logo

చూసొద్దాం రండి..

అనేక ఉద్యమాలకు ఊపిరి పోసి.. పోరాటాల పురిటి గడ్డగా పేరు గాంచిన ఉమ్మడి నల్గొండ జిల్లా.. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సైతం తనలో ఇమడ్చుకుంది. జిల్లా ప్రజలతో పాటు చేరువలో ఉన్న రాజధాని హైదరాబాద్‌ వాసులకు వారాంతాలు,

Updated : 26 Sep 2022 05:18 IST

ప్రసిద్ధ క్షేత్రాలు.. రమణీయ ప్రాంతాలు..

అద్భుత దృశ్యాలకు నిలయం ఉమ్మడి జిల్లా

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే

అనేక ఉద్యమాలకు ఊపిరి పోసి.. పోరాటాల పురిటి గడ్డగా పేరు గాంచిన ఉమ్మడి నల్గొండ జిల్లా.. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సైతం తనలో ఇమడ్చుకుంది. జిల్లా ప్రజలతో పాటు చేరువలో ఉన్న రాజధాని హైదరాబాద్‌ వాసులకు వారాంతాలు, సెలవు దినాల్లో ఆహ్లాదాన్ని పంచుతున్న చూడదగ్గ ప్రదేశాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. భువనగిరి కోట, యాదాద్రి క్షేత్రం, కొలనుపాక జైన దేవాలయం, ఫణిగిరి బౌద్ధ స్తూపం, పిల్లలమర్రి ఎర్రకేశ్వర ఆలయం, మట్టపల్లి, మేళ్లచెరువు, జాన్‌పహాడ్‌ ఆధ్యాత్మిక క్షేత్రాలు, వాడపల్లి శివాలయం, పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయం, నాగార్జునసాగర్‌, బుద్ధ వనం, దేవరకొండ కోట, బుగ్గ జలపాతాలు జిల్లాలో తప్పకుండా చూడాల్సిన ప్రాంతాలు. మంగళవారం ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.

పర్యాటక అందాల సమాహారం

నాగార్జున కొండపై పురావస్తు ప్రదర్శనశాల

హైదరాబాద్‌ నుంచి 152 కి.మీ. దూరంలో ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాంతాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు. సాగర్‌ ఆనకట్టతో పాటు లాంచీపై కృష్ణా జలాల్లో ప్రయాణించి నాగార్జున కొండపై ఉన్న పురావస్తు ప్రదర్శనశాల ఆకట్టుకునే ప్రదేశాలు. ఇక ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకొన్న ప్రపంచ ప్రఖ్యాత బుద్ధవనంలో అద్భుతాలు సాక్షాత్కరిస్తాయి. పచ్చని కొండల నడుమ, కృష్ణానది ఒడ్డున నిర్మించిన బుద్ధవనం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.


పురాతన ఆలయాలకు నిలయం..

కొలనుపాక జైన దేవాలయం

కొలనుపాక నుంచి పురాతన ఆలయాలకు ప్రసిద్ధి గాంచిన సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశిస్తే.. తొలుత 72 కిలోమీటర్ల దూరంలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రానికి చేరుకోవచ్ఛు బౌద్ధ మత ఆనవాళ్లకు నిలయంగా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో అద్భుత పురాతన స్తూపాలు దర్శించుకోవచ్ఛు అక్కడి నుంచి 40 కి.మీ. ప్రయాణిస్తే పిల్లలమర్రి ఎర్రకేశ్వర ఆలయానికి చేరుకోవచ్ఛు పురాతన శివాలయం దర్శనంతో పాటు ప్రకృతి అందాలు ఆస్వాదించ వచ్ఛు పిల్లలమర్రి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని మట్టపల్లి, 90 కి.మీ. దూరంలో ఉన్న మేళ్లచెరువు, జాన్‌పహాడ్‌ ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకోవచ్చు.

పిల్లలమర్రి ఎర్రకేశ్వర ఆలయం


కొత్త అందాలు తెరపైకి..

మర్రిగూడ మండలంలోని బుగ్గ జలపాతం

మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో పచ్చని కొండల నడుమ ఇటీవలే తెరపైకి వచ్చిన బుగ్గ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. నల్గొండ నయాగారాగా పేరు గాంచిన ఈ ప్రాంతం హైదరాబాద్‌కు 70 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అక్కడి నుంచి రెండు గంటలు ప్రయాణిస్తే నల్గొండ పట్టణ సమీపంలోని పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయానికి చేరుకోవచ్ఛు పురాతన ఆలయ దర్శనంతో పాటు వింతలు, విశేషాలు తెలుసుకోవచ్ఛు అక్కడి నుంచి 70 కి.మీ. దూరంలోని వాడపల్లిలో పురాతన శివాలయం, సమీపంలోని కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రాంతం ఆకట్టుకుంటుంది. వాడపల్లి నుంచి గంటన్నర ప్రయాణిస్తే నాగార్జున సాగర్‌కు చేరుకోవచ్చు.


భువనగిరి నుంచి కొలనుపాక వరకు..

భువనగిరి కోట

హైదరాబాద్‌కు 47 కి.మీ. దూరంలో ఉన్న భువనగిరి పట్టణ నడిబొడ్డున ఉన్న పురాతన కోట జిల్లాతో పాటు జంట నగరాల పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇటీవల ప్రభుత్వం కోటపై ట్రెక్కింగ్‌కు ఏర్పాట్లు చేయడంతో పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతోంది. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే యాదాద్రి దివ్య క్షేత్రం సాక్షాత్కరిస్తుంది. ఇటీవలే ప్రభుత్వం రూ.వందల కోట్లతో ప్రపంచ స్థాయిలో పునర్నిర్మించడంతో భక్తుల తాకిడి పెరిగింది. సెలవు దినాలు, వారాంతాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అక్కడి నుంచి 40 నిమిషాలు, 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలేరు మండలంలోని కొలనుపాక జైన, సోమేశ్వర ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాల ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం వసతిగృహాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని