logo

సీఎం కేసీఆర్‌ పాలన చూసి ఈర్ష్య పడుతున్న మోదీ: మంత్రి

తెలంగాణలో సంక్షేమ పథకాలతో అద్భుత పాలన చేస్తున్న సీఎం కేసీఆర్‌ను చూసి ప్రధాని మోదీ ఈర్ష్య పడుతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోయే విధంగా సీఎం కేసీఆర్‌ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

Published : 24 Sep 2022 04:13 IST


తెరాస కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, చిత్రంలో
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నకిరేకల్‌,
భువనగిరి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తదితరులు

మునుగోడు, న్యూస్‌టుడే: తెలంగాణలో సంక్షేమ పథకాలతో అద్భుత పాలన చేస్తున్న సీఎం కేసీఆర్‌ను చూసి ప్రధాని మోదీ ఈర్ష్య పడుతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోయే విధంగా సీఎం కేసీఆర్‌ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో శుక్రవారం నిర్వహించిన తెరాస కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అందిస్తున్న 24 గంటలు ఉచిత కరెంట్‌ను చూసి గుజరాత్‌ రైతులు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. మానవీయ కోణంలో పరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌పై మోదీ, అమిత్‌షా విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వస్తే వెంటనే పరిష్కరించుకోవాలని, పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దని నాయకులకు సూచించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, నల్గొండ, నకిరేకల్‌, భువనగిరి ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్‌, తెరాస రాష్ట్ర నాయకుడు నారబోయిన రవిముదిరాజ్‌, తెరాస మండల అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, మండల ఉపాధ్యక్షులు మందుల సత్యం తదితరులు పాల్గొన్నారు.

చౌటుప్పల్‌: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రైతులు బిల్లు కట్టకపోతే నిర్దాక్షిణ్యంగా కరెంటు మీటర్లు తొలిగించే కసాయి ప్రభుత్వం ఉందని, ప్రజాక్షేత్రంలో భాజపాకు శిక్ష తప్పదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రాంగణంలో రూ.57లక్షలతో 750 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాము, రూ.10లక్షలతో ప్రహరీ నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో డీసీసీబీ ఛైర్మన్‌ గంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు మద్దతుగా నిలవాలని అన్నారు. ఈ క్రమంలో సభా వేదికపై ఉన్న భాజపాకు చెందిన పీఏసీఎస్‌ డైరెక్టర్లు కిష్టయ్య, సాయిలు, వెంకట్‌రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలారు. ఇది రాజకీయ వేదిక కాదని అభ్యంతరం తెలిపారు. స్వల్ప గలాటా జరిగింది. సభకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు వారిని వేదికపై నుంచి కిందికి దింపి పక్కకు తీసుకెళ్లారు.


చౌటుప్పల్‌ పీఏసీఎస్‌ గోదాము శంకుస్థాపన సభా వేదికపై నుంచి భాజపా డైరెక్టర్లను బయటకు తీసుకెళ్తున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని