logo

దయచేసి వినండి.. ఇక్కడ రైలు ఆపండి..?

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దున ఉన్న నల్గొండ వాసులకు రైలు ప్రయాణం రోజురోజుకు దూరమవుతోంది. కరోనా సమయంలో రద్దీని నియంత్రించడానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు కొన్ని స్టేషన్లలో రైళ్లు ఆపకుండా నడిపారు.

Published : 25 Sep 2022 06:35 IST

నీలగిరి, భువనగిరి గంజ్‌, న్యూస్‌టుడే : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దున ఉన్న నల్గొండ వాసులకు రైలు ప్రయాణం రోజురోజుకు దూరమవుతోంది. కరోనా సమయంలో రద్దీని నియంత్రించడానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు కొన్ని స్టేషన్లలో రైళ్లు ఆపకుండా నడిపారు. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత రైళ్లను పునరుద్ధరించినా నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరిలలో పలు రైళ్లు ఆపడంలేదు. ఉమ్మడి జిల్లాలో భువనగిరి, నల్గొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లు పెద్దవి. ఇక్కడి నుంచి రైలు ప్రయాణం చేసేవారు అధికంగా ఉన్నారు. అన్ని రైళ్లను ఈ స్టేషన్లలో ఆపాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీలు అనేక సార్లు వినతి పత్రాలు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదు.

నల్గొండ, మిర్యాలగూడలో..

నల్గొండ, మిర్యాలగూడ మీదుగా రోజూ 22 రైళ్లు వాటి గమ్యస్థానాలకు చేరుకుంటాయి. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లను ఈ స్టేషన్లలో ఆపుతున్న అధికారులు సికింద్రాబాద్‌ వైపు వెళ్లేటపుడు ఆపడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. నల్గొండ స్టేషన్‌లో భువనేశ్వర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-సికింద్రాబాద్‌ మధ్య నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-నర్సాపూర్‌ వెళ్లే నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడ నుంచి రేపల్లె వెళ్లే డెల్టా ఎక్స్‌ప్రెస్‌లు ఆగడంలేదు. లింగంపల్లి నుంచి తిరుపతి వరకు నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు మిర్యాలగూడలో ఆగడంలేదు. ఈ ప్రాంత వాసులు తిరుపతి వెళ్లాలంటే నల్గొండ వెళ్లి రైలు ఎక్కాల్సిందే.  

భువనగిరిలో..

కరోనా సమయంలో రద్దుచేసిన సికింద్రాబాద్‌-జనగామ డెమోను నేటికీ పునరుద్ధరించలేదు. మిగిలిన రైళ్లను మాత్రం యథావిధిగా నడుపుతున్నారు.


అన్ని రైళ్లు ఆపాలి
- మాదగోని బిక్షపతి, రైల్వే ప్రయాణికుల సంఘం కమిటీ సభ్యుడు

కరోనా అనంతరం నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి స్టేషన్లలో రైళ్లు నిలపకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. బస్సుల్లో ప్రయాణం చేయడానికి వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితులను సమీక్షించి అధికారులు దీనిపై నిర్ణయం తీసుకోవాలి. సీనియర్‌ సిటిజన్స్‌కు ఇస్తున్న రాయితీని సైతం పునరుద్ధరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని