logo

సేవా రుసుముల గుదిబండ

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల సేవా రుసుముల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.41.86 కోట్లు విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సి ఉంది. వీటి వసూలుకు అధికారులు నానా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు.

Published : 26 Sep 2022 04:24 IST

ఉమ్మడి జిల్లాలో రూ.41.85 కోట్ల బకాయిలు

నల్గొండ జిల్లాపరిషత్‌, న్యూస్‌టుడే

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల సేవా రుసుముల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.41.86 కోట్లు విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సి ఉంది. వీటి వసూలుకు అధికారులు నానా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఫలితంగా విద్యుత్తు పంపిణీ సంస్థ సరైన ఆదాయం లేక కొట్టుమిట్టాడుతోంది. వినియోగదారులు, రైతులు ప్రతినెలా ఛార్జీలు సక్రమంగా చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయి గుదిబండగా తయారవుతున్నాయి. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌కు నెలకు రూ.30 చొప్పున సేవా రుసుం చెల్లించాలి. అత్యధిక మంది రైతులు వీటిని చెల్లించలేకపోతున్నారు. ఒత్తిడి తీసుకొచ్చి వసూలుకు అధికారులు యత్నిస్తున్నా రాజకీయ కారణాలతో వెనకడుగు వేయాల్సి వస్తోంది.

సంస్థకు ఆగిపోయిన ఆదాయం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా ఉచిత విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థకు సేవా రుసుం రూపంలో ప్రతి నెలా రూ.60 లక్షల వరకు ఆదాయం రావాలి. కానీ రైతులు ఈ ఛార్జీలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. దీన్ని గమనించిన విద్యుత్తు సంస్థ అధికారులు రైతుల గృహ విద్యుత్తు కనెక్షన్‌కు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌ లింక్‌ చేశారు. ఆ బకాయిలను గృహ విద్యుత్తు బిల్లులో ప్రత్యేకంగా బకాయిగా చూపుతున్నారు. నెలనెలా గృహ విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నా వ్యవసాయ విద్యుత్తు సర్వీసు ఛార్జీల చెల్లింపును పట్టించుకోవడం లేదు. దీంతో వ్యవసాయ విద్యుత్తు బకాయి చెల్లిస్తేనే గృహ విద్యుత్తు బిల్లు స్వీకరిస్తామని కొన్ని చోట్ల లింక్‌ పెడుతున్నారు. లేదంటే ఇంటికి కరెంటు సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా వివిధ కారణాలతో బకాయిలు అలాగే ఉంటున్నాయి.

బకాయిలు చెల్లించి సహకరించాలి

రైతులు ఉచిత విద్యుత్తు సర్వీసుల సేవా ఛార్జీల బకాయిలు చెల్లించి సంస్థ మనుగడకు సహకరించాలి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. సంస్థకు వచ్చే ఛార్జీలతోనే విద్యుద్దీకరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. రైతులు సహకరించి బకాయిలతోపాటు ప్రతి నెలా రూ.30 చొప్పున సర్వీసు ఛార్జీ చెల్లించాలి. - చంద్రమోహన్‌, ఎస్‌ఈ (ఆపరేషన్స్‌), నల్గొండ సర్కిల్‌

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని