logo

వ్యాయామం.. ఆహారం.. ఆరోగ్యానికి ఔషధం

మారుతున్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు బీపీ, మధుమేహం వ్యాధుల బారిన పడుతున్నారు.. నడక, యోగా, ధ్యానం, ఆహార నియమాలతో ఆ రోగాలకు స్వస్తి చెప్పొచ్చని నల్గొండకు చెందిన జిల్లా

Published : 25 Sep 2022 06:29 IST

మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయన్న నిపుణులు
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు


సదస్సులో పాల్గొన్న సీనియర్‌ సిటిజన్లు, యువత

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: మారుతున్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు బీపీ, మధుమేహం వ్యాధుల బారిన పడుతున్నారు.. నడక, యోగా, ధ్యానం, ఆహార నియమాలతో ఆ రోగాలకు స్వస్తి చెప్పొచ్చని నల్గొండకు చెందిన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.మాతృనాయక్‌, విశ్వ హృదయ ఆసుపత్రి గుండె వైద్య నిపుణుడు డా. నరహరి అభిప్రాయపడ్డారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో గుండె సంబంధిత, షుగర్‌ వ్యాధులపై నల్గొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో శనివారం అవగాహన సదస్సు  జరిగింది. స్థానికులు, బాధితులు పాల్గొని వైద్యులకు తమ సమస్యలు వివరించి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వైద్యులు వ్యాధులకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఈనాడు యూనిట్‌ ఇన్‌ఛార్జి పి.ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.


శారీరక శ్రమ లేక జబ్బులు
- డా.మాతృనాయక్‌, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, నల్గొండ

మానసిక ఒత్తిడి, కనీస శారీరక శ్రమ లేకపోవడంతో ఎక్కువ మంది రోగాల బారిన పడుతున్నారు. కొంత కాలం క్రితం వరకు షుగర్‌, గుండె జబ్బులు వంశపారంపర్యంగా 50 శాతం వరకు సంక్రమించేది. కానీ, ప్రస్తుత కాలంలో అలాంటిది పెద్దగా కన్పించడం లేదు. ఎక్కువ శాతం కదలకుండా కూర్చొని చరవాణిలో పనులు చేస్తున్నారు. రేడియేషన్‌ ప్రభావం, తగిన శ్రమ లేని కారణంగా అన్ని వర్గాల వారికి జబ్బులు వస్తున్నాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. వయసు పైబడిన వారిలో హైబీపీ, లోబీపీ వంటి సమస్యలు వస్తాయి. జీవన విధానంలో మార్పులు చేసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయడం మరువకూడదు.


గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు
- డా. నరహరి, విశ్వ హృదయ ఆసుపత్రి గుండె వైద్య నిపుణుడు, నల్గొండ

ఇటీవల అన్ని వర్గాల వారిలో గుండె జబ్బులు పెరిగాయి. వారం రోజుల్లో 24 నుంచి 26 ఏళ్ల వయసు లోపు ఐదుగురు యువకులకు గుండె కవాటాలు వేయాల్సి రావడం బాధ కలిగించింది. ఎక్కువ మందిలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం, పొగ తాగడం, జంకు ఫుడ్డు తీసుకోవడంతో పాటు బీపీ, షుగర్‌ వ్యాధులపై నిర్లక్ష్యం చేయడం కారణంగా గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. ఛాతీ మధ్య నుంచి ఎడమ వైపు నొప్పి రావడం గుండె నొప్పిగా భావించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల మధ్యలో మాత్రమే ఎక్కువగా గుండె నొప్పి వస్తుందనేది గ్రహించుకోవాలి. ఆ లక్షణాలు కన్పిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. కొలెస్ట్రాల్‌ మందులు వాడడం మూలంగా ఇతర సమస్యలు ఎలాంటివి తలెత్తవు. గుండె జబ్బు ఉన్నా లేకపోయినా అన్ని రకాల నూనెలను వాడుకోవచ్చు. కానీ, ఏ నూనెలైనా అతిగా వాడకుండా తగిన మోతాదులో వాడుకోవడం శ్రేయస్కరం. కొనుగోలు చేసిన వాటి కంటే స్వయంగా పట్టించిన నూనెలకు ప్రాధాన్యమివ్వాలి. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వల్ల నష్టం అంతగా ఉండదు.


ఆహార అలవాట్లపై అవగాహన అవసరం
నర్సిరెడ్డి, కాకతీయ కళాశాల నల్గొండ

ప్రతి ప్రకృతి వైపరిత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ‘ఈనాడు-ఈటీవీ’ సంస్థలు ముందువరుసలో ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం, ఆహార అలవాట్లపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. అవగాహన లేని కారణంగానే కొంత మంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు.


 ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
- చొల్లేటి ప్రభాకర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

జీవితంలో ఇతర పనులతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శారీరక శ్రమ, సమయ పాలన ఎంచుకుని యోగా, ధ్యానం సాధన చేయాలి. ఆహార అలవాట్లలో మార్పులు, వైద్యుల సూచనలు తీసుకోవాలి.


 వైద్యసలహా కోసం వచ్చాను
- యండీ జాఫర్‌, విశ్రాంత ఉపాధ్యాయుడు

‘ఈనాడు’ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారని తెలుసుకొని వైద్య సలహాల కోసం ఇక్కడికి వచ్చాను. వయసు పెరిగే సమయంలో బీపీలో తేడాలు ఎలా ఉంటాయో వైద్యుడిని అడిగి తెలుసుకున్నా. జీవన విధానంలో మార్పులు, వ్యాయామం ద్వారా ఎలా ఆరోగ్యం ఎలా మెరుగు పరుచుకోవాలో వైద్యులు సూచనలు ఇచ్చారు.


మధుమేహంపై తగిన సమాచారం పొందా
- శంకరయ్య, విశ్రాంత ఉద్యోగి

ఒక్కసారి శరీరంలో చక్కెర స్థాయి పెరిగిన తరువాత ప్రతి నెలకోసారి క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి. పరిగడుపున ఒకసారి ఏదైన తిన్న తరువాత గంటన్నరకు మరో సారి రక్త పరీక్ష చేయించుకుని షుగర్‌ స్థాయి బట్టి మాత్రలు వాడుకోవాలని సూచించారు. మాత్రలు ప్రతి సారి మార్చాల్సిన పని ఉండదని వైద్యులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని