logo

తెలంగాణలో దేశభక్తుల పాలన రావాల్సిందే..: బండి సంజయ్‌

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టి, దేశభక్తుల పాలన రావాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా ప్రజా సంగ్రామయాత్ర 12వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మెత్కూరులో ప్రారంభమై

Updated : 15 Aug 2022 06:48 IST

గుండాల: ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బండి సంజయ్‌, నాయకులు

గుండాల, న్యూస్‌టుడే: తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టి, దేశభక్తుల పాలన రావాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా ప్రజా సంగ్రామయాత్ర 12వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మెత్కూరులో ప్రారంభమై గుండాల మండల కేంద్రం, పాచిల్ల, తుర్కలషాపురం, పెద్దపడిశాల, వస్తాకొండూరు, బండకొత్తపల్లి మీదుగా 13 కి.మీ. దూరం కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. గుండాలలో ప్రజలనుద్దేశించి, తుర్కలషాపురంలో రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వాటితో పాటు రైతులకు కేసీఆర్‌ ప్రకటించిన రుణమాఫీ చేయలేదని, ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. రెండు పడక గదుల ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రజలను ఆయన ప్రశ్నించారు. తాను ఎన్నికలు, ఓట్ల కోసమో ఇక్కడికి రాలేదని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రతో మీముందుకు వచ్చానని ఆయన ప్రజలకు వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చాకే నిజమైన చరిత్ర అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలుస్తుందని బండి సంజయ్‌కుమార్‌ వివరించారు. దేశంలో హిందువులమని చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. ముస్లింయేతర సమాజం వల్లనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ఒక్క కాంగ్రెస్‌ కుటుంబం వల్లనే రాలేదని స్పష్టం చేశారు. కొందరు గత చరిత్రను తెరమరుగు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

రచ్చబండలో ప్రజాసమస్యల ప్రస్తావన... తుర్కలషాపురంలో రచ్చబండలో ఇక్కడ ఇసుక మాఫియా కొనసాగుతుందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయని, రెవెన్యూ వ్యవస్థలో సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నామని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదుల నీరు ఇక్కడికి రావడం లేదని ఇంకో రైతు మొరపెట్టుకున్నారు. కేసీఆర్‌ విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని మరొకరు ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అవి కలగానే మిగిలిపోయాయని ఓ నిరుపేద ఆవేదన వ్యక్తం చేశారు. గుండాల మండలంలో ఏ ఒక్కరికీ దళితబంధు రాలేదని ఓ యువకుడు బండి సంజయ్‌కి వివరించారు. బస్టాండ్‌ పశువుల కొట్టంగా మారిందని, విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి వేళకు బస్సులు లేవని, తుర్కలషాపురం అవతల వందమంది రైతులు ఉన్నారని, తమకు వంతెన నిర్మించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎంపీ డాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలని, కేంద్రీయ విద్యాలయాన్ని గుండాలలో ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్‌ సాధనసమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌ వినతిపత్రాలు అందజేశారు. బబ్బూరి సుధాకర్‌తో పాటు పలువురు యువకులు భాజపాలో చేరారు. కార్యక్రమాల్లో భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, మనోహర్‌రెడ్డి, తుమ్మల మురళీధర్‌రెడ్డి, బయ్యని చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని