logo

అమ్మరూపం.. ఆశల దీపం!

‘ఆడపిల్లను ఏముంది పెద్ద చదువులు చదివించేది? ఎన్నటికైనా ఒకింటికి ఇస్తే వెళ్లిపోయేదే కదా? మీ కూతురు వయసుతోటి వాళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా... ఇంకా ఎన్నిరోజులు ఇంట్లో అట్టిపెట్టుకుంటారు..? త్వరగా పెళ్లిచేస్తే బాధ్యత తీరిపోతుంది కదా..?’

Published : 25 Sep 2022 06:31 IST

నేడు కూతుళ్ల దినోత్సవం

చిట్యాల, నూతనకల్, మఠంపల్లి, న్యూస్‌టుడే

‘ఆడపిల్లను ఏముంది పెద్ద చదువులు చదివించేది? ఎన్నటికైనా ఒకింటికి ఇస్తే వెళ్లిపోయేదే కదా? మీ కూతురు వయసుతోటి వాళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా... ఇంకా ఎన్నిరోజులు ఇంట్లో అట్టిపెట్టుకుంటారు..? త్వరగా పెళ్లిచేస్తే బాధ్యత తీరిపోతుంది కదా..?’ ఇంట్లో అమ్మాయి ఉంటే పక్కింటి వాళ్లు, తెలిసిన వాళ్లు, బంధువులు, ముఖ్యంగా మహిళల నోటినుంచి వచ్చే ఇలాంటి ఉచిత సలహాలను మనం వింటుంటాం. కానీ, తమ శక్తిని గుర్తించి ప్రోత్సహించిన సందర్భాల్లో సత్ఫలితాలు సాధించి చూపుతున్నారు పలువురు యువతులు. అబ్బాయిలతో దీటుగా అన్ని రకాల వృత్తులు, ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లోనూ అమ్మాయిలే ఎక్కువగా మన దేశ కీర్తి పతాకాలను ఎగురవేస్తున్నారు. కుమారులు పట్టించుకోని తల్లిదండ్రుల పోషణ బాధ్యతలను చేపడుతున్న కూతుళ్లు కూడా ఉన్నారు. నేడు కూతుళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ    

-జటంగి సైదమ్మ, తాళ్లసింగారం

సైకిల్‌పై కళ్లంపట్టాలు, సద్దితో వ్యవసాయ క్షేత్రానికి వెళ్తున్న సైదమ్మ

తాత, నాన్న, ట్రాక్టర్‌ తిరగబడి భర్త.. ఇలా ముగ్గురు కుటుంబ యజమానులను కోల్పోయి తన ఇద్దరు కుమార్తెలతో ఒంటరిగా మిగిలింది నూతనకల్‌ మండలం తాళ్లసింగారం గ్రామానికి చెందిన జటంగి సైదమ్మ. అమ్మమ్మ, అమ్మ, తన ఇద్దరు కుమార్తెల బాధ్యతలు తానే చూసుకుంటూ కుటుంబానికి అన్నీ తానై తనకున్న వ్యవసాయ భూమిలో సాగుచేస్తూ ఆదర్శ మహిళా రైతుగా నిలిచారు. తన ఇద్దరు కుమార్తెలను నాన్నలేని లోటు లేకుండా పెంచారు. పెద్ద కుమార్తె డిగ్రీ చదివించి వివాహం చేశారు. చిన్నకుమార్తెను తొమ్మిదో తరగతి చదివిస్తున్నారు. అమ్మకు అండగా నిలిచి తన కుటుంబానికి ఏకష్టం రాకుండా భర్త ఉండగా నేర్చుకున్న వ్యవసాయ పనులను ఒంటరిగా చేసుకుంటున్నట్లు సైదమ్మ వివరించారు.

అమ్మ, అమ్మమ్మలతో జటంగి సైదమ్మ (దాచినచిత్రం)


కూతురంటే ఇలా ఉండాలి

సహకార బ్యాంకులో విధి నిర్వహణలో విజయలక్ష్మి

కూతురు అంటే ఇలా ఉండాలి అనేదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి పంచాయతీ పరిధి పెద్దబావిగూడేనికి చెందిన ఈరటి విజయలక్ష్మి. కుటుంబ కారణాల వల్ల ఆమె తండ్రి కుటుంబానికి దూరమయ్యారు. ఆమె తల్లి మంగమ్మ తన తల్లిగారింటికి వచ్చి కూలీపనులు చేసుకుంటూ తన తల్లి లక్ష్మమ్మతోపాటు కూతురు విజయలక్ష్మి పోషణ బాధ్యత తీసుకుంది. అమ్మ ప్రోత్సాహంతో విజయలక్ష్మి నక్కలపల్లి జడ్పీ ఉన్నతపాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కుకుడాల గోవర్ధన్, ఉపాధ్యాయుడు రమేశ్‌ ప్రోత్సాహంతో పదో తరగతి పూర్తిచేశారు. హైదరాబాద్‌ నాంపల్లి కమలానెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉచిత సీట్‌ దక్కించుకున్నారు. తర్వాత హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ పూర్తిచేశారు. బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఈ ఏడాది ఆగస్టులో ఆదిలాబాద్‌ జిల్లాలోని సహకార బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. ఉపాధ్యాయులు, దాతల ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించినట్లు, రానున్న కాలంలో పెద్ద ఉద్యోగాన్ని సాధించి అమ్మను బాగా చూసుకోవాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. 


పట్టుదలతో పట్నం వలసవెళ్లాం

- బత్తిని మల్లేశ్వరి, నూతనకల్‌

అమ్మ, నాన్న ఇద్దరు చెల్లెళ్లతో బత్తిని మల్లేశ్వరి 

వర్షం వస్తే కూలిపోయే ఇల్లు.. మూడు పూటలా కడుపునింపుకోలేని కుటుంబ ఆర్థిక పరిస్థితి నుంచి సొంత ఇల్లు నిర్మించుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచారు నూతనకల్‌కు చెందిన బత్తిని మల్లేశ్వరి. పదోతరగతి పూర్తయ్యాక పై చదువులకు డబ్బు లేక బంధువులను అడిగితే.. ఎవరూ ముందుకు రాలేదు. దూరపు బంధువు సలహా మేరకు హైదరాబాద్‌ వలసవెళ్లి హోటల్‌లో పని చేశారు. తర్వాత ఓ కంపెనీలో పనిచేస్తూ ఇంటర్‌ చదివారు. డిగ్రీ, ఎంబీఏ దూరవిద్య కేంద్రాల ద్వారా పూర్తిచేశారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పైసాపైసా కూడబెట్టి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న సమయంలో బంధువులు పెళ్లి సంబంధాలు తీసుకువచ్చారు. కుటుంబాన్ని చూసుకునేవారు ఉండరని పెళ్లికి దూరంగా ఉన్నారు. చెల్లి పెళ్లిచేశారు. ఎంబీఏ చదువుతో ఓ కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. నూతనకల్‌లో సొంతిల్లు కట్టుకున్న మల్లేశ్వరి తన లక్ష్యం చేరుకున్నట్లు చెబుతున్నారు.


కొడుకులు లేరన్న భావన కలగనివ్వం

మఠంపల్లి: కూతుళ్లు స్రవంతి, శ్రావణితో భాస్కర్‌రెడ్డి దంపతులు

మేం ఇద్దరం ఆడపిల్లలం.. నాపేరు సాముల స్రవంతి. చెల్లిపేరు శ్రావణి. మఠంపల్లి మండలం పెదవీడు మా స్వగ్రామం.. తల్లిదండ్రులు సాముల భాస్కర్‌రెడ్డి, ఊర్మిళాదేవి. వ్యవసాయ కుటుంబం. అమ్మా,నాన్న పొలం పనులు చేసుకుంటూనే నన్ను అమెరికాలో ఎంఎస్‌ చదివించారు. ప్రస్తుతం డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా స్థిరపడ్డాను. చెల్లి ఎంసీఏ పూర్తిచేసి సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. నాన్న మాకోసం పడిన కష్టం కళ్లారా చూశాం. ఆయనకు కొడుకులు లేరన్న భావన ఎప్పుడూ రానివ్వలేదు. వాళ్ల అవసరాలన్నీ మేమే చూసుకుంటాం. వారి కోసం హైదరాబాదులో ఓ ఇంటిని రూ.50 లక్షలతో కొన్నాం. తరచూ మేం వచ్చిపోవడానికి ఇక్కడే ఉండమని చెప్పాం. నాన్న, అమ్మ అల్లుళ్లను కొడుకుల్లా చూసుకుంటారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని