logo

వేర్వేరు చోట్ల నలుగురు బలవన్మరణం

ఉమ్మడి జిల్లాలో వేర్వేరుచోట్ల నలుగురు బలవన్మరణం చెందారు. అప్పుల బాధ తాళలేక రైతు, వేధింపులు భరించలేక మహిళ, మనస్తాపంతో మేస్త్రీ, భయాందోళనతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 18 Aug 2022 05:09 IST

ఉమ్మడి జిల్లాలో వేర్వేరుచోట్ల నలుగురు బలవన్మరణం చెందారు. అప్పుల బాధ తాళలేక రైతు, వేధింపులు భరించలేక మహిళ, మనస్తాపంతో మేస్త్రీ, భయాందోళనతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పురుగు మందు తాగి విద్యార్థిని.. చింతపల్లి, న్యూస్‌టుడే: డిగ్రీ విద్యార్థిని పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన చింతపల్లి మండలం వింజమూరులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వింజమూరుకు చెందిన ఓ యువతి(20) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరింది. కొన్ని రోజులుగా ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 14న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంది. 16న సోదరుడి పుట్టిన రోజు వేడుకలోనూ పాల్గొంది. రెండు, మూడు రోజులుగా నిద్రించే సమయంలో కలలు వస్తున్నాయంటూ కుటుంబ సభ్యుల వద్ద అనూష భయాందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బుధవారం తల్లిదండ్రులు, సోదరుడు ఇంట్లో లేని సమయంలో నేను చనిపోతున్నానని, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని అనూష తన సోదరుడి చరవాణికి సందేశం పంపింది. హుటాహుటిన సోదరుడు గణేశ్‌ ఇంటికి చేరుకోగా అప్పటికే పురుగు మందు తాగింది. స్థానికుల సాయంతో ఆమెను చింతపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో అనూష మృతిచెందింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.  

లైంగిక వేధింపులు తాళలేక మహిళ..
నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆటో చోదకుడు వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్కట్‌పల్లి మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రామకృష్ణ గౌడ్‌ వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన మహిళ(47) స్థానికంగా దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామానికి చెందిన బింగి జానయ్య ఆటో చోదకుడు మూడు నెలలుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. పెద్దల సమక్షంలో కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు జానయ్యను మందలించారు. నాలుగు రోజులుగా చరవాణిలో వేధింపులకు గురి చేస్తుండటంతో మహిళ మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

మనస్తాపంతో సుతారి మేస్త్రీ..  
హుజూర్‌నగర్‌ గ్రామీణం: మనస్తాపంతో సుతారి మేస్త్రీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం గోవిందపురంలో వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జనిగె హరి (35) సుతారి మేస్త్రీగా పనిచేస్తుంటారు. మానసిక స్థితి సరిగ్గా లేక భయంతో మనస్తాపం చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం హరి బంధువులు గమనించి అంత్యక్రియలు నిర్వహించారు.

అప్పుల బాధతో రైతు..
పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: అప్పుల బాధతో పురుగు మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన పీఏపల్లి మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దుగ్యాలకు చెందిన పంగ అంజయ్య(31) తనకున్న రెండెకరాలలో పత్తి సాగు చేస్తున్నారు. పంట దిగుబడి రాకపోవడంతో రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. వీటిని తీర్చే దిక్కు కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన అంజయ్య.. ఈ నెల 13న పత్తి చేను వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు దేవరకొండ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గాంధీలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. అంజయ్యకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని