logo

రసవత్తర రాజకీయం

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే రసవత్తరంగా మారుతోంది. తాజాగా చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తెరాసను వీడి భాజపాలో చేరడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అధికార పార్టీలో కలకలం రేగింది.

Updated : 17 Aug 2022 04:42 IST

చౌటుప్పల్‌ ఎంపీపీ పార్టీ మార్పుతో తెరాసలో కలకలం

ప్రజాప్రతినిధులు చేజారకుండా కాంగ్రెస్‌ నేతల సమీక్షలు

ఈనాడు, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే రసవత్తరంగా మారుతోంది. తాజాగా చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తెరాసను వీడి భాజపాలో చేరడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అధికార పార్టీలో కలకలం రేగింది. దీంతో తక్షణం రంగంలోకి దిగిన మంత్రి జగదీశ్‌రెడ్డి చౌటుప్పల్‌లోనే మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించారు. మరో మూడు రోజుల్లో మునుగోడులో సీఎం సభ జరగనున్న దృష్ట్యా ఈ పరిణామంతో మరింత మంది అసమ్మతి నేతలు సమావేశం పెట్టకుండా పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు 21న మునుగోడులోనే జరిగే అమిత్‌షా సభలో మరింత మంది తెరాస ప్రజాప్రతినిధులు చేరుతారని తాజాగా పార్టీ మారిన తాడూరి వెంకట్‌రెడ్డి ప్రకటించడంతో అధికార పార్టీ మరింత అప్రమత్తమైంది. ఇన్నాళ్లూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడంపై దృష్టి సారించిన తెరాస తాజా పరిణామంతో తమ క్యాడర్‌ను కాపాడుకునే పనిలో నిమగ్నమైంది. నేతలు, కార్యకర్తలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, ఉప ఎన్నికలో సర్వేలన్నీ తెరాసకు అనుకూలంగా ఉన్నాయని అసమ్మతి నేతలను ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నారు. మండలాల వారీగా సమీక్ష సమావేశాలు జరిపి ప్రజాదీవెన సభకు తరలిరావాలని వారు కోరుతున్నారు. ప్రతి మండలంలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులతో పాటు కింది స్థాయి క్యాడర్‌ను కలుస్తున్న మండల ఇన్‌ఛార్జీలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని అధిష్ఠానానికి చేరవేస్తున్నారు.

రాజగోపాల్‌రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్‌
మరోవైపు తన సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలనే వ్యూహంతో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి లక్ష్యంగా మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా మంగళవారం నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో జరిగిన సమావేశాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు హాజరై క్యాడర్‌ చేజారకుండా ప్రణాళికలు వేస్తున్నారు. రానున్న కాలం కాంగ్రెస్‌దేనని, కార్యకర్తలంతా ఏడాది కాలం ఓపిక పట్టాలని వారు క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా సొంత కాంట్రాక్ట్‌ల కోసం కాంగ్రెస్‌ పార్టీని, సోనియాగాంధీని రాజగోపాల్‌రెడ్డి ఎలా మోసం చేశారో తెలియజేయాలని క్యాడర్‌ను నేతలు కార్యోన్ముఖులను చేస్తున్నారు. మరోవైపు ముఖ్య అనుచరులు, కాంగ్రెస్‌ పార్టీ నేతలతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమవుతున్నారు. మంగళవారం చౌటుప్పల్‌లో సమావేశం నిర్వహించి తన వెంట రావాలని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను కోరారు. 21న నిర్వహించనున్న బహిరంగ సభకు జనసమీకరణ చేయాలని, పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. తెరాసలోని అసమ్మతిని తనకు అనుకూలంగా వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ ఆలోచిస్తున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మంది తెరాస ప్రజాప్రతినిధులను పార్టీలో చేరేలా వలసలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. మరోవైపు భాజపా ఇంకా సన్నద్ధత మొదలుపెట్టకపోవడంతో ముందు నుంచీ భాజపాలో ఉన్న కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డి నిర్వహించే సమావేశాలకు హాజరుకావడం లేదు. అమిత్‌షా సభకు మరో నాలుగైదు రోజులే సమయం ఉండటంతో పార్టీ పరంగానూ త్వరలోనే ముఖ్య నేతలు ఇక్కడ రంగంలోకి దిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని