logo

లండన్‌లో బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

పిల్లల జీవితాలను అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఉన్నత చదువులకు లండన్‌ పంపారు. కానీ.. కొడుకు విషయంలో వారి ఆకాంక్షలు అర్థాంతరంగా ఛిద్రమయ్యాయి. తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో మునిగిన కూతురికి..

Published : 24 Sep 2022 04:13 IST

రైలు కిందపడటంతో ఛిద్రమైన శరీరం


తాత శంభిరెడ్డితో సాయి మోహన్‌రెడ్డి (పాత చిత్రం)

మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: పిల్లల జీవితాలను అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఉన్నత చదువులకు లండన్‌ పంపారు. కానీ.. కొడుకు విషయంలో వారి ఆకాంక్షలు అర్థాంతరంగా ఛిద్రమయ్యాయి. తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో మునిగిన కూతురికి.. తన కొడుకూ ఇక లేడన్న వార్త తెలీడంతో కుప్పకూలిపోయింది. ఈ విషాదం లండన్‌లో ఈనెల 21తేదీన బుధవారం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడుకు చెందిన అన్నపురెడ్డి కనకారెడ్డి, మేళ్లచెరువు మండలం వేపలమాధారం వాసి గుజ్జల శంభిరెడ్డి కూతురు కవితకు పాతికేళ్ల కిందట వివాహమైంది. వారు హుజూర్‌నగర్‌లో ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్నారు. వారి కూతురు స్వాతి ఎంటెక్‌, కొడుకు   సాయి మోహన్‌రెడ్డి(19) బీటెక్‌ చివరి ఏడాది లండన్‌లోని బర్మింగ్హామ్‌లో చదువుతున్నారు. వారిద్దరూ మేనమామ కూతురు నవ్య, భర్త అజయ్‌రెడ్డితో కలిసి ఉంటున్నారు.. కళాశాలకు 2 నెలలు సెలవులు పార్ట్‌ టైం ఉద్యోగంలో చేరారు. ఈనెల 21వ తేదీన అజయ్‌రెడ్డి, నవ్య ఉదయాన్నే విధులకు వెళ్లిపోయారు. అక్కను సాయి కారులో ఆఫీస్‌లో దింపి నలతగా ఉందని ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం స్వాతి తమ్ముడికి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. ఈ విషయాన్ని స్వాతి అజయ్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పగా అతను వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అంతకుముందే డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్న అజయ్‌కు సాయి రోడ్డుపై కన్పించడంతో పలుకరించగా రూంకి తర్వాత వస్తానని చెప్పాడు. అప్పటి నుంచే ఫోన్‌ పనిచేయలేదు. అనుమానంతో తెలిసిన ప్రాంతాల్లో వెతికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు గురువారం పోలీసులు గుర్తు తెలియని చరవాణి, చెప్పులు, కళ్లద్దాలను చూపించడంతో సాయివిగా గుర్తించారు. సాయంత్రం 5.30 తర్వాత ట్రైన్‌కు ఎదురుగా నిలబడి బలన్మరణానికి పాల్పడ్డారని ప్రమాద ఘటన గురించి పోలీసులు వారికి చెప్పారు. ప్రమాద దృశ్యాలను చూపించారు. రైలు కింద పడటంతో సాయి మృతదేహం ఛిద్రమైంది. ఈనెల 24వ తేదీన సాయి తాత గుజ్జుల శంభిరెడ్డి పెద్ద ఖర్మ వేపలమాధారంలో నిర్వహించనుండగా ఆ కార్యక్రమానికి వెళ్తున్న తల్లిదండ్రులకు ఈ ప్రమాద ఘటన తెలిసి గుండె పగిలినట్టైంది. కొడుకు వద్దకు వెళ్లాలని తల్లి కవిత వీసా కూడా సిద్ధం చేసుకున్నారు. 13వ తేదీన తండ్రి శంభిరెడ్డి మరణించడంతో వాయిదా వేసుకున్నారు. యువకుడి మేనమామ కొండారెడ్డి 19వ తేదీన సాయితో చరవాణిలో మాట్లాడారు. ఆ సమయంలో కొంత దిగాలుగా మాట్లాడినట్లు గుర్తించినా ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానంచలేదని ‘న్యూస్‌టుడే’ కు కొండారెడ్డి చెప్పారు. సాయికి ఏమి ఇబ్బంది వచ్చిందనే విషయం తమకూ అర్థం కావడం లేదని ఆ దంపతులు, బంధువులు తల్లఢిల్లిపోతున్నారు. యువకుడి మరణ వార్తతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని