలు ఉన్నాయని చెప్పారు. పాదయాత్రలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయంబాబురావు, జి.మనోహర్‌రెడ్డి, పీవీ శ్యాంసుందర్‌రావు , బంగారు శృతి, బూడిద భిక్షమయ్య గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మునిపంపులలో రాత్రి దళితుల సమస్యలపై నిర్వహించిన రచ్చబండలో మాట్లాడారు. ఈ సమయంలో ఓ తెరాస కార్యకర్త గ్రామ సమస్యలపై ఏదైనా ఒక్క హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేయటంతో గందరగోళం నెలకొంది. దీనిపై బండి సంజయ్‌ స్పందించి మేము రాష్ట్రంలో అధికారంలో లేము.. అధికారంలోకి రాగానే గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని చెప్పారు. అయినా తెరాస కార్యకర్త వినిపించుకోకపోవడంతో భాజపా కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని తెరాస కార్యకర్తను సభ నుంచి పంపించారు. పాదయాత్ర రామన్నపేటకు చేరుకోగానే 10 ఏళ్ల సమీర్‌ అనే విద్యార్థి సార్‌ నేను మీలాగా ఎంపీనవుతా.. మీలాగానే పెద్దయ్యాక పర్యటిస్తానని చెప్పాడు.దీంతో బండి సంజయ్‌ బాలుడిని మెచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని