logo

వ్యవసాయ విద్యుత్తు పరికరాల ధరలు రెట్టింపు

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల పరికరాల ధరలు ఒక్కసారిగా పెరిగి రైతులకు భారంగా పరిణమించాయి. ఒక్కో కనెక్షన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ సంస్థలకు ప్రభుత్వం చెలించే రూ.70 వేలు సరిపోకపోవడం లేదు. దీంతో కనెక్షన్ల జారీ మందగించింది.

Published : 17 Aug 2022 04:39 IST

భారం రైతుల పైనే


హుజూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో జరుగుతున్న వ్యవసాయ విద్యుదీకరణ పనులు

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల పరికరాల ధరలు ఒక్కసారిగా పెరిగి రైతులకు భారంగా పరిణమించాయి. ఒక్కో కనెక్షన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ సంస్థలకు ప్రభుత్వం చెలించే రూ.70 వేలు సరిపోకపోవడం లేదు. దీంతో కనెక్షన్ల జారీ మందగించింది. పెరిగిన ధరల భారం భరిస్తూ రైతులు ముందుకొచ్చిన చోటనే కొత్తగా కనెక్షన్లు ఇస్తున్నారు. కనెక్షన్లు ఇవ్వడానికి వినియోగించే సామగ్రి ధరలు పెరిగినా ప్రభుత్వం భరిస్తున్న మొత్తంలో పెంపుదల లేక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అనేక రకాలుగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు పడుతున్న రైతులపై విద్యుత్తు పరికరాల ధరల పెరుగుదల మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా తయారు అయింది.

యుద్ధం ప్రభావమే..
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల పరికరాల ధరలు ఇటీవల అడ్డగోలుగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పరికరాల కొరత వల్ల ధరలు పెరిగాయని విద్యుత్తు సంస్థ అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక్క హుజూర్‌నగర్‌ విద్యుత్తు డివిజనల్‌ (హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాలు) పరిధిని పరిశీలిస్తే.. ఇక్కడ 6,065 వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సీజన్‌లో 2,608 కనెక్షన్లు ఇచ్చే పనులు జరుగుతున్నాయి. వీటికి రూ.24 కోట్లకు పైగా వ్యయం కానుంది. ప్రభుత్వం కనెక్షన్‌కు రూ.70 వేల చొప్పున రూ.18.25 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం చెల్లించే మొత్తం పోనూ ధరల వ్యత్యాసం, అదనపు మెటీరియల్‌ కోసం డివిజన్‌ పరిధిలో 2,608 మంది రైతులు రూ.5.79 కోట్లు భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం అదనపు భారం చెల్లించడానికి ముందుకొచ్చిన రైతుల పనులను వెంటనే చేస్తున్నారు. ధరలు పెరగటంతో ఒక్కో కనెక్షన్‌పై రూ.20 నుంచి రూ.25 వేల వరకు భారం పడుతోంది. దీంతో కనెక్షన్‌ మంజూరైనా దాన్ని కొందరు రైతులు వెంటనే పొందలేని పరిస్థితి తయారైంది.

ఎప్పటికప్పుడు విడుదల చేయక రైతుకు నష్టం
రైతులకు ఏటా కనెక్షన్లు జారీ చేయాలి. కానీ మంజూరులో జాప్యం వల్ల రైతులు పెరిగిన ధరలను భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం విడుదలైన కనెక్షన్లు గతంలో దరఖాస్తు చేసుకున్నవే. ప్రభుత్వం ఆలస్యంగా  మంజూరు ఇవ్వటంతో పరికరాల ధరలు పెరిగి రైతు నష్టపోతున్నాడు.

పరిస్థితి ఇదీ
ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తోంది. దీంతో అవసరమైన రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లు తీసుకుంటున్నారు. నాగార్జునసాగర్‌ సహా వివిధ ప్రాజెక్టులు, ఎస్సారెస్పీ కాల్వల పరిధిలో ఆయకట్టు ఉన్నా సకాలంలో నీరు రానప్పుడు, వారబందీ వల్ల నీరు సరిపోనప్పుడు ఉపయోగించుకునేందుకు, నీటి సౌకర్యం లేని మరి కొందరు రైతులు కూడా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఒక్కో కనెక్షన్‌ జారీ వ్యయం కింద ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ సంస్థకు రూ.70 వేలు చెల్లిస్తుంది. గతంలో ఈ డబ్బుతో వ్యవసాయ విద్యుత్తు పరికరాలకు వచ్చేవి. అంచనాలకు మించి సామగ్రి వాడాల్సి వచ్చిన రైతులు మాత్రం ఆ భారం భరించేవారు.


ధరలు పెరిగిన మాట నిజమే..

శ్రీనివాస్‌, డీఈ, హుజూర్‌నగర్‌ డివిజన్‌

విద్యుత్తు పరికరాల ధరలు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పోగా మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నాలుగైదు నెలల నుంచి ధరలు పెరిగాయి. ప్రస్తుతం డివిజన్‌ పరిధిలో ముమ్మరంగా వ్యవసాయ విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. వర్షాల వల్ల కొన్ని పనులు ఆగిపోయే పరిస్థితి ఉంది. అలా జరిగిన వాటికి వర్షాలు లేని సమయంలో, వ్యవసాయ పనులు జరగనప్పుడు పూర్తి చేస్తాం.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని