logo

అన్ని దారులు మునుగోడు వైపే..

రెండు రోజుల వ్యవధిలో సీఎం కేసీఆర్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగ సభలు ఉండటంతో అధికార తెరాస, భాజపా ముఖ్య నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మకాం వేశారు. మండలాల వారీగా జనసమీకరణపై స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు,

Updated : 19 Aug 2022 06:27 IST

- ఈనాడు, నల్గొండ

రెండు రోజుల వ్యవధిలో సీఎం కేసీఆర్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగ సభలు ఉండటంతో అధికార తెరాస, భాజపా ముఖ్య నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మకాం వేశారు. మండలాల వారీగా జనసమీకరణపై స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో జనసమీకరణపై గత కొన్నాళ్లుగా తెరాస ఇన్‌ఛార్జ్‌లు దృష్టి పెట్టినా... స్థానిక నాయకత్వం పట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధుల అసంతృప్తి ఇంకా రగులుతూనే ఉంది. సీఎం సభకు తమను ఆహ్వానించలేదని కొంత మంది నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిఘా వర్గాలతో పాటూ పలు మార్గాల ద్వారా తెరాస అధిష్ఠానం తెలుసుకుంటూ మార్గదర్శనం చేస్తుండటంతో తమకు ఇష్టం లేకపోయినా కొంత మంది నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే సీఎం సభ అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

క్షేత్రంలోకి భాజపా ముఖ్య నేతలు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేయాలనే తలంపుతో మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పార్టీ నియమించిన ఇన్‌ఛార్జ్‌లు గురువారం అన్ని మండలాల్లో పార్టీ క్యాడర్‌తో సమీక్షలు నిర్వహించారు. చౌటుప్పల్‌, నాంపల్లి మండలాల్లో జరిగిన సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ సైతం ఇక్కడే మకాం వేశారు. అమిత్‌షా సభకు ఇంకా రెండు రోజులే ఉండటం, సీఎం సభ సైతం రేపు (20న శనివారం) ఉండటంతో అంతకు మించి జనసమీకరణ చేయాలని పార్టీ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలంతా క్షేత్రస్థాయిలో దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గాన్ని వీడకుండా ఎప్పటికప్పుడు వారి వ్యూహాలకు చెక్‌పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.  

కార్యకర్తలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్‌

తెరాస, భాజపాల నుంచి వస్తున్న ఆఫర్‌లతో ఆయా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న తమ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను కాపాడుకునే పనిలో కాంగ్రెస్‌ పార్టీ నిమగ్నమైంది. ఉప ఎన్నిక ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు మండలాల వారీగా ఉన్న ఇన్‌ఛార్జ్‌లు అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఏడాది కాలం ఓపికగా ఉంటే వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని నచ్చజెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని