logo

18 నెలలకే తెగిన పేగుబంధం!

ఆ పసి ప్రాణం తల్లిగర్భం నుంచి బయటకొచ్చి 18 నెలలే. పాలబుగ్గలపై చిరునవ్వు లొలికిస్తూ ముందుకొస్తే ముద్దాడని వారుండరు. ముద్దులొలికే పలుకులతో మురిపాన్ని కలిగిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ ఒళ్లోకి చేరుతున్న చిన్నారిని ముద్దాడని క్షణం ఉండదు ఆ తల్లిదండ్రులకు

Published : 18 Aug 2022 05:09 IST

 చిన్నారి ప్రాణాల్ని చిదిమేసిన కారు

చిన్నారి షణ్ముక

చిలుకూరు, న్యూస్‌టుడే: ఆ పసి ప్రాణం తల్లిగర్భం నుంచి బయటకొచ్చి 18 నెలలే. పాలబుగ్గలపై చిరునవ్వు లొలికిస్తూ ముందుకొస్తే ముద్దాడని వారుండరు. ముద్దులొలికే పలుకులతో మురిపాన్ని కలిగిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ ఒళ్లోకి చేరుతున్న చిన్నారిని ముద్దాడని క్షణం ఉండదు ఆ తల్లిదండ్రులకు. కేరింతలు కొట్టే చిన్నారి గొంతు ఒక్కసారిగా మూగబోయింది. మాతృమూర్తి మురిపాలకు దూరమైంది. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఆ చిన్నారి ప్రాణాల్ని అనంత వాయువుల్లో కలిపేసింది. ఈ ఇంట ఆనందాలను ఆవిరి చేసింది. కలలను చిదిమేసింది. చూపరుల హృదయాలను ద్రవింపజేసిన ఈ విషాధ ఘటన చిలుకూరులో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి సంక్రాంతి విజయ్‌ శేఖర్‌- శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు షణ్ముఖ (18 నెలలు). మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమానికి విజయశేఖర్‌ మేనత్త ముండ్ర సరోజనమ్మ కోదాడ మండలం నల్లబండగూడెం నుంచి కొత్తకారులో వీరింటికొచ్చారు. ఎదురుగా ఉన్న ఇంట్లో చెట్టు నీడన ఆ కారును నిలిపారు. కొద్దిసేపటికి దానిపైకి ఎండ రావడంతో నీడలో నిలిపేందుకు చోదకుడు రివర్స్‌ చేస్తున్నాడు. అక్కడే నీడలోనే ఆడుతున్న చిన్నారి షణ్ముఖ కారు కింద ఉన్న చెప్పును తెచ్చుకునేందుకు వెళ్లింది. చిన్నారిని చోదకుడు గమనించలేదు. క్షణకాలంలోనే కారు వెనక తగిలి చిన్నారి కింద పడింది. వెనుక టైరు తల పైకి ఎక్కింది. పెద్ద శబ్దం వచ్చింది. అందరూ ఒక్కసారిగా పరుగున బయటకొచ్చి చూసేసరికి చిన్నారి తల పగిలి ఛిధ్రమైంది. కొన ఊపిరితో కొట్టుకుంటోంది. కోదాడ ఆసుపత్రికి తరలించే లోపే చిన్నారి షణ్ముక మృత్యుఒడికి చేరింది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తమ ఇంటి దీపం ఇలా ఆరిపోతుందని ఊహించలేదని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ మురిపాలు కొద్దికాలం కూడా నిలవలేదని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని