logo

అడిగినంత ఇవ్వకుంటే..కరెంటు షా( సా)కులే

ముడుపులిస్తే ముందుకు.. లేదంటే ఆగినట్టే..’ ఇలా డిమాండ్లు పెట్టిమరీ విద్యుత్‌ అధికారులు రైతుల వద్ద వసూళ్లకు తెగబడుతున్నారు. లేదంటే అనివార్యమైన పనుల్ని పక్కన పడేస్తున్నారు. రైతుల్ని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. మానసిక వ్యథకు గురి చేస్తున్నారు. వీరిలో శాఖ వారు కొందరైతే.

Published : 18 Aug 2022 05:09 IST

 అన్నదాతలను ఆర్థికంగా కుంగదీస్తున్న ఘటనలు కోకొల్లలు

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: ‘ముడుపులిస్తే ముందుకు.. లేదంటే ఆగినట్టే..’ ఇలా డిమాండ్లు పెట్టిమరీ విద్యుత్‌ అధికారులు రైతుల వద్ద వసూళ్లకు తెగబడుతున్నారు. లేదంటే అనివార్యమైన పనుల్ని పక్కన పడేస్తున్నారు. రైతుల్ని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. మానసిక వ్యథకు గురి చేస్తున్నారు. వీరిలో శాఖ వారు కొందరైతే.. ఈ శాఖ పేరు చెప్పుకుని జేబులు నింపుకునే అక్రమార్కులు మరికొందరు. రైతుల అవసరాన్నే అవకాశంగా తీసుకుని రెచ్చిపోతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. ఈ ద్వయానికి ముడుపులివ్వకుంటే అన్నీ కరెంటు షా(సా)కులే చూపిస్తున్నారు. ఇక్కడ విశేషమేంటంటే.. జిల్లాలో విద్యుత్‌ శాఖాధికారులను అవినీతి నిరోధక శాఖ వలకు పట్టించే వారు ఆ శాఖ గుత్తేదారులుగా ఉండడం!

జేబులు నింపుకొనే తీరుకు నిదర్శనం
మేళ్లచెరువులో ఇటీవల కాలంలో కొందరు రైతులు రెండు వ్యవసాయ విద్యుత్‌ నియంత్రికలకు డీడీలు చెల్లించారు. వారికి నియంత్రికలతో పాటు దాదాపు 40 స్తంభాలు, లైను అవసరమైన తీగలు మంజూరయ్యాయి. ఇందుకు ఓ అధికారి పేరుచెప్పి రూ.30 వేలు ఒకరు రైతుల నుంచి వసూలు చేశాడు. నెలలు తిరిగినా పనికాలేదు. మళ్లీ ఇదే శాఖకు చెందిన మరొకరు రూ.లక్ష ఇస్తే చేయిస్తానన్నాడు. నగదు పోయినా అవసరం తీరాలంటూ రూ. 50 వేలు ముట్టజెప్పారు. తర్వాత రైతులే నియంత్రికలు తెచ్చుకున్నారు. దిమ్మెలు కట్టుకున్నారు. గుంతలు తీసుకున్నారు. స్తంభాలు పాతుకున్నారు. లైన్లూ లాక్కున్నారు. ఈమధ్యే పనులు పూర్తి చేసుకున్నారు. వాస్తవంగా ఇవన్నీ గుత్తేదారు చేయాల్సిన పనులు. సదరు గుత్తేదారు నగదు మిగిల్చుకునేందుకు తెలివిగా రైతులతో చేయించారు. మొత్తమ్మీద చెల్లించిన డీడీలకు రెట్టింపుగా ముడుపులు చెల్లించాల్సి వచ్చింది. ఇలా వందల సంఖ్యలో వ్యవసాయ కనెక్షన్ల పేరుతో దండుకుంటున్న వైనాలు బోలెడున్నాయి.
దొరికితేనే దొంగ..
అవినీతి నిరోధక శాఖకు దొరికిన వారే ఈ శాఖలో దోషులుగా కన్పిస్తున్నారు. దొరక్కండా దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్న వారు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వారు ఈ వ్యవస్థనే ప్రభావితం చేస్తున్నారు. ఏసీబీకి పట్టుబడినా శాఖలో మార్పు రావడం లేదు. చిన్నపనికీ అధికారులు, సిబ్బంది చేయి తడపనిదే పనులు కావడం లేదు. వీరికి ఈ మధ్య కొందరు గుత్తేదారులు తోడయ్యారు. ఒప్పుకున్న పనిని వీరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. తేడావస్తే పనినే ఎగ్గొడుతున్నారు. వెరసి.. నిర్లక్ష్యానికి ప్రాణాల్నే మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. మేళ్లచెరువు మండలంలో గతంలో ముగ్గురు ఏఈలు, సిబ్బంది సస్పెన్షన్‌కు కారణాలివే.

వారూ వీరూ బంధువులే
ఉమ్మడి జిల్లా విద్యుత్‌ శాఖలో చాలామంది బంధువులే ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు అధికారులు, రిటైర్డైన వారు, కిందిస్థాయి సిబ్బందితో సహా చాలామంది వారి బంధుప్రీతి ప్రదర్శిస్తున్నారని విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. ఈ శాఖ పనులు చేపట్టాలంటే గుత్తేదారులు అవసరం. వివిధ పద్ధతుల్లో పనులు సొంతం చేసుకునేందుకు పైన పేర్కొన్న వారిలో కొందరు వారి బంధువులనే గుత్తేదారు అవతారమెత్తిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. కొన్నేళ్లుగా పనులు ఇలాగే చేపడుతున్నారన్న వాదనలు ఉన్నాయి.  ప్రధానంగా వ్యవసాయ విద్యుత్‌ నియంత్రికల మంజూరు, దిమ్మెల నిర్మాణం, స్తంభాలు, లైన్ల ఏర్పాటు, విద్యుత్‌ లైన్ల మార్పిడి వంటి పనులు చేపట్టే క్రమంలో.. అనుమతులు, లావాదేవీలతో ముడిపడి ఉంటాయనేది బహిరంగ రహస్యమైంది. ఈ క్రమంలోనే పనుల్లో జాప్యం, రైతుల్లో అసంతృప్తి చెలరేగడం, గుత్తేదారులు, అధికారుల మధ్య సమన్వయ లోపం వెరసి.. పైవిధంగా ఏసీబీ కి పట్టుబడే పరిస్థితులకు దారితీస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు