logo

వీఆర్‌వోల సర్దుబాటు.. తీరనున్న ఖాళీల కొరత

వీఆర్‌వోలను మున్సిపాలిటీలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. నల్గొండ జిల్లాలోని పాత పురపాలికలతో పాటు కొత్త పురపాలికలకు జూనియర్‌ అసిస్టెంట్లు, వార్డు అధికారులుగా బాధ్యతలు అప్పగించారు.

Published : 25 Sep 2022 06:26 IST

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, పక్కన పుర కమిషనర్‌ రమణాచారి

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: వీఆర్‌వోలను మున్సిపాలిటీలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. నల్గొండ జిల్లాలోని పాత పురపాలికలతో పాటు కొత్త పురపాలికలకు జూనియర్‌ అసిస్టెంట్లు, వార్డు అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులపై భారం తగ్గడంతోపాటు చాలా వరకు అధికారుల కొరత తీరనుంది. జిల్లాలో ఎనమిది పురపాలికలు ఉండగా అందులో కొత్తగా రూపాంతరం చెందిన చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా, నకిరేకల్‌లో ఇప్పటి వరకు ఉద్యోగులను భర్తీ చేయలేదు. దీంతో గత నాలుగేళ్లుగా ఆయా పురపాలిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆయా మున్సిపాలిటీలకు కొత్త పోస్టులు మంజూరు చేసి సిబ్బందిని భర్తీ చేయాలని పలు మార్లు పురఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. వీఆర్‌వోలను గత కొంత కాలం నుంచి విధులకు దూరంగా ఉంచిన ప్రభుత్వం తాజాగా వారిని మున్సిపాలిటీలకు సర్దుబాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 55 మంది వీఆర్‌వోలను 8 మున్సిపాలిటీలకు సర్దుబాటు చేశారు. అందులో నల్గొండ మున్సిపాలిటీకి-6, దేవరకొండ-3, మిర్యాలగూడ-4, చిట్యాల-8, చండూరు-6, నందికొండ-7, హాలియా-7, నకిరేకల్‌-6 మంది చొప్పున కేటాయించారు. వారి అర్హతను అనుసరించి జూనియర్‌ అసిసెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వార్డు అధికారులు. శానిటరీ సూపర్‌వైజర్లు, గణంకాధికారులగా బాధ్యతలు అప్పగించారు.

ఉద్యోగులకు శిక్షణ..రెవెన్యూశాఖ నుంచి మున్సిపాలిటీకి సర్దుబాటు చేసిన ఉద్యోగులకు శనివారం నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా యంత్రాంగం శిక్షణ ఇచ్చింది. మున్సిపాలిటీ కార్యకలాపాలు, పాలన, విధులు, బాధ్యతలు, సేవలు వంటి అంశాలపై విభాగాల వారీగా నల్గొండ పుర కమిషనర్‌ రమణాచారి ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. కొత్తగా వచ్చిన అధికారులు విధి నిర్వహణలో లోపాలు, అవకతవకలు జరగకుండా విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ వారికి సూచించారు. రెవెన్యూశాఖ విధులకు, మున్సిపాలిటీ సేవలకు తేడా ఉంటుందని అందుకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని