logo

ప్రేయసి మాట తప్పడంతోనే ప్రియుడి బలవన్మరణం

లండన్‌లో హుజూర్‌నగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి సాయి మోహన్‌రెడ్డి బలన్మరణానికి ప్రేమ వైఫల్యమే కారణమని తెలిసింది. ఈ ఘటన వెనక కారణాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

Published : 25 Sep 2022 06:26 IST

తీవ్ర మనోవేదనలో కుటుంబం

మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: లండన్‌లో హుజూర్‌నగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి సాయి మోహన్‌రెడ్డి బలన్మరణానికి ప్రేమ వైఫల్యమే కారణమని తెలిసింది. ఈ ఘటన వెనక కారణాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే మిర్యాలగూడకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి అప్పట్లోనే మందలించారు. ఆ తర్వాత ఇంటర్‌ పూర్తవ్వగానే సాయి చదువుల కోసం లండన్‌కు వెళ్లారు. ప్రేయసి కూడా బీటెక్‌ కోసం పంజాబ్‌ వెళ్లింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు వీరు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నాళ్లకు ఇతనూ ఆమెను పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. ముందస్తు ప్రణాళికతో ఈనెల 5వ తేదీన హైదరాబాద్‌ వచ్చారు. కొంత నగదు, బంగారు వస్తువులు తెచ్చి ఆమెకు ఇచ్చాడు. స్నేహితులతో వారిద్దరూ  హైదరాబాద్‌, చెన్నైలో సరదాగా గడిపారు. ఈనెల 13వ తేదీన తాతా మరణించినప్పుడు సాయి హైదరాబాద్‌లోనే ఉన్నారు. అంత్యక్రియలకు రాలేనని చెప్పడంతో కుటుంబ సభ్యులు నమ్మారు. 15వ తేదీన సాయి లండన్‌కు ప్రియురాలు పంజాబ్‌కు వెళ్లిపోయారు. రెండ్రోజులు గడిచిన తర్వాత ఆమెతో ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు.. తను వేరే యువకుడిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా సాయి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య చాలా సేపు వాదన జరిగింది. ఆ తర్వాత ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి ఆ రోజు ఆఫీస్‌కు వెళ్లలేదు. సాయంత్రం రూం నుంచి బయట వెళ్లి డ్యూటీ నుంచి వస్తున్న అన్న అజయ్‌ చూసి పలకరించాడు. ఐనా.. విషయం చెప్పలేదు. నేను తర్వాత వస్తానని చెప్పి ముందుకు కదిలాడు. కొద్దిసేపట్లోనే రైలు పట్టాలెక్కి బలన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని అప్పగించే విషయంలో ఇంకా సందిగ్థం నెలకొంది. సోమవారం వరకు అక్కడి పోలీసులు సమాచారం ఇస్తామని చెప్పినట్టు మృతుని మామ కొండారెడ్డి గోవిందరెడ్డి తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. సాయి లేడన్న బాధతో అక్కడ అక్క స్వాతి, అన్నవదినలు అజయ్‌, నవ్యలు విలపిస్తున్నారు.

ఎమ్మెల్యే పరామర్శ: ఎమ్మెల్యే సైదిరెడ్డి సాయి కుటుంబ సభ్యుల్ని శనివారం పరామర్శించారు. సాయి తాతా శంభిరెడ్డి పెద్ద ఖర్మకు హాజరైన ఆయన వారి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని